శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jul 29, 2020 , 00:00:31

సాధువులలో ఉద్వేగం

సాధువులలో ఉద్వేగం

ఆరో  అధ్యాయం కొనసాగింపు..

వీపీ సింగ్‌, వీహెచ్‌పీ, బీజేపీ, ఆరెస్సెస్‌, బాబ్రీ మసీదు పోరాట కమిటీ ఇంకొందరు ముస్లిం నాయకుల మధ్య సదవగాహన కోసం సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులు 1990 జూలై నుంచి అక్టోబరు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 

వివాదంలో ఉన్న స్థలంలో మందిరం నిర్మింపబడేందుకు వీహెచ్‌పీ పెట్టిన ముహూర్తం 30, అక్టోబరు 1990 దగ్గర పడుతూండటంతో వీపీ సింగ్‌ ఉభయులకూ ఆమోదయోగ్యంగా ఉండే సూత్రం కోసం కృషిచేసి చివరకు రామజన్మ భూమి- బాబ్రీ మసీదు  (స్థల సేకరణ) ఆర్డినెన్స్‌ 1990ని 1990 అక్టోబరు 19న జారీచేయటం జరిగింది. ఈ ఆర్డినెన్స్‌లోని విషయాలకూ, 1993లో తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన అయోధ్య స్థల సేకరణ ఆర్డినెన్స్‌కూ గల పోలికలు మనసును ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

బాబ్రీ మసీదు పోరాట కమిటీ నాయకులు కొందరు ఆర్డినెన్స్‌ను సంపూర్ణంగా వ్యతిరేకించారు. దానిని రద్దు చేయాలని పట్టుబట్టారు. అలా చేయకపోతే సంప్రదింపులలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. దాంతో వీపీ సింగ్‌ 1990 అక్టోబరు 19నాటి ఆర్డినెన్స్‌ను రద్దు పరుస్తూ అక్టోబరు 23న మరో ఆర్డినెన్స్‌ జారీ చేయించవలసి వచ్చింది. నేషనల్‌ ఫ్రంట్‌, బీజేపీ నేతలు కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు కులుక్కుంటూండగానే రామజన్మభూమి ముక్తియజ్ఞ సమితి 1990 డిసెంబర్‌ 11న సమావేశాన్ని ఏర్పాటు చేసి మందిర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పునరుద్ఘాటించింది. అక్కడ చేసిన తీర్మానం ప్రకారం.. సాధువులకు ప్రభుత్వానికీ మధ్య ఇక ఎటువంటి సంప్రదింపులు జరుగరాదనే. అవసరమైతే సమితే సరాసరి ప్రభుత్వంతో చర్చిస్తుంది. 

1990 జనవరి 27న అలహాబాద్‌లో జరిగిన సాధువుల సమ్మేళనం కీలకమైనదే. ఊహించని రీతిలో సాధువులు ఉద్వేగభరితులయ్యారు. ఆ దశలో కరసేవ ప్రారంభించి బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగజేయదలచలేదు. కాని సాధువుల్లోని అగ్రనాయకుల్లో ఎక్కువ మంది ఆ విషయంలో ఇంకా తాత్సారం కుదరదంటున్నారు. వీహెచ్‌పీ నాయకుల అభిప్రాయానికి భిన్నంగా కరసేవకు ముహూర్తం పెట్టేందుకు వత్తిడి తెస్తున్నారు. అశోక్‌ సింఘాల్‌ ప్రతిఘటన రహితమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కేంద్రీయ మార్గదర్శక మండల్‌ నిర్మాణ కార్యక్రమాన్ని 1990 ఫిబ్రవరి 14న ప్రారంభించాలని నిర్ణయించింది. చివరకు కేంద్రీయ మార్గదర్శక మండల్‌, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మందిర నిర్మాణం విషయంలో ఉదాసీనంగా ఉండటాన్ని తప్పుబట్టింది. తగిన నిర్ణ యం తీసుకొనజాలకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ సమావేశం ఇంకా సాధువులని ధర్మాచార్యుల్ని రామభక్తుల్ని తమకు సహకారాన్ని అందించమనీ, మందరి నిర్మాణం కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టగల కరసేవకుల జాబితాలను పంపమని కోరింది. 1989 డిసెంబర్‌ 11నాటి రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి తీర్మానాన్ని ఆమోదిస్తూ సమితికీ ప్రభుత్వానికీ మధ్య కూడ ఎటువంటి సంప్రదింపులకు తావుండరాదని తీర్మానించటం జరిగింది. 

వివాదంలో ఉన్న స్థలంలో చేపట్టే కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం అడ్డుకునే పక్షంలో చేపట్టవలసిన చర్యలకై 14రోజుల కార్యాచరణ ప్రణాళికను వీహెచ్‌పీ రూపొందించింది. దాని ప్రకారం ఫిబ్రవరి 15న సాధువులతో సహా దాదాపు 5వేల మంది వాలంటీర్లు అరెస్టుకు సిద్ధం కావలసి ఉంది. ఫిబ్రవరి 16న యూపీ బంద్‌ చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 28వరకు కొనసాగుతూ, పూజింపబడిన ఇటుకలు వచ్చిన ప్రతి గ్రామం నుంచి కూడా కనీసం ఒక్కరైనా అయోధ్య చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)
logo