సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Aug 02, 2020 , 00:00:16

తెలంగాణంలో సంస్కృత మాధుర్యం

తెలంగాణంలో సంస్కృత మాధుర్యం

తెలంగాణ ప్రజల మనసులాగే, ఇక్కడి భాష కూడా విశాలమే. అందుకే తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూనే... ఇతర భాషలను కూడా తనలోకి ఇముడ్చుకుంది. అలా సంస్కృతం నుంచి కూడా కొన్ని పదాలు యధాతథంగానో, కొద్దిపాటి మార్పులతోనో కనిపిస్తాయి. అందుకు సంబంధించిన ఓ కరదీపికను డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ తెలంగాణ భాష సంస్కృత పదాలు అనే గ్రంథంలో వివరించారు. అందులోంచి కొన్ని మధురిమలు...

సమాసాలు: తెలంగాణ పల్లెల్లోని ప్రజలు తమ భావాల్ని వ్యక్తపరచడానికి ఏ భాష పదాలనైనా మాతృభాషతో కలిపి సునాయాసంగా మాట్లాడతారు. అలా సంస్కృత తెలుగు పదాలు కలిసిన సమాసాలు కూడా వ్యవహారంలో కనిపిస్తున్నాయి. వీటిని మిశ్రమ సమాసాలంటారు.  బీడీ కుతి, చుట్ట కుతి అనే మాటల్ని పల్లెల్లో బాగా వింటాం. ఇక్కడ కుతి అనే పదం కుతుకం అనే సంస్కృత పద మూలమని వివరించారు భాస్కర్‌. రెండు అంత్రాల బస్సు. మూడు అంత్రాల బంగ్లా అనే చోట సంస్కృత అంతరమే తెలుగులో అంత్రంగా  మారిందన్నారు రచయిత.

వాక్యాలలో సంస్కృత పదాలు: అర్థవంతమైన  పదాల కలయికే వాక్యం. అలాంటి తెలంగాణ భాషా వాక్యాలలో సంస్కృత పదాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వాని కళ్లకు  చత్వారం వచ్చింది అంటూ ఉంటాము కదా! సంస్కృతంలో చత్వారి అంటే నలభై అని అర్థం. దాదాపుగా 40 ఏండ్లకు చత్వారం వస్తుందని అర్థం. ఆపతికి సంపత్తికి అందుతుందనే వాక్యమూ ఇలాంటిదే. ఆపతిని సంస్కృతంలో ఆపత్తి (ఆపద, కష్టం) అంటారు. అలాగే సంపతి  పదం కూడా సంపత్తి (సంపద) అనే సంస్కృత పదమే. 

సామెతలు : తెలంగాణ భాషకు సామెతలు గుండెకాయ  లాంటివి.  ఇలాంటి సామెతల్లోనూ సంస్కృత పదాల  సంయోగాన్ని చూడవచ్చు. అర్తం లేని చదువు ఎర్తం. ఇందులో  అర్థం అర్తంగా, వ్యర్థం ఎర్తంగా  మారింది. దుక్కం లేనోడు  బర్రెను కొనుక్కున్నట్టు , ఇల్లు ఇజారం పొయ్యి బుజారం వంటి సామెతల్లో దుక్కం, దు:ఖం (సం).  ఇజారం, ఆదివారం(సం). బుజారం, (బుధవారం) లాంటి సంస్కృత పదాలుండటాన్ని గుర్తు చేశారు రచయిత. ఉప్పు తింటే ఉష్ణం పప్పు తింటే పైత్యంలో కూడా ఉష్ణం పైత్యం సంస్కృత పదాలే. గతిలేని సంసారం చేయొచ్చు గాని సుతి లేని సంసారం చేయరాదు. ఇందులో సుతికి శృతి సంస్కృత పదమే మూలమంటారు రచయిత.

ఒక భాషలో పదాలకున్న అర్థంలో వచ్చిన మార్పుని అర్థ విపరిణామం అంటారు. తెలంగాణలో దాహం అంటే దప్పి, దప్పిక అని అర్థం సంస్కృతంలో  కాలుట అర్థం. సంస్కృత భాషలో ఆత్మన్‌ శబ్దానికి తాను అని అర్థం. తెలంగాణ వాడుకలో ఆత్మకు ఆప్యాయత, దయ, దానం అర్థంలో వాడుతున్నారని తెలిపారు .

ఒక పదం అర్థం పాత కాలంలో కన్నా తరువాతి కాలంలో విస్తృతమైతే అర్థ వ్యాకోచం అవుతుంది. సర్వ పిండిలో సర్వకు చరువు అనే సంస్కృత పదమే మూలమన్నారు. చరువు అంటే హవ్యాన్ని వండే కుండ. క్రమంగా ఇత్తడి పాత్ర అయినా సర్వకు విస్తరించిందని విశ్లేషించారు.

ప్రాచీన కాలంలోని అర్థం కన్నా ఆధునిక కాలంలో అర్థం సంకుచితమయితే  అర్థసంకోచం అంటారు. మీ దగ్గర ఎన్ని  జీవాలు ఉన్నాయి అనే ప్రశ్నలో జీవాలు అంటే ప్రాణులు అనే విస్తృత అర్థం కాదు,గొర్రెలు మేకలు అనే భావమే వ్యవహారంలో ఉంది. జీవం సంస్కృతమే కానీ తెలుగులో అర్థ సంకోచం జరిగిందని భాస్కర్‌ అంటారు. పతంగులు అంటేసంస్కృతంలో పక్షులు  అని అర్థం. తెలంగాణలో పతంగులు అంటే గాలిపటాలు అనే అర్థం.

దోర్నాలు (తెలంగాణ) తోరణాలు (సంస్కృతం).  తిల్కం (తె) తిలకం (సం), తుర్తి (తె) తృప్తి (సం), తలం(తె) స్థలం( సం), గుడుంబా (తె) గుడం(సం). మూర్తం(తె), ముహూర్తం(సం) మొదలైన ఎన్నో పదాలు సంస్కృతం నుంచి తెలంగాణలోకి వచ్చాయని ఘంటాపథంగా చెప్పారు భాస్కర్‌. ఇలాంటి పదాలు ఇంకెన్నో  ఉన్నాయి.  తెలంగాణ భాష పై ఇంకా విస్తృతమైన పరిశోధన జరగవలసే ఉంది.

- ఎర్రోజు వెంకటేశ్వర్లు,9492557037


logo