శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 29, 2020 , 17:34:58

సాహితీ సిరి సినారె

సాహితీ సిరి సినారె

నిరంతర కవి, విశ్వంభర నాథుడు, మనవతా మహనీయుడు, ఆధునిక మహాకవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగ శీలి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత ఇలా ఎన్ని పేర్లుగా పిలిచినా ఆయనే, మన సాహితీ దిగ్గజం సినారె. 

డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు అందరికి ‘సినారె’గా సుపరిచితులు. సినారె గారి మొదటి పేరు సత్యనారాయణ రెడ్డి. ప్రాచుర్యంలో సింగిరెడ్డి నారాయణ రెడ్డిగా, సినారెగా ప్రసిద్ధికెక్కారు. ఆయన భార్య మరణానంతరం  భార్య పేరు మీద సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని  ప్రారంభించిన  సాహితీ సమదర్శి సినారె.

  సినారె  ఉస్మానియాలో ఉర్దు మీడియంలో బీఏ పూర్తి చేశారు.1954లో ఉస్మానియాలో ఎం.ఏ తెలుగు పూర్తిచేసి, ఆచార్య ఖండవల్లి లక్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు-ప్రయోగములు’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. సినారె గారికి చిన్నప్పటి నుండి కవిత్వం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆరేడు తరగతుల వయసులోనే కవితలు రాశారు. అనేక జానపదాలు, హరికథలు, బుర్రకథలు వినిపించారు. సినారె తొలి రచన 1953లో ‘నవ్వనిపువ్వు’ ను రాశారు. అనేక గేయనాటికలను, గేయకవితలను, ఖండ కావ్యాలను, కవితాసంపుటాలను, విశిష్ట కావ్యాలను, వ్యాససంపుటాలను, దీర్ఘ కావ్యాలను రాసిన సాహితీ ఉప్పెన సినారె. 

సినారె గారి ‘విశ్వంభర’ వచన కావ్యానికి 1988లో  జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది.  ‘మంటలూ -మానవుడు’ అనే కవితాసంపుటానికి 1973లో ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బౌద్ధ కథగా ‘నాగార్జునాసాగరం’ పేరు పొందిన కథాకావ్యం. మాత్రాఛందస్సుకు ప్రాణం పోసిన గేయకావ్యం ‘కర్పూ ర వసంతరాయలు’ ఎనలేని ఖ్యాతిని పొందిం ది.‘మధ్యతరగతి మందహాసం’ కవితాసంపుటి వచనకవిత్వాన్ని బలోపేతం చేసింది. ‘ప్రపంచ పదులు’ వంటి విశిష్ట కావ్యాలను రాశారు.

‘ప్రపంచ పదులు’లో..‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’  అంటూ చెప్పిన కవిత్వం అద్వితీయం.అలాగే గజల్‌ లో..‘మబ్భుకు మనసే కరిగితే అది నీరవుతుందిమనసుకు మబ్బె ముసిరితే కన్నీరవుతుంది..’అని చెప్పిన కవితలు నేటికీ ఆదర్శవంతగా ఉన్నాయి. ఊపిరి ఉన్నంత వరకు ఆయన కవితావాహిని ఆగలేదు. కలం, గళం రెండు ఆయన అస్ర్తాలు.

సినారె గారు1981లో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, 1985లో  అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, 1992లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారులుగా, 1993లో ఆంధ్రప్రదేశ్‌ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా- ఏ పదవిలో ఉన్నా ఆ పదవులకు వన్నె తెచ్చారు.  1962నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించి సినీ గేయాలు రాయడం మొదలు పెట్టారు. ‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే... వన్నెల దొరసాని..’ అనే పాటతో పాటు ఆ సినిమాకు అన్ని పాటలు రాశారు. ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు మొత్తం మూడువేల వరకు పాటలు రచించి సాహిత్య వాణిగా మిగిలి పోయారు. 

‘గున్నమామిడీ కొమ్మమీద...గూళ్ళు రెండున్నాయి..’

‘పగలే వెన్నెలా... జగమే ఊయలా..’

‘వస్తాడు నా రాజు ఈ రోజు..’

‘అమ్మను మించి దైవం ఉన్నదా..’

‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’

‘జేజెమ్మా..... మాయమ్మ..’ అంటూ అద్భుత పాటలు సినారె కలం నుండి 

జాలువారిన సాహిత్య చంద్రికలు.

జ్ఞానపీఠ్‌ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు  సినారె ఎన్నో పురస్కారాలను పొందారు. 1977లో పద్మశ్రీ, 1992 లో పద్మభూషణ్‌ అందుకున్నారు. రాజ్యలక్మీ పురస్కారం, సోవియెట్‌ నెహ్రూ పురస్కారం, కళాప్రపూర్ణ, సినీకవిగా నంది పురస్కారం, పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు. 2014లో జీవన సాఫల్య పురస్కారం పొందారు.

సినారె గురించి కుందుర్తి గారు ‘తిలక్‌ లాగా రెండంచుల పదును గల కత్తి సినారె..’ అని చెప్పారు. తాపి ధర్మారావు  ‘సినారె’ గారిని మహాకవిగా ప్రశంసించారు. ఆయన తన సొంత ఊరిలో  తన ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వడం, పాఠశాల భవనం నిర్మించడం, కళా మందిరాన్ని, కళ్యాణ మండపాన్ని కట్టించడం వంటి సేవా గుణాన్ని కలిగిన సామాజిక సేవకుడు సినారె.

సినారె రచనలు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ  మొదలగు  భాషలలోకి అనువాదమయ్యాయి. సామాజిక చైతన్య ప్రబోధాన్ని, ప్రగతిశీల మానవతా వాదాన్ని కవిత్వీకరించిన  సాహిత్య సమదర్శి సినారె. అభ్యుదయం, శాంతి, విప్లవం, మానవత, సమత వంటి  అన్ని లక్షణాలకు నిలువుటద్దం సినారె. ఈ తరం కవులతో పోటీపడిన నిరంతర కవి, మానవతా మహనీయుడు సినారె.

ఎనభై ఆరు ఏండ్ల వయసులో 2017 జూన్‌ 12న తుది శ్వాస విడిచారు. ఆయన లేకున్నా ఆయన రచనలు ప్రజల నాలుకలపై నిరంతరం వినిపిస్తునే ఉంటాయి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వత మూర్తి సినారె. ఆయన కవిత్వం, జీవితం నేటి తరానికి  స్ఫూర్తిదాయకం.

(వ్యాసకర్త: తెలంగాణ రచయితల సంఘం, వనపర్తి జిల్లా అధ్యక్షులు)

( సినారె జయంతి సందర్భంగా ..)


logo