గురువారం 13 ఆగస్టు 2020
Editorial - Aug 01, 2020 , 00:04:46

కరసేవ తేదీలపై విభేదాలు

కరసేవ తేదీలపై విభేదాలు

ఆరో అధ్యాయం కొనసాగింపు..

శంకరాచార్య ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం విస్తృతమైన రక్షణ ఏర్పాట్లను చేసింది. ఆ పథకానికి మద్దతు పలికే సాధువులెవ్వరినీ అయోధ్యలోని తమ పీఠాలనుంచి బయటకు రానివ్వలేదు. యాదవ్‌ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు శంకరాచార్య ఆయన అనుయాయుల పథకాన్ని పారనివ్వలేదు. ఎలాగయితేనేం చివరకు మే 7న ఆయన అనుయాయుల్ని అరెస్టయ్యేందుకు బారాస్థాన్‌ వద్దకు చేరుకునేందుకు అనుమతించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో 71 మంది సాధువుల క్రియాశీలుర తొలి జట్టును అరెస్టుచేయటం జరిగింది. క్రియాశీలురు-జయ, నంద, భద్ర, పూర్ణ అనే నాలుగు శుద్ధి చేయబడిన ఇటుకల్ని శిలాన్యాస్‌ కొరకు తీసుకెళ్తుండగా పోలీసులు వెంటనే వాళ్లను నిర్బంధించారు. అలాగే 1989లో వీహెచ్‌పీ పూజచేసిన ఇటుకల్ని భద్రపరచిన వేదమందిర్‌ కాంప్లెక్స్‌ వద్ద మరో నలభై నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ కాంప్లెక్స్‌ ప్రధాన పూజారి, వీహెచ్‌పీకి గట్టి మద్దతుదారు శంకరాచార్య వర్గంలో చేరిపోయారు. అరెస్టు చేసిన వారందర్నీ సాయంత్రం వదిలేశారు. వివాదంలో ఉన్న కట్టడం ప్రధాన పూజారి బాబా లాల్‌దాస్‌ వీహెచ్‌పీ వైఖరికి విరుద్ధంగా ఉన్నారు. ఆయన్నీ నిర్బంధించారు. 

మే 9వ తేదీన స్వామి స్వరూపానంద అజమ్‌ఘడ్‌ మేజిస్ట్రేట్‌ అర్ధరాత్రి ఉత్తర్వులవల్ల విడుదలయ్యారు. ఆయన వారణాసి చేరుకోగానే హనుమాన్‌ ఘాట్‌ ప్రాంతంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. 

అనుకున్న విధంగా శంకరాచార్య పథకం పూర్తిగా కార్యరూపం దాల్చకపోయినా అది ప్రకంపనలను పుట్టించింది. శ్రీ వీపీ సింగ్‌కు సామరస్య పూర్వక పరిష్కారానికి యిచ్చిన నాలుగు మాసాల గడువు పూర్తయ్యింది. నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కోర్టు ఉత్తర్వులకోసం ఎదురుచూడవలసిన పనిలేదనే వీహెచ్‌పీ కఠిన వైఖరి, కోర్టు ఉత్తర్వుల్నే పాటిస్తామనే ప్రభుత్వ వైఖరుల కారణంగా సామరస్య పూర్వక పరిష్కారానికి అవకాశాలు సన్నగిల్లాయి. వీహెచ్‌పీ వ్యూహకర్తలకు ఏదో ఒకటి చేయాలని ఉందిగాని పరిస్థితులు వాళ్లకు అనుకూలంగా లేవని గ్రహించారు. గతంలో వలె గాక ఇప్పుడు ప్రభుత్వం వాళ్లను అడ్డుకునేందుకు కంకణం కట్టుకు కూర్చుంది. కనుక తొలిసారిగా అది నేరుగా ప్రభుత్వాన్ని ఢీకొట్టవలసి ఉంది. 

వీహెచ్‌పీ నాయకత్వంలోని ఒక వర్గం వారు కరసేవను 1990 అక్టోబర్‌ 30 నుంచి గాని, నవంబర్‌1 నుంచి గాని ప్రారంభించేందుకు సముఖులుగా ఉన్నారు. ఇంకో వర్గం వారు ఐదు మాసాలు ఆగేందుకు అంగీకరించక జూలైలో ప్రారంభించాలన్నారు. అవి రెండూ మంచి రోజులే. కానీ సాధువులలోని ప్రముఖులు కొందరు ఇంకా ఐదు మాసాలు ఆగేందుకు అంగీకరించక జూలైలో ప్రారంభించాలన్నారు. ముహూర్తం అంత దూరంగా పెడితే మందిర నిర్మాణాన్ని వాయిదా వేసేందుకు అదొక వంకగా భావిస్తారని, పైగా మందిర ఉద్యమం దేశమంతటా నిర్వహింపబడింది కనుక మరో రెండు మాసాల సమయం చాలన్నారు. అయోధ్యలోని మతపరమైన తిరునాళ్లతో ఆ తేదీలను జతచేసే విషయంలో కూడ ఏకాభిప్రాయం కుదరలేదు. అక్టోబర్‌ 30 అయోధ్యలో పరిక్రమ (ప్రదక్షిణ)పాటిస్తారు. నవంబర్‌ 1 కార్తీక పౌర్ణమి. ఆ రెండూ లక్షలాది మంది జనం అయోధ్యకు తరలివచ్చే తిథులే. అటువంటి తిరునాళ్ల రోజుల్లో అయితే వాళ్ల క్రియాశీలుర్ని భక్తులతో కలిసిపోయి అయోధ్యకు చేరుకోవటాన్ని ప్రభుత్వం అడ్డుకొనజాలదని వీహెచ్‌పీ వ్యూహకర్తలు భావించారు. పైగా అటువంటి రోజుల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించజాలదు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)

తాజావార్తలు


logo