శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jul 30, 2020 , 23:35:41

శంకరాచార్య నిర్బంధం

శంకరాచార్య నిర్బంధం

ఆరో  అధ్యాయం కొనసాగింపు..

వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌కు కార్యక్షేత్రమేననే అభియోగాన్ని మోపుతూ శంకరాచార్య స్పష్టం చేసిందేమంటే.. వీహెచ్‌పీ లక్ష్యం సాధువులు, మహంతులు ఆరెస్సెస్‌ నాయకత్వానికి తలవొగ్గేట్లు చేయటమేనని.  రామ్‌ జన్మభూమి న్యాస్‌ నిబంధన నుంచి ఒకదానిని ఉటంకిస్తూ అధికారాన్ని నిలుపుకునేందుకు సంఘ్‌ పరివార్‌ చాలా తెలివిగా ఒక క్లాజును చేర్చింది-దాని ప్రకారం.. కార్యదర్శి లేదా కోశాధికారి పదవులు ఖాళీ అయితే వాటిని వీహెచ్‌పీ కార్యనిర్వాహక వర్గం నిర్ణయం ప్రకారం భర్తీ చేస్తారు. రామనవమి పండుగ సందర్భంగా శంకరాచార్య అయోధ్యలో ఓ వారంరోజుల పాటు ఉన్నారు. అక్కడ సాధు సమాజంలో బాగానే చీలిక తెచ్చారు. తరువాత తన పథకానికి మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి వారణాసిలో, హరిద్వార్‌లో, అలహాబాద్‌లో మరికొన్ని చోట్ల ధర్మాచార్యులతో, పండితులతో సమావేశాలు నిర్వహించారు. 1990 ఏప్రిల్‌ మాసాంతానికి పునాదిరాయి మళ్లీ ప్రతిష్ఠించేందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ ఏప్రిల్‌ 30న శంకారాచార్య ఫైజాబాద్‌కు వస్తూండగా యూపీలోని అజమ్‌గఢ్‌ జిల్లాలో మరో పదిమంది అనుయాయులతో కలిసి ఆయనను నిర్బంధించటం జరిగింది. తరువాత ఆయనను మీర్జాపూర్‌కు తరలించి చూనార్‌ కోటలో ఉంచారు. ఆయన నిర్బంధానికి వ్యతిరేకంగా రెండు రిట్‌ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేయబడినాయి. జస్టిస్‌ సవ్యసాచి ముఖర్జీ, కే.ఐ. షెట్టీలతో కూడిన డివిజన్‌ బెంచి యూపీ ప్రభుత్వాన్నుంచి ఆయన్ని ఏ కారణాలపై అరెస్టు చేయటం జరిగిందో వివరించమని కోరింది. మే 3వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదులు శంకరాచార్య నిర్బంధాన్ని నిరసిస్తూ మెరుపు సమ్మెకు దిగారు. అదే రోజున బాబ్రీ మసీదు పోరాట కమిటీ ముస్లిములందర్నీ ఫైజాబాద్‌కు వచ్చి శిలాన్యాస్‌ వ్యవహారాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్వపు పరిస్థితినే కొనసాగిస్తామనే ఖచ్చితమైన హామీలనివ్వటంతో మే 6వ తేదీన ముస్లిములు వాళ్ల చర్యల్ని నిలిపివేశారు. మే నాలుగవ తేదీన సుప్రీంకోర్టు శంకరాచార్య నిర్బంధం చట్టబద్ధమేనని తేల్చటంతో దానిపై గందరగోళం చెలరేగింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo