శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - Jul 27, 2020 , 23:11:24

ఇరు వర్గాలతో నిష్ఠూరం

ఇరు వర్గాలతో నిష్ఠూరం
  • ఐదో అధ్యాయం కొనసాగింపు..

దురదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్‌లోని మత ఘర్షణల వాతావరణం ఏ స్థాయికి చేరిందంటే.. అక్కడ ఏం చేసినా దాన్ని హిందూ వ్యతిరేక లేక ముస్లిం వ్యతిరేక చర్యగా ముద్రవేసే స్థితికి చేరుకుంది. నిరంతరం ఆవేశాలు రగుల్కొనేచోట ఏం చెయ్యకుండా మిన్నకుండటమూ కుదరని పనే. శిలాన్యాస్‌ జరిపిన స్థలంలో నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టనివ్వనందున  హిందూ మెజారిటీ వర్గాల్లోని పెద్ద పెద్ద ముఠాల్ని కాంగ్రెస్‌కు దూరం చేసే అవకాశాన్ని బీజేపీకి ఇచ్చినట్లయ్యింది. అవిభాజ్య జనతాదళ్‌, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మొదలైనవన్నీ కలిసి ఏర్పాటుచేసుకున్న యునైటెడ్‌ ఫ్రంట్‌ పరోక్షంగానయినా బీజేపీతో యూపీ ఎన్నికల్లో జతకట్టింది. బీజేపీ, ములాయంసింగ్‌ యాదవ్‌, వీపీ సింగ్‌ల జనతాదళ్‌ల మధ్య సీట్ల సర్దుబాట్లు బాహాటంగానే జరిగాయి. బీజేపీ నుంచి ఈ విధమైన అప్రకటిత మద్దతు లభించటం వల్లనే ములాయంసింగ్‌ యాదవ్‌ 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉత్తరప్రదేశ్‌లో జనతాదళ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగారు. 

పార్లమెంటులో కాంగ్రెస్‌ అధికాంశ సీట్లు గెలుచుకొన్న పార్టీగా నిలిచిందిగాని, కావలసిన మెజారిటీని సాధించలేక పోయింది. జనతాదళ్‌, వామపక్షకూటమి రెండూ కలిసి కూడ కాంగ్రెస్‌ కంటే సంఖ్యాబలంలో బాగా వెనుకబడే ఉన్నాయి. అప్పుడు జనతాదళ్‌, వామపక్షకూటమి వీపీ సింగ్‌ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ మద్దతు పొందే జనతాదళ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. అనుకోని ఈ పరిణామం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటినీ ఊపిరి పీల్చుకోనివ్వలేదు. రాజకీయ భాషలో వివరించాలంటే వాళ్లు సాధించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలోకి రాకుండా అడ్డుకోవటమే. 1990వ సంవత్సరంలో మందిరం-మసీదు వివాదం వల్ల ఏర్పడ్డ ఉద్రిక్తతల కారణంగా దేశంలో మతపరంగా స్థితి బాగా క్షీణించింది.  1990 అక్టోబరు నాటికి వీహెచ్‌పీ కరసేవ ద్వారా మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ రకమైన కార్యక్రమం వివాదంలో ఉన్న కట్టడానికి ముప్పువాటిల్లజేస్తుందనేశంకతో దాని రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు గైకొనబడినాయి. 

అధ్యాయం: 6

అయోధ్య 1990: సంక్షోభం నివారింపబడింది

వీహెచ్‌పీ హిందూ సనాతనవాదుల చర్యలకు ప్రతిగా ములాయంసింగ్‌ యాదవ్‌ పన్నిన వ్యూహం కూడ ప్రతిఘటనాత్మకమే. వాస్తవానికి మతతత్వ కేంద్రీకరణ మరింతగా పెరిగింది.  అయితే కేంద్రంలోని వీపీ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీతో సరాసరి ఘర్షణకు దిగేందుకు కుదరదు. ఆయన ప్రభుత్వ ఏర్పాటు కొనసాగింపు బీజేపీ తోడ్పాటుతోనే. అయోధ్యలోని గొడవ కేవలం ప్రతిఘటనాత్మక ధోరణితోనే పరిష్కరించజాలమనీ అర్థమయ్యింది. అదే సమయంలో కోపతాపాలు అలాగే ఉధృత స్థాయిలో కొనసాగితే ప్రభుత్వాన్ని నడపటమూ కష్టమేనని అర్థమయ్యింది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo