గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 27, 2020 , 23:11:26

విష ప్రచారాలు

విష ప్రచారాలు

కోవిడ్‌ చికిత్స విషయంలో వాస్తవాలతో నిమిత్తం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే వింత పోకడ మీడియాలోని కొన్ని వర్గాలలో కనిపిస్తున్నది. కరోనా మరణాల రేటులో మొదటి పది రాష్ర్టాలలో కూడా తెలంగాణ లేదు. కోవిడ్‌కు గురై కోలుకోవడాన్ని కొలబద్దగా తీసుకుంటే తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నది. వాస్తవం ఇది కాగా సాధారణ మరణాలను కోవిడ్‌కు అంటగట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా ఒక వర్గం మీడియా వ్యవహరిస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖ వివరాలను పరిశీలించినా వాస్తవాలు తెలిసిపోతాయి. గాంధీ దవాఖానలో గత ఏడాది మే నుంచి జూలై వరకు మరణాలతో పోలిస్తే ఈ ఏడాది సంఖ్య తక్కువగా ఉన్నది. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో మరణాలను గతంతో పోల్చి చూసినా పెద్దగా తేడా లేదు. అయినా భూమి మీద ఎక్కడా మరణాలు లేనట్టు, గతంలో ఎవరూ మరణించనట్టు, సమస్త జీవరాసుల జరామరణాలన్నిటికీ తెలంగాణ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా కుట్రపూరిత ప్రచారం సాగుతున్నది. 

ఆంధ్ర పాలకవర్గం, వారి మీడియా ప్రజల ప్రాణాలను బలిగొనేంతటి నీచస్థాయికి దిగజారడమనేది కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఈ మీడియా తెలంగాణ ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిలించింది. తెలంగాణ మలి దశ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఒక్కో అడుగు ముందుకు పడుతూనే ఉన్నది. కానీ అనుకూల పరిణామం సంభవించినప్పుడల్లా వెనుకకు పోయినట్టు ఈ మీడియా వక్రీకరించేది. ఉదాహరణకు- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. ఇంతకాలం బీజేపీ సూత్రప్రాయ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఇప్పుడు అధికారికంగా ఆమోదించే లాంఛనం పూర్తయింది. కానీ బీజేపీ కార్యవర్గం ఏకవాక్యంతో మాత్రమే తీర్మానాన్ని ఆమోదించింది అంటూ ఉద్యమం వెనకకు పోయిందనే రీతిలో వార్తలను ప్రసారం చేసింది. అనేక మంది అమాయకులు బలి కావటా నికి ఈ వక్రీకరణలు సృష్టించిన నిస్పృహనే కారణం.  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాతనైనా వీరి కుట్రలు నిలిచిపోలేదు. కానీ ఆ దుర్మతుల బుద్ధులు, చేష్టలు ఏ మాత్రం మారడం లేదు. 

కరోనా ప్రమాదం ముంచుకొస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదట్లోనే ప్రజలను చైతన్యం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి జాడలను కేంద్రానికి అందించింది తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ ప్రజలు ఎంతో ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటున్నారు. దీనిని ఆంధ్ర మీడియా భరించలేకపోతున్నది. తెలంగాణ సమాజం సుఖంగా బతకడాన్నిచూసి ఓర్వలేక పోతున్నది.  కరోనాకు ఔషధం లేనట్టు, వీరి దుర్బుద్ధికి కూడా మందు లేదు. ప్రజలు  చేయగలిగిందల్లా- కరోనాకు భయపడకుండా ఉన్నట్టే, ఈ దుష్ప్రచారానికి వెరవకుండా ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వైద్యులు, రోగులు మొదలుకొని సాధారణ ప్రజల వరకు ఎవరూ ఆత్మైస్థెర్యం కోల్పోకూడదు.  


logo