శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 27, 2020 , 23:11:26

నాటి కాలపు గొప్ప నాయకుడు

నాటి కాలపు గొప్ప నాయకుడు

ప్రజా ప్రతినిధులు నివేదించిన సమస్యలను ఆలకించారు. మూర్తిమత్వమంటే ఇది. ఈ లక్షణమే తాను చేపట్టిన పదవికి ప్రతిష్ఠను పెంచాయి. ప్రజాప్రతినిధుల నడవడిక, ప్రాతినిధ్యం తీరు నన్ను ఆకట్టుకొన్న రెండో విషయం. సమస్య తీవ్రంగా ఉండటం వల్లే తమను ఇంతలా నొప్పించాల్సి వస్తోందనే మన్నింపు ధోరణితో రామచంద్రారెడ్డిగారు నడుచుకొన్నారు.

నెల్లూరు జిల్లాలో 1964 సెప్టెంబరు 24న నా శిక్షణ కాలాన్ని పూర్తిచేసుకొని రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకొన్న రోజు ఇది. వృత్తి జీవితంలో తొలిగా అందుకొన్న స్వతంత్ర బాధ్యతలివి. అప్పటికి ఏడాదిగా దేశమంతా కరువు కోరల్లో విలవిల్లాడుతోంది. ఆ రోజుల్లో భారత ఆహార సంస్థ గానీ, వ్యవసాయ ధరల కమిషన్‌ గానీ లేవు. హరిత విప్లవానికి అప్పటికి పాదులు పడలేదు. ఈ వాస్తవాలతో సంబంధం లేని చర్చను నేను నెల్లూరులో పనిచేసే కాలంలో రెవెన్యూ అధికారులు చేస్తుండేవారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్‌ డివిజన్‌ను సిరులు పొంగే జీవగడ్డగా అభివర్ణించేవారు. 

వీరంతా అంటున్నట్టు రాజమండ్రి సబ్‌ డివిజన్‌ సిరుల గడ్డా? లేక కరువు ప్రాంతమా? నేను అక్కడకు వెళ్లిన కొద్దిరోజుల్లోనే రెవెన్యూ శాఖ మంత్రి నూకల రామచంద్రారెడ్డి రాజమండ్రిలో జరిపిన పర్యటన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పింది. మంత్రికి స్వాగతం పలకడానికి నేను మునిసిపల్‌ అతిథి గృహం చేరుకొన్నాను. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీపీఐ మాజీ ఎమ్మెల్యే తమ అనుచరులతో వచ్చారు. వారి చేతుల్లో మంత్రికి ఇవ్వడానికి వినతిపత్రాలున్నాయి. రాజమండ్రిలో బియ్యం కొరత తీవ్రంగా ఉందనేది ఆ వినతిపత్రంలోని ప్రధాన అంశం! వారు అక్కడ ఉండగానే మంత్రి వచ్చారు. ప్రజా ప్రతినిధులు నివేదించిన సమస్యలను ఆలకించారు. మూర్తిమత్వమంటే ఇది. 

ఈ లక్షణమే తాను చేపట్టిన పదవికి ప్రతిష్ఠను పెంచాయి. ప్రజాప్రతినిధుల నడవడిక, ప్రాతినిధ్యం తీరు నన్ను ఆకట్టుకొన్న రెండో విషయం. సమస్య తీవ్రంగా ఉండటం వల్లే తమను ఇంతలా నొప్పించాల్సి వస్తోందనే మన్నింపు ధోరణితో వారు నడుచుకొన్నారు. అన్ని విషయాలు నాతో మాట్లాడతానని వారికి చెప్పి సమావేశాన్ని ముగించారు. అనంతరం నన్ను ఆయన ఒక్క పక్కకు తీసుకెళ్లారు. వీళ్లంతా మంచి మనుషులు. సమస్య ఉన్నదనేది తెలుస్తూనే ఉంది. ఈ సమస్యకు మీరే పరిష్కారం ఆలోచించండి అని సూచించారు. నా పై ఆయన ఉంచిన విశ్వాసం నన్ను చకితుణ్ణి చేసింది. నేను బియ్యం కొరతను తీర్చే దిశగా అడుగులు వేశాను. రాజమండ్రిలో పూర్తిస్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయించాను. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి, కుటుంబానికి ఒకటి చొప్పున కార్డులు జారీ చేశాం. ఒక కుటుంబానికి వారానికి 14 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశాం. కిలో బియ్యం 64 పైసలకు అందించాం.

1970 తొలినాళ్లలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ బాధ్యతల్లో ఉన్నాను. నూకల రామచంద్రారెడ్డి సొంతజిల్లా ఇది. లోకసభ ఎన్నికల నిర్వహణ, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ అనేవి అప్పట్లో నా ముందున్న రెండు సవాళ్లు. నూకల రామచంద్రారెడ్డి స్వస్థలం మహబూబాబాద్‌ తాలూకా అత్యంత సమస్యాత్మకంగా పరిణమించింది. ఆ తాలూకాలోని రెండు పంచాయతీ సమితీల్లోనూ నూకల అనుచరులకే ప్రజాబలం ఉంది. నూకల వర్గానికి విజయం దక్కకూడదని అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నిర్ణయించారు. చట్టాన్ని ఖాతరు చేయకుండా ఏదైనా చేసేయడానికి బ్రహ్మానంద రెడ్డి వైఖరిని ఒక సంకేతంగా ఆయనవర్గం  మహబూబాబాద్‌లో భావించి హింసకు పూనుకున్నది. 

