మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 30, 2020 , 23:35:42

కరోనా వచ్చినా భయం వద్దు

కరోనా వచ్చినా భయం వద్దు

మనిషిని భయమే సగం చంపేస్తుంది అంటారు. ఇప్పుడదే జరుగుతున్నది. మామూలుగా అందరిలోనూ రోగనిరోధకశక్తి ఉంటుంది. రోగ నిరోధకత అంటే ఏవైనా సూక్ష్మక్రిములు శరీరంలోనికి ప్రవేశించినపుడు వాటిని ఎదుర్కొని మనిషి శరీరాన్ని రక్షించే వ్యవస్థ. మొదటి రకం రోగనిరోధకత పుట్టుకతో వస్తుంది. రెండవది- ఏదైనా సూక్ష్మజీవి మనిషి శరీరంలోకి ప్రవేశించినపుడు వస్తుంది. సూక్ష్మజీవిని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ‘యాంటీబాడీలు’ అంటే సైనికుల్లాంటివి తయారు అవుతాయి. 

నాకు కొద్దిగా దగ్గు.. జ్వరంగా ఉంది. కరోనా టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వస్తుందేమో, ఏమన్నా అవుతుందా అనేది ఒకరి భయం. తెలియకుండా కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిశాను. అప్పటినుండి నాకు కొద్దిగా జ్వరంగా, కొద్దిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. కరోనా టెస్టు నెగటివ్‌ వచ్చింది. ఏమవుతుందో.. ఇది మరొకరి అనుమానం. కరోనా టెస్టు పాజిటివ్‌ వచ్చింది. ఏ లక్షణాలూ లేవు. ఏమీ కాదుగదా అనేది ఇంకొకరి సందేహం. 

ఇది ఈనాటి ప్రజల మానసిక పరిస్థితి. ప్రతిరోజూ పత్రికల్లో, టీవీల్లో కరోనాతో చనిపోయారు అనే వార్తలు చూసి తమకేమన్నా అవుతుందేమోననే భయంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమ బంధువుల్లో ఎవరైనా కరోనా సోకి చనిపోయినా, తాముండే అపార్టుమెంట్లలో ఎవరికైనా సోకినా, తాము పనిచేసేచోట ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినా తమకు కూడా ముప్పు తప్పదేమోనని, రాత్రికి రాత్రే ఏదైనా ప్రమాదం జరుగొచ్చేమోనని భయం. కొంతమందైతే అసలు తెల్లారేసరికి ఉంటామో లేదోనని విపరీతంగా భయపడుతున్నారు.

క్షణ క్షణం భయపడకుండా, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, ముఖానికి మాస్క్‌ ధరించి, తగినవిధంగా శానిటైజర్స్‌ను వాడుతుండాలి. గుంపులుగా చేరకూడదు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహాలు తీసుకుని, కరోనా తీవ్రతను నిరోధించి ఎదుర్కోవచ్చు.

ప్రైవేటు హాస్పిటళ్లలో జాయిన్‌ చేసుకోవడం లేదని, చేసుకున్నా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో వసతులు సరిగా లేవని, చికిత్స అందించడంలో ఆలస్యం అవుతున్నదని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో జనం మరింత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొంతమందైతే హఠాత్తుగా ఏదైనా జరిగితే ఎక్కడికి వెళ్లాలి, వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు పట్టించుకుంటారా, అడ్మిట్‌ చేసుకుంటారా, సరియైన చికిత్స అందిస్తారా అనే  ఆందోళనలతో ముందే వాకబు చేసి పెట్టుకుంటున్నారు. 

