బుధవారం 05 ఆగస్టు 2020
Editorial - Aug 01, 2020 , 00:04:45

రాజకీయ అజెండాతో తప్పుడు రాతలు

రాజకీయ అజెండాతో తప్పుడు రాతలు

గత వారం నా వ్యక్తిగత పని మీద ఖమ్మం వెళ్ళాను. నేను వచ్చానని తెలిసి నా దోస్తులు కొందరు కలవడానికొచ్చారు. ‘ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ లొల్లి ఏందన్న..’అని  చర్చ పెట్టారు.  దోస్తులలో రిటైర్డ్‌ టీచర్లు, లాయర్లు ఇతర వ్యాపకాలు చేసుకునే వారున్నారు. ‘మీరు, మీ మిత్రులు, జనం.. ఏమనుకుంటున్నారో ముందు చెప్పండ’ని అన్నాను. ఉపాధ్యాయ మిత్రుడు మాట్లాడుతూ .. రాధాకృష్ణ గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకునేది ఏముంది చెప్పు. ఉద్యమ సమయంలోనే తనకున్న తెలంగాణ వ్యతిరేకతను బయట పెట్టుకున్నాడు. ఆనాడే ఆయనను జనం తెలంగాణ ద్రోహి అని అర్థం చేసుకున్నరు. రాధాకృష్ణ మారాడని ఎవరు అనుకోవడంలేదు అన్నాడు. 

తెలంగాణపై విషం కక్కుతున్న విషయంపై చర్చ సీరియస్‌గా కొనసాగింది. అడ్వకేట్‌ మిత్రుడు జోక్యం చేసుకొని.. ‘మా ఖమ్మం బార్‌ అసోసియేషన్‌లో నాకు, చంద్రబాబు అభిమానులకు మధ్య రోజూ చర్చలు, అరుచుకోవడాలు ఉంటాయి. చంద్రబాబు చర్చ వచ్చిందంటే ఆయన అభిమానులు ఆంధ్రజ్యోతిని, రాధాకృష్ణను ప్రస్తావించకుండా ఉండరు అన్నాడు. దీన్ని బట్టి చంద్రబాబుకు, రాధాకృష్ణకు ఉన్న బంధం ఏమిటో తెలుస్తున్నది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసిన రోజునుంచి తెలంగాణ వచ్చే వరకు మా లాయర్లం రోజూ ఉదయం జిల్లాకోర్టు ముందు ‘జయ జయహే తెలంగాణ’ గేయం పాడి లోపలికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా ఈ బ్యాచ్‌ మాకు అడ్డుపడుతుండేది. ‘తెలంగాణ రాదు, ఆంధ్రజ్యోతి చూడలేదా మా రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ చదవడంలేదా’ అనే వాళ్ళు. తెలంగాణ వచ్చాక నోళ్లు వెళ్ళబెట్టారు. కాంగ్రెస్‌ ఇవ్వదనుకున్నాం, కానీ ఇచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కారు. వాళ్ళ బుద్ధి మారలేదనటానికి ఇదే నిదర్శనం’అన్నాడు.

