గురువారం 13 ఆగస్టు 2020
Editorial - Aug 01, 2020 , 00:04:47

నిరాడంబరం పీవీ పరివారం

నిరాడంబరం పీవీ పరివారం

ప్రధానిగా పీవీ గారు బాధ్యతలు స్వీకరించిన ఒకటి రెండురోజుల్లోనే వంగర గ్రామంలో చాలా  మార్పులు జరిగాయి. హుస్నాబాద్‌-హన్మకొండ మెయిన్‌ రోడ్‌ ను కలుపుతూ వంగర గ్రామానికి  కొత్తగా డాంబర్‌ రోడ్‌ వేశారు. ఊళ్ళో కొత్తగా కమ్యూనిటీ హాల్‌, టీటీడీ కల్యాణ మండపం వచ్చాయి. స్కూల్‌కు రంగులు వేశారు. ఆయన దగ్గర బంధువులు అందరికి ప్రభుత్వం పోలీస్‌ సెక్యూరిటీ ఇచ్చింది. ఆనాడు నక్సలైట్ల కదలికలు ఎక్కువగా ఉండేవి. 

ప్రధానిగా పీవీ గారు బాధ్యతలు స్వీకరించిన ఒకటి రెండురోజుల్లోనే వంగర గ్రామంలో చాలా  మార్పులు జరిగాయి. హుస్నాబాద్‌-హన్మకొండ మెయిన్‌ రోడ్‌ ను కలుపుతూ వంగర గ్రామానికి  కొత్తగా డాంబర్‌ రోడ్‌ వేశారు. ఊళ్ళో కొత్తగా కమ్యూనిటీ హాల్‌, టీటీడీ కల్యాణ మండపం వచ్చాయి. స్కూల్‌కు రంగులు వేశారు. ఆయన దగ్గర బంధువులు అందరికి ప్రభుత్వం పోలీస్‌ సెక్యూరిటీ ఇచ్చింది. ఆనాడు నక్సలైట్ల కదలికలు ఎక్కువగా ఉండేవి. 

వరంగల్‌కు 1994 అక్టోబర్‌ 19న పీవీ గారు ప్రధాని హోదాలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. నేను జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్నాను. కలెక్టర్‌గా అజయ్‌ మిశ్రా వున్నారు. ప్రధానిని రిసీవ్‌ చేసుకున్న తరువాత వారు జిల్లా సరిహద్దులు దాటేవరకు అధికారులందరికి కంటిమీద కునుకు లేదు. 

ప్రధాని కార్యక్రమంలో జిల్లా పాత్రికేయుల సమావేశం లేదు. పీవీ గారి తమ్ముడు పీవీ మనోహర రావుగారి కుమారుడు మదన్‌ మోహన్‌ వరంగల్‌ జిల్లా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు. ఆయన అల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌ విలేకరిగా కూడా పనిచేస్తున్నారు. ప్రధానిని కలువడానికి అతన్ని సంప్రదించాము. మదన్‌ మోహన్‌ చొరవతో మాకు ప్రధాని పర్యటన రెండవ రోజు ఉదయం 7. 30  గంటలకు అపాయింట్‌ మెంట్‌ దొరికింది. మదన్‌ మోహన్‌తో పాటు నేను వివిధ పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులు ఉన్నారు. 