ఈ క్రమంలో నూకల కుటుంబంలోని మహిళలపై దాడి జరిగింది. ఈ దాడిలో ఒక మహిళ మెడ ఎముక విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇది నూకల వ్యతిరేక వర్గం పనేనని పోలీసు దర్యాప్తులో తేలింది. ఎన్నికలను అడ్డుకోవడమే ఈ దాడి లక్ష్యమని రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నేను నిర్ధారించుకున్నాను. నిజానికి ఇది పోలీసులతో అయ్యేది కాదు. ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ మాత్రమే శాంతిభద్రతలను నిలబెట్టగలరని నమ్మాను. ఆర్డీవోను పిలిపించాను. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ హెదాలో సంక్రమించే అధికారాలను ఆయనకు గుర్తుచేశాను. మహబూబాబాద్‌లో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించే బాధ్యత ఆయన పైనే ఉన్నదని స్పష్టం చేశాను. ఈ నిర్ణయం మంచి ప్రభావం చూపించింది. పెద్దగా హింసకు తావివ్వకుండానే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కానీ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి నడుస్తున్న నూకలను వ్యతిరేక వర్గం చుట్టుముట్టింది. వారిని చెదరగొట్టడానికి నూకల రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. పంచాయతీ ఎన్నికల ఘట్టం మరో దశలోకి ప్రవేశించింది. ఎన్నికైన సర్పంచులు పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌ను ఎన్నుకొంటారు. ఈ సమితి ఎన్నికలను భగ్నం చేయడానికి పేలుడు పదార్థాలను నూకల వ్యతిరేకవర్గం సిద్ధం చేసుకుందని వదంతులు వ్యాపించాయి. 

సాధారణంగా ఈ ఎన్నికలను ఆర్డీవో నిర్వహించాలి. అయితే, ఈసారి నేను జిల్లా రెవెన్యూ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాను. గుర్తింపును నిర్ధారించుకొన్నాకే ఒక్కొక్క సర్పంచ్‌ను సమితి హాలులోకి అనుమతించాం. ఎట్టకేలకు పంచాయతి సమితి ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిశాయి. నేను నూకల వర్గం పక్షపాతినంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఇది నిజం కాదు. మహబూబాబాద్‌ లో కావాలని తమను సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ బైండోవర్‌ చేశారంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. వారు వేసిన పిటిషన్లో నన్ను ప్రతివాదిగా చేర్చారు. మహబూబాబాద్‌ లోని శాంతిభద్రతల పరిస్థితిపై నా ప్రకటనను ప్రచురించిన డక్కన్‌ క్రానికల్‌ పత్రికలోని భాగాలను ప్రభుత్వ న్యాయవాది కోర్టులో చదివి వినిపించారు. దాని ఆధారంగా కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. పిటిషనర్లకు ఊరటనివ్వడానికి నిరాకరించింది.

పరిస్థితులను అదుపు చేయడానికి నేను తీసుకొన్న చర్యలు సంచలనం సృష్టించాయి. పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. హింసాత్మక ధోరణులను అణచివేయడంలో ‘నెమ్మది పాటించండి’ అని డీఐజీ (సి.ఐ.డి), డీఐజీ (పరిపాలన) సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ‘వాళ్లంతా పెడదారి పట్టినవాళ్లు. అలాంటివాళ్లతో మీరెందుకు తలపడతారు? అదేదో పోలీసులకు అప్పగిస్తే సరిపోతుంది కదా’ అన్నారు. ఆ తరువాత ఫోన్‌ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి నుంచి వచ్చింది. ‘పోలీసుల అతి’ పై దృష్టి సారించాలని ఆయన కోరారు. రాజకీయ బాధితుడిగా మారిన నూకల రామచంద్రారెడ్డికి న్యాయం చేసేందుకు నేను ముందుకెళ్లాను. రాజకీయ హింసకు గురయినా తన వైఖరిని నూకల సడలించుకోలేదు. ప్రజ అంతా తనవైపే ఉన్నదని ఆయన ప్రపంచానికి చాటారు. ఆయన రాజకీయ బాధితుడిగా ఉన్నప్పుడు ఆయనకు దక్కాల్సిన న్యాయం అందేలా చేయడానికి నేను సరిగ్గా అక్కడే ఉన్నాను. ఆయన రాజకీయ అనుచరుడిగానో, రాజకీయ సానుభూతిపరుడిగానో నేను ఈ పనులు చేయలేదు. ప్రజాస్వామిక ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం కోసం తలపడే ఇరువర్గాలను అదుపు చేయడం నా బాధ్యత. అవసరమైతే ఆ వర్గాల మధ్య పోరును సమన్వయపరచడమూ నా విధే! పౌర అధికారిగా ఆ విధిని నేను నిర్వర్తించాను. 

నూకల రామచంద్రారెడ్డి శత జయంతి వేడుకల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తాను. యువ ఐఏఎస్‌ హెదాలో కలిసిన తొలి మంత్రిగా ఆయనకు ఎంతో విలువ ఇస్తాను. మేం కలిసి సమావేశంలో ఒక గంటే పాల్గొన్నాం. కానీ, జీవితకాలానికి సరిపడా ప్రేరణను ఆయన అందించారు. 

నేను నూకల వర్గం పక్షపాతినంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఇది నిజం కాదు. మహబూబాబాద్‌లో కావాలని తమను సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ బైండోవర్‌ చేశారంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు....

రాజకీయ బాధితుడిగా మారిన నూకల రామచంద్రారెడ్డికి న్యాయం చేసేందుకు నేను ముందుకెళ్లాను. రాజకీయ హింసకు గురయినా తన వైఖరిని నూకల సడలించుకోలేదు. ప్రజ అంతా తనవైపే ఉన్నదని ఆయన ప్రపంచానికి చాటారు.

(వ్యాసకర్త : వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, ప్రధాని కార్యదర్శిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు). 

(నూకల రామచంద్రారెడ్డి శత జయంతి సందర్భంగా..)


logo