శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 29, 2020 , 23:26:28

రాఫెల్స్‌ రాక!

రాఫెల్స్‌ రాక!

అత్యాధునికమైన రాఫెల్‌ యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరానికి వచ్చి వాలడం దేశ ప్రజలలో ఉత్తేజాన్ని నింపింది. చైనా ప్రమాదం చాలా మంది మనసుల్లో మెదులుతున్నది. అందువల్ల రాఫెల్‌ యుద్ధ విమానాలు రావడం సైనిక దళాలలోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ ఆత్మైస్థెర్యాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతానికి ఐదు విమానాలు వచ్చినప్పటికీ, వచ్చేటికల్లా ఫ్రాన్స్‌ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలు వచ్చి చేరతాయి. ఇవి చైనా యుద్ధ విమానాల కన్నా అత్యాధునికమైనవి. చైనా సరిహద్దులోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వీటిని వినియోగించుకోవచ్చు. గగనతలంలో చైనా వైమానిక బలగాన్ని నిరోధించి రక్షణ కల్పించడానికి అనువైనవి. భూతలం నుంచి సముద్రం నుంచి కూడా దాడులకు ఉపయుక్తంగా ఉంటాయి. చురుకైన కదలికలు, దాడి సామర్థ్యం ఉండటం వల్ల అణ్వాయుధ దాడి నిరోధకంగా ఉపయోగపడుతుంది. 

ప్రచ్ఛన్న యుద్ధకాలంతో పోలిస్తే వివిధ దేశాల రక్షణ వ్యవస్థలు భారీ మార్పులకు లోనయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరిజ్ఞానం, అంతరిక్ష యుద్ధం వంటి పలు రంగాలలో రక్షణ వ్యవస్థల ఆధునికీకరణ సాగుతున్నది. ఆర్థికంగా ఎదుగుతున్న మన దేశం తదనుగుణమైన సైనిక శక్తిగా అవతరించాలంటే ఇంకా సమకూర్చుకోవలసిన ఆయుధ సంపత్తి చాలానే ఉన్నది. మన రక్షణ సామాగ్రిని మన దేశంలోనే తయారు చేసుకోవడం కూడా చాలా అవసరం. యుద్ధ సమయంలో ఇతర దేశాలను నమ్ముకోవడం ప్రమాదకరం. ఇందుకు కార్గిల్‌ అనుభవమే ఉదాహరణ. కార్గిల్‌లో పాకిస్థాన్‌ సైనికులు చొరబడినప్పుడు ఆ ప్రదేశానికి చెందిన జీపీఎస్‌ డేటా ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. ఆ తరువాత కాలంలో భారత్‌ సంబంధిత ఉపగ్రహ వ్యవస్థను వేగంగా నెలకొల్పుకొని సొంత నావిగేషన్‌ సిస్టంను నిర్మించుకున్నది. 

యుద్ధంలో గెలుపు ఓటములకు అనేక కారణాలు దోహదం చేస్తాయి. చైనా శక్తిమంతమైనదీ, పలు రంగాలలో ముందున్నదనేది వాస్తవమే. అయితే చైనా మనకన్నా బలమైనదనే మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. యుద్ధమనేది ఆయుధ సంపత్తి, సైనిక బలగాల వంటి ఏ ఒక్క అంశంపై పూర్తిగా ఆధారపడి ఉండదు. మనతో పాటు శత్రువు శక్తి సామర్థ్యాలపై కచ్చితమైన అంచనా ఉండాలి. శత్రువు బలాలు, బలహీనతలను అధ్యయనం చేయాలి. ఈ అంశాల ప్రాతిపదికన మనకు అనుకూలమైన వ్యూహాన్ని రచించుకోవాలి. వేగమైన కదలికలు, శక్తియుక్తులు గల చిన్న సైన్యంతో  పెద్ద దేశాలను మట్టికరిపించిన ఘటనలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ వంటి చిన్న దేశం చుట్టూరా ఉన్న అరబ్బు దేశాలను, ఇరాన్‌ను కలవరపరుస్తున్నది. ఇందుకు ఆ దేశం ఎంచుకున్న సైనిక, రాజకీయ వ్యూహం కారణం. ఆర్థిక, సామాజిక సుస్థిరత, స్వావలంబన వంటి అనేక అంశాలు దేశాన్ని బలమైనదిగా తీర్చిదిద్దుతాయి. ఈ అంశాలన్నిటిపైనా మన దేశనాయకత్వం దృష్టిసారించవలసి ఉంటుంది. 


logo