 పీవీ గారంటే నాకున్న అభిమానం గురించి ఈ సందర్బంగా ఒక్కసారి మననం చేసుకోవాలనిపిస్తున్నది. మావూరు హుస్నాబాద్‌. నాటి కరీంనగర్‌ జిల్లాలో ఉండేది. మా ఊరి దొరగారి పేరు బొప్పరాజు లక్ష్మికాంతరావు గారు. పీవీ గారికి స్వయానా వియ్యంకుడు. మా ఊరి దొరగారంటే మాకెంతో గౌరవంతో కూడిన భయం. ఇందుర్తి నియోజకవర్గం నుండి వరసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. ప్రతి బతుకమ్మ పండుగ రోజున దొరగారు బాజా భజంత్రీలతో ముందు నడుస్తుంటే ఊరు ఊరంతా ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అందరూ పెద్ద పెద్ద బతుకమ్మలతో దొరగారి వెంట నడుస్తూ ఊరి చివరిలో వున్న ఎల్లమ్మ చెరువుకట్ట మీదకు వెళ్లి బతుకమ్మలు ఆడుకుని సాయంత్రం ఏడుగంటల వరకు ఇళ్లల్లోకి చేరుకునే వారం. మా ఇంటి ఎదురుగా వున్న బుక్క సువ్వమ్మ కుటుంబం దొరగారింటిలో పని చేసేవారు. దొరగారి రెండవ కూతురుకు పీవీ గారి కుమారుడు రాజేశ్వరరావు గారితో వివాహం జరిగింది. ఆ వివాహానికి హాజరైన బుక్క సువ్వమ్మ కుటుంబ సభ్యులు వారి కూతురు రాజేశ్వరి మా ఇంటిలో వర్ణించి చెబుతుండేవారు. ఆ రోజుల్లోనే పీవీ గారి గంభీరమైన ముఖ కవళికలు, తోటి వారిపట్ల వారి ప్రేమ, ఆదరణ అభిమానం అద్భుతమని చెప్పడం నాకింకా గుర్తు. 

మా పెద్ద అక్కయ్య వాళ్ళు ముల్కనూరు గ్రామంలో ఉండేవారు. హుస్నాబాద్‌ నుండి ముల్కనూరు వెళ్లాలంటే పీవీ గారి ఊరు వంగర మీదుగా వెళ్ళాలి. గట్ల నర్సింగాపూర్‌ భీమదేవరపల్లి గ్రామాల మధ్య వంగర క్రాస్‌ రోడ్‌ ఉండేది. జనం ఉంటే బస్సును ఆపేవారు. ఏభై  ఏళ్ల క్రితమే ముల్కనూరు సహకార బ్యాంక్‌ ఆసియాలోనే గొప్పదిగా పేరు గాంచింది. బ్యాంకు  అభివృద్ధిలో విశ్వనాథరెడ్డి గారితో పాటుగా పీవీ గారి పాత్ర ఎంతో వుంది. ఒక్క వంగర గ్రామం కాదు, ఆ చుట్టూరా వున్న భీమదేవరపల్లి, ఎర్రబెల్లి, కొత్తకొండ, ఎల్కతుర్తి, హుజురాబాద్‌, సింగపురం తదితర గ్రామాలతో ఎంతో సన్నిహిత సంబంధాలు పీవీ గారికి ఉండేవి.

1994 లో ప్రధానిగా పీవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వంగర గ్రామానికి ఒక్కసారిగా నూతన శోభ వచ్చింది. ఢిల్లీ నుంచి పాత్రికేయ బృందం తో పాటుగా దూరదర్శన్‌ కెమెరా యూనిట్‌ బృందం మరో నాలుగు రోజుల్లో వంగర గ్రామాన్ని సందర్శించనుందని ఢిల్లీ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వారు వరంగల్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. వెంటనే వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అజయ్‌ మిశ్రా గారు ఆ లేఖ ప్రతిని జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న నాకు పంపించి తగిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. 

అదే రోజు సాయంత్రం మదన్‌ మోహన్‌తో చర్చించి ఇరువురం వంగర గ్రామానికి వెళ్ళాం. అప్పటికే పీవీ ఇంటిముందు పెద్దఎత్తున పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాటు అయిపొయింది. సుమారు 15 మంది పోలీసుల బృందం మమ్మల్ని ఆ ఇంటివైపు వెళ్లనీయలేదు. మదన్‌ మోహన్‌, ఇతర ఊరి పెద్దలు కల్పించుకోవడంతో  మమ్మల్ని ఇంట్లోకి పంపించారు. నిజానికి ఆ ఇంట్లో అప్పటికి ఎవరూ లేదు. హైదరాబాద్‌లో,  వరంగల్‌ లో సెటిల్‌ అయిపోయారు. 

