ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 26, 2020 , 23:30:22

విశ్వ వేదికలపై విశిష్ట

విశ్వ వేదికలపై విశిష్ట

ప్రసంగాలు విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా పీవీ నరసింహారావు ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవాలు, వ్యూహాలు అసాధారణమైనవి. దేశం తరఫున విశ్వవేదికలపై ఆయన ఇచ్చిన ప్రసంగాలు ఆణిముత్యాలు. భద్రతా మండలిలో ప్రపంచ రాజకీయ తంత్రం, రియో డి జనీరో ధరిత్రీ సదస్సులో పర్యావరణ పరిరక్షణ, కోపెన్‌ హగన్‌లో సామాజిక పురోగమనం, ప్యారిస్‌లో మహాత్మా గాంధీ ప్రాశస్త్యం- వేదిక ఏదైనా పీవీ భావ పరంపర దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసింది.

వివిధ అంతర్జాతీయ వేదికలపై విశ్వ శాంతి, ఆర్థిక సామాజిక పురోగతి, ఆహార సమస్య వంటి ప్రధానాంశాలపై పీవీ నరసింహారావు చేసిన ప్రసంగాలను కొన్నింటిని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ అధ్యయనాల సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ చంగపల్లి శివరామమూర్తి విశ్లేషణతో సమకూర్చారు. ఆ సంకలనంలోని మొదటి భాగమిది. 

మన గౌరవప్రదమైన నాయకుడు, మాజీ ప్రధాని పీవీ  నరసింహా రావు శతాబ్ది ఉత్సవాలను జరపడంలో భాగంగా మన దేశం తరపున ప్రపంచ వేదికల ద్వారా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతో సముచితం. ఐక్యరాజ్యసమితితో పీవీ నరసింహారావు అనుబంధం దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు (1980-1995) కొనసాగింది. ప్రధానిగా, అంతకు ముందు విదేశాంగమంత్రిగా ఆయన దేశానికి విశిష్ట సామర్థ్యాలతో ప్రాతినిధ్యం వహించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో దాదాపు ఐదేండ్లు పీవీ విదేశాంగ  మంత్రిగా పనిచేశారు. ఆ విధి నిర్వహణలో భాగంగా ఆయన ఐక్య రాజ్యసమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశాల్లో  ఐదుసార్లు ప్రసంగించారు.

1980 దశకంలో అంతర్జాతీయ రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేది. పశ్చిమాసియా, ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆఫ్రికా, మధ్య అమెరికాల్లో సుదీర్ఘమైన సాయుధ సంఘర్షణలు ప్రపంచ శాంతిని కలుషితం చేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌, కంపూచియా, ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధాల్లో బయటి నుంచి శక్తివంతమైన దేశాల జోక్యం కారణంగా అమాయక ప్రజలు అనుభవిస్తున్న అపారమైన బాధలపై  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల  నియంత్రణకు  ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ చేసిన ప్రతిపాదనల యోగ్యత గురించి ఆయన ప్రపంచ సమాజానికి గుర్తుచేశారు. దురదృష్టకర పరిణామాల కారణంగా 1991లో పీవీ ప్రధాని అయ్యే నాటికి దేశీయ అంతర్గత రాజకీయంతోపాటు, అంతర్జాతీయ రాజకీయవాతావరణం కూడా అనూహ్యమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా నాలుగున్నర దశాబ్ధాలుగా ప్రపంచాన్ని పలురకాలుగా వేధించిన ప్రచ్చన్నయుద్ద్ధం అకస్మాత్తుగా ముగిసింది. సోవియట్‌ యునియన్‌ కూలిపోయి విచ్ఛిన్నమైంది. ఇక అమెరికాకు ప్రతిఘటన లేని పరిస్థితుల్లో అలీనవిధాన విదేశాంగ నీతికి చుక్కెదురైంది. ఈ క్లిష్ట సమయంలో ఐక్యరాజ్యసమితిలో పీవీగారి రాజకీయ విజ్ఞత ఎంతో ఉపయోగపడింది.   

ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ, భద్రతామండలి ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రధాని పీవీ పాల్గొన్నారు. ముఖ్యంగా 1992లో భద్రతామండలి మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశంలో, 1995లో జరిగిన ఐరాస 50వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. పీవీ ప్రసంగించిన ప్రధాన శిఖరాగ్ర సమావేశాలలో బ్రెజిల్‌కు చెందిన రియో డి జెనీరో నగరంలో జరిగిన ధరిత్రి సదస్సు (1992), డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌ హగన్‌లో సామాజిక అభివృద్ధి కోసం 1995లో జరిగిన శిఖరాగ్ర సభ చెప్పుకోదగినవి. 1995లో ప్యారిస్‌లో మహాత్మాగాంధీ 125వ జయంతి ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చే అరుదైన గౌరవం మన పీవీ కి లభించింది.  ఈ సమావేశాలలో  ప్రధాని పీవీ 

భారతదేశానికి, యావత్‌ ప్రపంచానికి మేలుకలిగే అంశాలను దీక్షాదక్షతలతో అందరి దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిల్లో ముఖ్యమైనవి.. అణ్వాయుధ నియంత్రణ, విశ్వశాంతికి తీసుకోవాల్సిన చర్యలు, ఉగ్రవాదం నిర్మూలన, ఆర్థిక - సామాజిక అభివృద్ధి, పౌష్టిక ఆహారం సమస్య, భద్రతా మండలి విస్తరణ.. మొదలైనవి ఉన్నాయి. వీటి గురించి పీవీ ఆలోచనలు, సూచనలు ఏమిటో ఆయన మాటల్లోనే ఇక్కడ క్లుప్తంగా పరిశీలిద్దాం.  

ప్రపంచ శాంతి భద్రతలకు బహుళ పక్ష పద్దతి బలోపేతం అవసరం

రాజనీతిజ్ఞత పని ఎల్లప్పుడు అశాశ్వ తం నుంచి శాశ్వతంను జల్లెడ పట్టడం లాంటిది అని పీవీ నమ్మారు. అందుకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో దేశాల సామూహిక ప్రవర్తన కారణంగా ప్రపంచం లో అభద్రత, అపనమ్మకం పెరిగాయి. మరింత ప్రమాదకర వ్యూహాత్మక సిద్ధాంతాలు ప్రతిపాదించబడుతున్నాయని ఆయన వాపోయారు. చిన్న, మధ్యస్థ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న  సూత్రాన్ని పెద్ద రాజ్యాలు అదేపనిగా ఉల్లంఘించడం ఎక్కువైపోయిం ది.  ఇది జాతీయ స్వాతంత్రం, సమగ్రతకు  ఒక బెడదగా తయారైంది. అలీనదేశాల ఉద్యమం ఎప్పుడూ అనుభవానికిరాని అయోమయ స్థితిలో ఉన్నది. పరస్పర అనుమానాలు, విభేదాలు, అంతర్గత సమస్యలు ఉద్యమాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఉద్యమాన్ని పునర్జీవింప చేయడానికి మార్గాలను నిశితంగా వెతకాలి. అందుకు ఈ దేశాల మధ్య ఐక్యత ఎంతైనా అవసరం.

రాజనీతిజ్ఞత పని ఎల్లప్పుడు అశాశ్వ తం నుంచి శాశ్వతంను జల్లెడ పట్టడం లాంటిది అని పీవీ నమ్మారు. అందుకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో దేశాల సామూహిక ప్రవర్తన కారణంగా ప్రపంచం లో అభద్రత, అపనమ్మకం పెరిగాయి. మరింత ప్రమాదకర వ్యూహాత్మక సిద్ధాంతాలు ప్రతిపాదించబడుతున్నాయని ఆయన వాపోయారు

బహుళపక్ష పద్దతి ఇకపై ఆదర్శం మాత్రమేకాదు,  ఒక అవసరంగా మారింది. అణ్వాయుధ పోటీ ద్వారా మానవ మనుగడ ముప్పులో పడింది. సైనికేతర బెదిరింపులు, పేదరికం పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆంతరంగికంగా ఆర్థిక అసమానత, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలతో కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, అస్థిరత, హింస పునరావృతమయ్యే సామాజిక-రాజకీయ కారకాలను మనం గమనించడం అత్యంత అవసరం. మానవజాతి ఎప్పటికప్పుడు పెరుగుతున్న అసమానతలలో చిక్కుకుంటున్నది. ప్రపంచంలోని సహజవనరులు భూమి, నీరు, గాలి.. నిజంగా ప్రకృతి ప్రసాదించిన మనందరి వారసత్వం. కానీ ఇవన్నీ దురదృష్టకరంగా కలుషితమౌతున్నాయి. యావత్‌ మానవాళి శ్రేయస్సు అవసరం. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచీకరణ పోకడల వల్ల కలిగే ప్రయోజనాలను సానుకూలం చేసుకోవాలి.