వాస్తవానికి కరోనా టెస్టు పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనపడటంలేదు. మిగిలిన 20 శాతంలో ఎక్కువమందిలో పొడిదగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బంది, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించి చికిత్స తీసుకోగానే తగ్గిపోతున్నాయి. లక్షణాలు తీవ్రమయి దవాఖానలో చికిత్స పొందినా కూడా కోలుకోలేక చనిపోయినవారి సంఖ్య చాలా తక్కువ. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ వచ్చినా కూడా ఏ లక్షణాలు లేనివాళ్లు, లక్షణాలు ఉండీ చికిత్స తీసుకొని కోలుకున్నవాళ్లు 99 శాతం కన్నా ఎక్కువగా ఉండగా, చికిత్సకు లొంగక చనిపోయినవారు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి కరోనా టెస్టు పాజిటివ్‌ వచ్చిన వాళ్లందరికీ ఏదో జరుగుతుందని భయపడనవసరం లేదు. మనిషిని భయమే సగం చంపేస్తుంది అంటారు. ఇప్పుడదే జరుగుతున్నది. మామూలుగా అందరిలోనూ రోగనిరోధకశక్తి ఉంటుంది. అంటే ఏదైనా సూక్ష్మక్రిములు శరీరంలోనికి ప్రవేశించినపుడు వాటిని ఎదుర్కొని మనిషి శరీరాన్ని రక్షించే వ్యవస్థ. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఇమ్యూనిటీ పుట్టుకతో వస్తుంది. జన్యుపరంగా కూడా సంక్రమిస్తుంది. ఇంకా మనం తీసుకునే పుష్టికరమైన ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పుట్టుకతోనే వచ్చే రక్షణ వ్యవస్థ గనక లేకపోతే మన చుట్టూ ఉన్న వాతావరణంలోని ఎన్నో వైరస్‌లు, బాక్టీరియాల్లాంటివి మన శరీరంలోకి ప్రవేశించి ఎన్నో వ్యాధులు కలుగజేసేవి. దీని వల్ల మనుషుల మనుగడే ప్రశ్నార్థకమయ్యేది. రెండవ రకం- ప్రత్యేక ఇమ్యూనిటీ. ఏదైనా సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించినపుడు దానిని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ‘యాంటీబాడీలు’ అంటే సైనికుల్లాంటివి తయారు అవుతాయి. ఈ ప్రత్యేక ఇమ్యూనిటీ చాలా బలమైనది. ఇది మనిషికి వైరస్‌ సోకడం ద్వారాగానీ, వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారాగానీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవాళ్లందరికీ ఈ ప్రత్యేక ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఎక్కడో ఒకరు ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు లేదా ఇతర కొన్నిరకాల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇమ్యూనిటీ తగ్గినవాళ్లు మాత్రమే దీనివల్ల చనిపోయారు.

హెచ్‌ఐవీ (ఎయిడ్స్‌ వైరస్‌) ఒకసారి సోకి మనిషి ఒంట్లోకి చేరితే దానిని నిర్మూలించే మందులే లేవు. జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది దాని బారినపడి చనిపోయారు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దానికి భయపడకుండా బతుకుతున్నాము. దానితోపోలిస్తే కరోనా తక్కువ ప్రమాదకరమైనదే. ఈ వైరస్‌ సోకినా కొన్ని రోజుల్లోనే శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. జీవితాంతం మందుల అవసరమే ఉండదు. 

అందువల్ల క్షణ క్షణం భయపడకుండా, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, ముఖానికి మాస్క్‌ ధరించి, తగినవిధంగా శానిటైజర్స్‌ను వాడుతుండాలి. గుంపులుగా చేరకూడదు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహాలు తీసుకుని, కరోనా తీవ్రతను నిరోధించి ఎదుర్కోవచ్చు. మామూలుగా ఆరోగ్యవంతులు కావచ్చు. పొగతాగడం, మద్యం, పాన్‌, గుట్కా (ఇవన్నీ ఇమ్యూనిటీని తగ్గించే కారకాలు) లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, సరిగా నిద్రపోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.

(వ్యాసకర్త : చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి , కోఠి, హైదరాబాద్‌)

డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి


logo