మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 30, 2020 , 23:35:43

పల్లెలు కళకళ, సాఫ్ట్‌వేర్‌ ధగధగ

పల్లెలు కళకళ, సాఫ్ట్‌వేర్‌ ధగధగ

దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. ‘భారత దేశ ఆత్మ గ్రామాల్లో ఉంది’ అన్నారు మహాత్మా గాంధీ. గ్రామాల అభివృద్ధి, పట్టణాల పురోగతి, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక  మార్పులు సమాంతరంగా సాగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అన్ని రంగాలు పరస్పర అనుసంధానంతో ముందుకు వెళితేనే ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు సాధ్యమవుతుంది. భవిష్యత్‌ సంక్షోభాల్ని కూడా అంచనా వేయగలిగితే ప్రతికూల ఫలితాలు దరిచేరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఒకవేళ సమస్యలు ఎదురైనా ప్రణాళికాయుతంగా బయటపడొచ్చు. దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనా విధానం కలిగిన పీవీ నరసింహారావు గారు అలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. 

పీవీ నరసింహారావు గారికి గ్రామీణాభివృద్ధిపై మక్కువ, అవగాహన ఎక్కువ. గ్రామీణ స్వరూపంలో మెరుగైన మార్పులు సాధించడం, ఆర్థికంగా బలోపేతం చేయడంపై స్పష్టమైన అవగాహన పీవీ గారి సొంతం. ఆ నేపథ్యంలోనే తాను ఏ పదవిలో ఉన్నా గ్రామీణాభివృద్ధికి ఏదైనా చేయాలని తపించేవారు.  ఆ తపనను నెరవేర్చే క్రమంలోనే ఆర్థిక సంస్కరణల ఆలోచన ఉత్పన్నమైందని చెప్పవచ్చు. 

అది.. 1944 నాటి కాలం. పీవీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వగ్రామం వంగరకు వచ్చారు. దాదాపు ఏడాది పాటు గ్రామంలోనే ఉన్నారు. ఊరిలో ఉన్నప్పుడు గ్రామీణ వ్యవస్థను క్షుణ్నంగా పరిశీలించారు. వంగర గ్రామీణ స్వరూపంపై అధ్యయనం చేశారు. గ్రామాలు సమగ్రాభివృద్ధిచెందాలంటే సమూల మార్పులు అవసరమనే అభిప్రాయానికి అప్పుడే వచ్చారు. భూసంస్కరణలకు కూడా అప్పుడే ఆలోచన బీజం పడినట్టు భావించవచ్చు. గ్రామాభివృద్ధి అంటే.. ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందడం కాదని పీవీ భావించేవారు. గ్రామాల అభివృద్ధికి దోహదం చేసే వివిధ అంశాల్ని, శాఖల భాగస్వామ్యాన్ని సునిశిత పరిశీలనతో స్పష్టంగా వివరించేవారు. స్వచ్ఛమైన తాగునీరు, మహిళా సాధికారత, ప్రాథమిక విద్య, ఆరోగ్యం, చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు, పశు సంవర్ధకం, పౌల్ట్రీ, చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధి, చేనేత సహా అనేక రంగాల సమ్మిళిత అభివృద్ధి జరగాలని పీవీ విశ్వసించేవారు. 

అది.. 1991 నాటి కాలం. దశాబ్దాల కిందటే గ్రామాల స్వరూపం, సమగ్ర అభివృద్ధిపై స్పష్టత కలిగిన పీవీ.. పల్లెల పురోగతి కీలకమని భావించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖను తనవద్దే పెట్టుకుని, గ్రామాల అభివృద్ధికి సంకల్పించారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తూనే భారీ ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూర్చారు. సంస్కరణలు ప్రవేశపెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదే నిర్ణయమే అయినప్పటికీ ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందని పీవీ భావించారు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆర్థికసంస్కరణలు చేపట్టినప్పుడు కూడా ఫలితం, పర్యవసనాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించే పరిస్థితి లేదు. ఆర్థిక సంస్కరణల ఫలితం ఎలా ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా గ్రామాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. సంస్కరణల ఫలితంగా సామాజిక అసమానతలు పెరిగితే సమస్యగా మారుతుందని, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా సమన్వయం చేసుకుంటూ సరళీకరణ ఆర్థిక విధానాలకు బాటలు వేశారు. దుష్పరిణామాలు ఎదురైనా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తత పాటించారు. ‘Reforms with human face‘  లక్ష్యమంటూ మానవీయ కోణంలోనే సంస్కరణలు చేపట్టారు.

సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతులపై పన్ను రాయితీలు ఇస్తే.. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి చర్యలు చేపడతామని నారాయణమూర్తి సహా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు పీవీ గారు ‘మీరు ఏదైనా చేయండి. మీ వెనుకాల నేనున్నాను’ అని భరోసా కల్పించడంతో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. తత్ఫలితంగానే మాదాపూర్‌ సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ ఏర్పడింది.