వంగరలో పీవీ గారు వున్నపుడు ఆయన అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, పనివాళ్ళతో ఆ ఇల్లు ఎంతో  సందడిగా ఉండేదని మదన్‌ మోహన్‌ చెప్పాడు. వంగర లోని పీవీ గారి ఇల్లు ఒక పెద్ద గడీ లాగ ఉంటుంది. ఇంటిముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఒక పెద్ద పురాతనమైన భవనం చుట్టూ ఎత్తుగా  నిర్మించిన మట్టి గోడలు ఉన్నాయి. ఆ భవనంలో ఎన్నో గదులతో పాటుగా వంటిల్లు, పూజ గది ఉన్నాయి. పెద్ద పెద్ద చెక్క కుర్చీలతోపాటు, కొన్ని గదుల్లో నులక మంచాలు, మరికొన్ని గదుల్లో నవారు మంచాలు వున్నాయి. ఇంట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో అన్నీ దుమ్ము పట్టి వున్నాయి. పీవీ గారు ఈ కుర్చీలోకూర్చుని చదువుకునేవారు అని మదన్‌ మోహన్‌ ఒక పెద్ద ఈజీ చైర్‌ చూపించారు. ఆ కుర్చీయే దేశానికి  ఒక గొప్ప వ్యక్తిని అందించిందని ఆనాడే ఎంతో మురిసిపోయాం. ఒక అరగంట ఆ భవనం లోని అన్ని గదులను తిరిగి ఊరిలోకి బయలుదేరాం. అప్పటికే తమ ఊరివాడు ప్రధాని అయ్యారనే సంతోషంతో ఎంతోమంది రైతులు మురిసిపోతూ చెపుతున్నారు. పీవీ నేను కలిసి తిరిగాం అని ఒకరు, కలిసి చదువుకున్నాం అని మరొకరు చెప్పడం నామదిలో ప్రతి ధ్వనిస్తూనే వున్నాయి. వంగర గ్రామంలో తిరుగుతుంటే నాకు ఆనాడు శరీరంలో వైబ్రేషన్స్‌ వచ్చాయి. ఈ గ్రామంలోని వాడేనా దేశానికి ప్రధాని అయిందనిపించింది.

నాడు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా సీబీఎస్‌ వెంకటరమణ ఉండేవారు. ప్రధానిగా పీవీ గారు బాధ్యతలు స్వీకరించిన ఒకటి రెండురోజుల్లోనే వంగర గ్రామంలో చాలా  మార్పులు జరిగాయి. హుస్నాబాద్‌-హన్మకొండ మెయిన్‌ రోడ్‌ ను కలుపుతూ వంగర గ్రామానికి  కొత్తగా డాంబర్‌ రోడ్‌ వేశారు. ఊళ్ళో కొత్తగా కమ్యూనిటీ హాల్‌, టీటీడీ కల్యాణ మండపం వచ్చాయి. స్కూల్‌కు రంగులు వేశారు. పీవీ గారు ప్రధాని అయినవెంటనే ఆయన దగ్గర బంధువులు అందరికి ప్రభుత్వం పోలీస్‌ సెక్యూరిటీ ఇచ్చింది. ఆనాడు నక్సలైట్ల కదలికలు ఎక్కువగా ఉండేవి. ఊళ్లోకి వెళ్లాలంటే భయంగా ఉండేది. పీవీ బంధువులు ఒకరిద్దరు గొప్పగా చెప్పుకుని తిరిగి ఉండవచ్చు గానీ, చాలామంది  తమ చదువులు, వ్యాపారాలు చేసుకుంటూ చాలా లోప్రొఫైల్‌ లో ఉండేవారు. పీవీ తమ్ముడి కొడుకైన మదన్‌ మోహన్‌ కూడా ఏనాడూ ప్రధాని తన పెదనాన్న అని చెప్పుకోలేదు. ఇదీ వారి కుటుంబ సభ్యుల్లో దాగిన గొప్ప గుణం.

-కన్నోజు మనోహరా చారి,

79950 89083logo