‘రాధాకృష్ణ, చంద్రబాబు మనిషనీ, అయన ఆలోచనలకు తగ్గట్టుగానే నడుచుకుంటాడ’ని  మరో మిత్రుడు అన్నాడు. ‘ఉద్యమ సమయం లో బాబు ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రజ్యోతిలో కథనాలు రాశాడు. ఏబీఎన్‌ టీవీలో చర్చలు జరిపేవాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది అనే బాధ ఉన్నా, చంద్రబాబు ఏపీ సీఎం అవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అదే సందర్భంలో కేసీఆర్‌ తెలంగాణ సీఎం కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అందుకే కేసీఆర్‌ సీఎం అయిన మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాడు’ అన్నాడు. వ్యాపారం చేసుకునే మిత్రుడు మాట్లాడుతూ- ‘అప్పుడప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తుంటే వాటిని చూసి ఆంధ్రజ్యోతిలో మార్పు వచ్చిందని అనుకునే వాళ్ళం. కానీ మళ్లీ వెంటనే ప్రభుత్వం మీద విషం కక్కుతూ వార్తలు వస్తుంటే ఇదేమిటబ్బా అనుకునే వాళ్ళం. అది వాళ్ళ ఎత్తుగడ అని తర్వాత అర్థమైంద’న్నాడు. రాధాకృష్ణ ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపాడని, అందులో భాగంగానే అమిత్‌ షా తో భేటీ అయ్యాడని మిత్రులు అన్నారు. ‘ఈ నేపథ్యంలోనే వెంకయ్యనాయుడి దగ్గర పని చేసి ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యను ఆంధ్రజ్యోతిలో కాలమిస్ట్‌ గా పెట్టి ఆయనతో బీజేపీని, మోదీని పొగుడుతూ  వ్యాసాలు రాయిస్తున్నాడ’ని చెప్పుకొచ్చారు.  దీన్ని బట్టి వారి మధ్య ఉన్న బంధమేమిటో బహిరంగంగానే తెలుస్తోంది కదా అన్నారు టీచరు.్ల 

‘చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత వ్యూహం మార్చి తన అనుంగు శిష్య బృందాన్ని బీజేపీ లోకి పంపాడ’ని  మా బార్‌ అసోసియేషన్‌ మిత్రులు అన్నారు. ‘సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి.. ఇలా ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు అందరికన్నా ముందే బీజేపీలోకి వెళ్లడమంటే ఏమిటి! కచ్చితంగా బాబు డైరెక్షన్‌లోనే వాళ్ళు బీజేపీలో చేరారు. దానిలో భాగంగానే రాధాకృష్ణ అమిత్‌ షా తో భేటీ అయ్యాడని  అనుకుంటున్నారు’ అన్నారు. అంతే కాదు, అమిత్‌ షా భేటీలో రాధాకృష్ణ ఒక మాట అన్నాడని కూడా అందులో ఒకరన్నారు. దానిలో నిజమెంతో, అబద్ధం ఎంతో తెలియదు.  ‘మీరు నాకు భరోసా ఇస్తే.. నేను కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ను టార్గెట్‌ చేస్తా’ అన్నాడని తెలిసింద న్నారు.  ‘కరోనాను అడ్డం పెట్టుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్నది చంద్రబాబు, రాధాకృష్ణ  లక్ష్యంగా ఉంది. దానికి న్యాయ స్థానాలను కూడా వాడుకోవాలన్నది వాళ్ళ వ్యూహం. అందుకే నిత్యం ఏదో ఒక దానిమీద హై కోర్టులో పిటిషన్‌ లు పడుతున్నాయి’ అన్నాడు.

మా చర్చ జరుగుతుండగా జర్నలిస్ట్‌ మిత్రుడొచ్చాడు. ఆయనతో.. ‘మన మిత్రులు ఆంధ్రజ్యోతి,రాధాకృష్ణ లొల్లి ఏమిటన్న  చర్చ పెట్టార’ని అన్నాను. ఒక నవ్వు నవ్వి ‘ఎందుకన్న.. ఆయన గురించి మాట్లాడుకుని టైం వేస్ట్‌ చేసుకుంటారు. ఆయన గురించి, ఆ పత్రిక గురించి కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది’ అన్నాడు. ప్రజలు ఆంధ్రజ్యోతిని, రాధాకృష్ణ ను పట్టించుకునే పరిస్థితులలో లేరని తెగేసి చెప్పాడు.

‘కరోనా మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచమంతా ఉంది. అమెరికా, ఇటలీ, చైనా, ఫ్రాన్స్‌ ఇలా అనేక దేశాలతో పాటు మన దేశంలో కూడా ఉంది. ప్రపంచ వ్యాపితంగా మరణాలు ఎలా ఉన్నాయో జనం చూస్తు న్నారు. ఇవ్వాళా రేపు సోషల్‌ మీడియాలోఅన్ని వస్తున్నాయి. ఇతర దేశాలతో, దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చుకున్నప్పుడు మన తెలంగాణలో మరణాలు ఎంత తక్కువ ఉన్నాయో తెలుసు. అలాంటప్పుడు ఆంధ్రజ్యోతి కథనాలను ఎవరు పట్టించుకుంటారు. గవర్నమెంట్‌ అయినా ఎంతవరకు చేస్తుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, సకాలంలో వైద్యం చేయించుకోవాలి, ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదు అనే వాదన చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే ప్రైవేట్‌ కార్పొరేట్‌ హాస్పిటళ్లను మాత్రం కంట్రోల్‌ చేయాలని అంటున్నరు. కరోనా వ్వాధి సోకిందంటే కుటుంబసభ్యులే భయపడి  ఆగం అవుతున్నరు. కరోనా వైరస్‌తో చనిపోయాడంటే డెడ్‌ బాడీని తీసుకోవడానికి కూడా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. వాళ్ళు మనో ధైర్యం కోల్పోయే విధంగా మీడియా కథనాలు ఉండకూడదు. కాకపోతే కరోనా పేషేంట్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తప్పులేదు’ అన్నాడు. 

‘గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. పుష్కలంగా నీళ్లు, కరెంట్‌ ఉన్నాయి. సాగు పెరిగింది. నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. పట్టణ ప్రాంతాలలో పనులు సరిగ్గా లేవు. అందరూ పల్లెలకు చేరారు. మన దగ్గర వ్యవసాయ పనులు బాగా ఉన్నాయి. అందరికి రైతు బంధు వచ్చింది. గ్రామీణ ఉపాధి పనులు ముమ్మరంగా ఉన్నాయి. ఆసరా పింఛన్లు వస్తున్నాయి. ఇతర సంక్షేమ పథకాల అమలు ఆగలేదు.  ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటప్పుడు రాధాకృష్ణను, ఆంధ్రజ్యోతి రాతలను ఎవరు పట్టించుకుంటరు? అంత తీరిక ఎవరికి ఉంది చెప్పు’ అని ఆ మిత్రుడు ప్రశ్నించాడు. మీ అభిప్రాయం ఏమిటని నా వైపు చూసిండు. నువ్వు చెప్పిందే కరెక్ట్‌ అన్న. ‘ప్రజలకు కావాల్సినవన్నీ ప్రభుత్వం సమకూరుస్తున్నది. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నది. ఇందుకు ఇటీవల వచ్చిన, వస్తున్న అవార్డులే నిదర్శనం’ అన్నాను.

‘తలసరి ఆదాయంలో, కొనుగోలు శక్తిలో, వృద్ధి రేటులో తెలంగాణ టాప్‌లో ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఉండవని కాదు. వాటిని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసి తద్వారా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకునే రాజకీయ పాత్రను పత్రికలు పోషించకూడదు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం వేరు. రాజకీయ అజెండాతో వార్తలు, వార్తా కథనాలు రాయడం వేరు. పరిశోధనాత్మకమైన వార్తా కథనం పేరుతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని రాధాకృష్ణ అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆంధ్ర జ్యోతి పొలిటికల్‌ అజెండాతో పని చేస్తుందేమో అనే అనుమానం వస్తున్నది. బహుశ కేసీఆర్‌ దీన్ని గమనించే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడనుకుంటున్న. ఇది అందరికి అర్థం అయ్యిందనుకుంటున్నాను. ఎందుకంటే! రాధాకృష్ణ ట్రాక్‌ రికార్డు చూసిన వారు ఆయన పొలిటికల్‌ అజెండాతోనే పేపర్‌ నడుపుతాడని అంటారు. పొలిటికల్‌ మోటివ్‌తో ఆంధ్రజ్యోతిలో కథనాలు రాస్తున్నప్పుడు వాటికి కౌంటర్‌ ఇవ్వకతప్పదు కదా’ అన్నారు మిత్రులు.


logo