ఇది సమాచార యుగం. చట్టబద్దంగా, ప్రపంచ ‘సమాచార చోదక శక్తులు’ డబ్బు, వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఈ పరిధికి మించి,  మానవజాతి అధ్యాత్మిక ఏకత్వాన్ని ప్రోత్సహించే జ్ఞానసాధనంగా సమాచారం మారాలి. సామాజిక సమైక్యత అన్ని స్థాయిల్లో ఉండాలి. అయితే సామాజిక సమైక్యత అంటే సాంస్కృతిక ఆధిపత్యం లేదా సజాతీయీకరణ కాదు. ప్రపంచీకరణ వల్ల కొన్ని అనుకూల ప్రభావాలు ఉన్నప్పటికి,  అభివృద్ధి చెందిన సమాజాలు తమ నాగరికతను, ఆధిపత్యాన్ని ఇతర సమాజాలపై బలవంతంగా  రుద్దగూడదు. కొన్ని దేశాల సంపద లేదా సైనిక పెత్తనం కారణంగా అంతర్జాతీయ సమాజం  విలువలు కోల్పోకుండా ‘మంచి సమాజం’ ఉధ్భవించాలి. నా దృష్టిలో, దీనికి ప్రభుత్వాలు, నాయకులకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజాల నాయకుల తరపున నిరంతర కృషి అవసరం. ఒక ప్రారంభాన్ని ఎక్కడో ఒక చిన్న మార్గంలోనైనా చేయవలసి ఉంది.

ప్రపంచీకరణ వల్ల కొన్ని అనుకూల ప్రభావాలు ఉన్నప్పటికి, అభివృద్ధి చెందిన సమాజాలు తమ నాగరికతను, ఆధిపత్యాన్ని ఇతర సమాజాలపై బలవంతంగా  రుద్దగూడదు. కొన్ని దేశాల సంపద లేదా సైనిక పెత్తనం కారణంగా అంతర్జాతీయ సమాజంవిలువలు కోల్పోకుండా ‘మంచి సమాజం’ ఉధ్భవించాలి. 

ఆయుధ నియంత్రణ- అణ్వస్త్ర వ్యాప్తి - నివారణ 

అణ్వస్త్రవిస్తరణను నిరోధించడానికి  అంతర్జాతీయ ఏకాభిప్రాయం సాధించడం మనకు అందుబాటులో ఉన్న ఏకైక తార్కిక మార్గం. అణ్వస్త్ర నిర్మూలన అనే విధానం సార్వత్రికంగా, సమగ్రంగా, దేశాల మధ్య వివక్ష చూపనిదై ఉండాలి. పూర్తి అణ్వాయుధ నిర్మూలన లక్ష్యంతో ముడిపడి ఉండాలి. ఈ అంశాల ప్రాతిపదికగా చూస్తే, ఇప్పుడున్న 1968 ఒడంబడిక భారతప్రభుత్వానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుచేత ఆ వ్యవస్థను సరి అయిన విధంగా అణ్వాయుధ నిరోధక ఒప్పందంగా మార్చాలి. అణ్వస్త్ర నిరాయుధీకరణ విషయంలో నాకన్నా  ముందు  వచ్చిన భారత ప్రధానులందరూ  పండిత నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ  కొన్ని చెప్పుకోదగిన ప్రతిపాదనలు ఇక్కడ ఐరాస సభలలో చేశారు. 

నేను రాజీవ్‌ గాంధీ ప్రణాళిక గురించి ప్రత్యేకంగా చెప్పదలచుకున్నాను. ఆయన ఎంతో ఆశతో, ఆదర్శంతో ఈ ప్రతిపాదన చేశారు. 1988లో నిరాయుధీకరణపై ఐక్య రాజ్యసమితి మూడవ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులోనే దివంగత ప్రథాని రాజీవ్‌ గాంధీ నిరాయుధీకరణ కోసం ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ముందుకు తెచ్చారు. దీని ధ్యేయం అన్ని విధ్వంసక ఆయుధాలను మూడు దశలలో 2010 లోపున తొలగించాలి. 

(మిగతా వచ్చే సోమవారం)

logo