సంస్కరణలకు ముందు భారీ ప్రాజెక్టులకు, సంక్షేమ పథకాలకు, గ్రామీణాభివృద్ధికి నిధులన్నీ ఖజానా నుంచే వెళ్లేవి. సంస్కరణల తర్వాత దేశంలో విద్యుత్‌, టెలీకం, రోడ్డు, పోర్టు, ఎయిర్‌ పోర్టు సహా పలు పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. వీటిని విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు సంస్థల ద్వారా చేపట్టారు. ఖజానా నిధులను గ్రామీణాభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చించారు. డ్వాక్రా, పీఎం రోజ్‌గార్‌ యోజన, పీఎం సడక్‌ యోజన, ఇందిరా ఆవాస్‌ యోజన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.  కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తలపెట్టిన వివిధ పథకాలకు సంబంధించిన నిధులు దారి మళ్లకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు వెళ్లేలా బైపాస్‌ మోడల్‌ను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించారు. నూతన విధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాటలో నడిచింది. గ్రామీణాభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించడం వల్ల గ్రామాల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. దేశంలో అప్పటివరకు రూ.7000 కోట్లు మాత్రమే గ్రామీణాభివృద్ధికి కేటాయిస్తున్నారు. పీవీ నరసింహారావు ఆ మొత్తాన్ని రూ.30, 000 కోట్లకు పెంచారు. కానీ నిధులు ఎలా అనేది ప్రధాన ప్రశ్న. వేల కోట్ల రూపాయల మేర భారీ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తూనే, గ్రామాల అభ్యున్నతికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సాగిన ఆలోచనల పరంపరకు కొనసాగింపుగా, ఆ సమస్యకు పరిష్కార రూపంగా ఆవిష్కృతమైనవే ఆర్థిక సంస్కరణలు.

2009 నాటికి ఆర్థిక సంక్షోభం యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ ప్రభావం భారత్‌పై స్వల్పంగా పడినా జీడీపీపై పడలేదు. ఇందుకు కారణం.. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం లేదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ అభివృద్ధి అంశంపై 2009లో జరిగిన ఓ సదస్సులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గారు  అన్నారు. మన అద్భుతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే ఇందుకు కారణమని తెలిపారు.  ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభానికి విలవిల్లాడినా మనం సురక్షితంగా ఉండటానికి కారణం పూర్వ ప్రధాని పీవీ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే అని గుర్తు చేశారు. పీవీ కూడా అప్పట్లో ఇవే అంశాల్ని తరచుగా ప్రస్తావించేవారు. వివిధ వేదికలపై మాట్లాడుతూ.. ‘ Let the private sector take care of the top, Govt will take care of the bottom.’ అనే వారు.

ఉద్యోగ కల్పన, ఐటీ అభివృద్ధి రంగాల్లోనూ పీవీ మెరుగైన నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ 1986లో కంప్యూటర్‌ గురించి అధ్యయనం మొదలు పెట్టి, 1991 నాటికి నైపుణ్యం సాధించారు. పీవీ అవగాహన ఏ స్థాయిలో ఉండేదంటే కంప్యూటర్‌ను విప్పి, తిరిగి యథాతథంగా అమర్చే వారు. అమెరికా, సింగపూర్‌ దేశాలపై ఆధారపడకుండా దేశంలోనే సాఫ్ట్‌ వేర్‌ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశ యువతపై అపారమైన విశ్వాసం కలిగిన పీవీ,  భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ పరంగా మెరుగైన అభివృద్ధి సాధ్యమని నమ్మారు. అదే నమ్మకంతో భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి బాటలు వేశారు. దేశ విదేశాల్లోని సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, దిగ్గజాలతో చర్చించారు. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తితో 15 సార్లు సంప్రదింపులు చేశారు. సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతులపై పన్ను రాయితీలు ఇస్తే, సాఫ్ట్‌ వేర్‌ అభివృద్ధికి చర్యలు చేపడతామని నారాయణమూర్తి సహా సాఫ్ట్‌ వేర్‌ దిగ్గజాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు పీవీ గారు ‘మీరు ఏదైనా చేయండి. మీ వెనుకాల నేనున్నాను’ అని భరోసా కల్పించడంతో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి అడుగులు పడ్డాయి. తత్ఫలితంగానే మాదాపూర్‌ సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ ఏర్పడింది. పీవీ దిశానిర్దేశం తోనే సాఫ్ట్‌ వేర్‌ రంగానికి పునాదులు పడ్డాయి. ఈ రోజు దేశంలో లక్షలాది మంది సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉపాధి పొందుతున్నారంటే అది పీవీ గారి చలవే అని చెప్పాలి.

(వ్యాసకర్త: పీవీ కుమారుడు)

పి.వి.ప్రభాకర రావు


logo