గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 26, 2020 , 23:30:21

పునాదిరాయికే అనుమతి

పునాదిరాయికే అనుమతి

ఐదో అధ్యాయం కొనసాగింపు..

బాబ్రీ మసీదు పోరాట కమిటీ నాయకులు ఏ విధమైన నిర్మాణ కార్యక్రమమైనా సరే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఏ విధమైన త్యాగానికైనా సంసిద్ధులుగా ఉండమన్నారు. కొందరి అభ్యంతరం ఏమంటే.. వీహెచ్‌పీ నిర్మాణం చేపట్టాలని ఎంపిక చేసిన స్థలం హైకోర్టు ఆంక్షలు విధించిన తావులోపలే ఉందని. 

1989 ఆగస్టు 14నాటి కోర్టు ఉత్తర్వులపై వివరణ కోరుతూ (00S 4/1989) రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. దీనిని మరికొన్ని దరఖాస్తులను కలిపి ప్రత్యేక ఫుల్‌ బెంచి 1989 నవంబర్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని ఆచరణాత్మక భాగం ఈ క్రింది విధంగా ఉంది: ‘యధార్థ స్థితిని కొనసాగించే ఉత్తర్వుల విషయంలో, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఆస్తియొక్క స్థితినిగానీ, హోదానుకానీ మార్చటంగానీ లేదా రూపాంతీకరణం చేయటం గానీ చేసేందుకు నిషేధాజ్ఞలు ఇరుపక్షాలకు వర్తిస్తాయి. 11-8-1989 నాటి ఉత్తర్వులు దావాలో ఉటంకించిన యావదాస్తికి సంబంధించినటువంటివి. EFGH అక్షరాల మధ్యగల ప్లాటు నం. 586కూడా యావదాస్తిలోని భాగమే. దావాలోని కొన్ని సమస్యలు న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కారమవుతాయనుకోవటం సందేహాస్పదమే.’ 

ముఖాముఖి ప్రతిఘటనను, రక్తపాతాన్ని మత సామరస్య క్షీణతను తప్పించేందుకు గాను వీహెచ్‌పీ నిర్మించ తలపెట్టిన మందిరపు పునాదిరాయిని వివాదంలో ఉన్న కట్టడం ఎదురుగా వివాద ఆస్తి వెలుపల వేసుకునేందుకు అనుమతించబడింది. జిల్లా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని ఆ పైన అడ్వకేట్‌ జనరల్‌ సలహా పొందిన పిమ్మట ఆ అనుమతిని మంజూరు చేయటం జరిగింది. జిల్లా అధికారుల నివేదికలోగాని, అడ్వకేట్‌ జనరల్‌ సలహాలోగాని ఆ స్థలం దావాలోని స్థలానికి సంబంధించినదిగా పేర్కొనబడలేదు. శాంతిని ధ్యేయంగా పెట్టుకొని అన్ని వర్గాలు అందుకు సమ్మతించాయి. 

ఇక్కడ ఓ విషయం మనవి చేయటం సందర్భోచితమేననుకుంటాను. రామమందిరాన్ని వివాదంలో ఉన్న స్థలంలో వివాదంలో ఉన్న కట్టడాన్ని పడగొట్టో, లేక వివాద స్థలంలో మరో చోట నిర్మించాలనే వీహెచ్‌పీ వాదనను బీజేపీ బలపరుస్తుండగా ఇతర ప్రధాన రాజకీయ పక్షాలు దానికి భిన్నంగా మందిరం నిర్మింపదలిస్తే, వివాదంలో ఉన్న వ్యవహారాన్ని సంప్రదింపుల ద్వారా చక్కదిద్దుకోవటమో లేక కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండటమో అనే వైఖరిని అవలంబించాయి. వివాదంలేని స్థలంలో, వివాద కట్టడానికి దగ్గరలో  (పలువురు ఆ స్థలాన్ని రామజన్మభూమిగా విశ్వసిస్తారు) పునాదిరాయి వేయటం దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు తీసుకున్న వైఖరికి అనుగుణంగానే ఉంది. 

శిలాన్యాస్‌కు అనుమతి లభించటం-అది కేవలం ప్రతీకాత్మకమేనని ముస్లిం  హిందూ వర్గాల ప్రతినిధుల మధ్య సంప్రదింపుల ద్వారా ఓ పరిష్కారం లభించేవరకో లేదా న్యాయస్థానం మళ్లీ వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసే వరకో నిర్మాణాన్ని ఆ సంస్థ చేపట్టదనే నమ్మికతో అనేది ఇక్కడ గట్టిగా చెప్పాల్సి ఉంది. వీహెచ్‌పీ, బీజేపీ కూటమి పునాదిరాయి వేసుకునేందుకు లభించిన అనుమతి ఆసరాగా, పునాదిరాయి వేసిన పిమ్మట వెంటనే ప్రకటించారు- మందిరం పూర్తయ్యేవరకు నిర్మాణాన్ని కొనసాగిస్తామని. మందిరం ప్లానును కూడా వాళ్లు ప్రకటించలేదు. కనుక వాళ్లు నిర్మించే మందిరం వివాదంలో వున్న  కట్టడం వైపునకు సాగుతుందో లేదో తెలియదు. ఈ లోగా హైకోర్టులో ముస్లిములు మరో వివాదాన్ని లేవదీశారు. శిలాన్యాస్‌కు అనుమతించిన స్థలం కూడా దావాలోని స్థలంలోనిదే కనుక మందిర నిర్మాణం అనేది కోర్టు ధిక్కారం క్రిందికి వస్తుందని. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్మాణ కార్యక్రమాన్ని నిలిపివేయవలసిందిగా ఆదేశించింది. రాముడు జన్మించిన చోట రామమందిర నిర్మాణానికి అనుమతించకుండా హిందువుల న్యాయమైన హక్కును కాలరాచి ముస్లిములను బుజ్జగించే వైఖరిని రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్నదనే బీజేపీ-వీహెచ్‌పీ తీవ్రమైన ప్రచారాన్ని కూడా ఖాతరు చేయకుండా ప్రభుత్వం తన ఆదేశాలను ఉక్కు పిడికిలితో అమలయ్యేట్లు చూసింది. 

శిలాన్యాస్‌కు అనుమతించటం హిందూ సనాతన వాదులతో కుమ్మక్కయిన చర్యగా అలనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కొన్ని వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఏది ఏమయినా పై వాస్తవాల విశ్లేషణ ప్రకారం.. ఇటు కేంద్ర ప్రభుత్వం (రాజీవ్‌గాంధీ నాయకత్వాన గల), అటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి విశ్వసించదగినదే; ఇరు వర్గాల మధ్య సామరస్యాన్ని, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో చేపట్టినటువంటిదే. పైన పేర్కొన్నట్లుగా, బీజేపీ మినహా మిగతా ముఖ్యమైన రాజకీయ పక్షాల వైఖరికనుగుణంగా వివాదంలో ఉన్న కట్టడాన్ని కదిలించకుండా, కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించకుండా మందిరాన్ని నిర్మించాల్సి ఉంది. వివాదంలో ఉన్న ఆస్తి ఇదని ఏనాడూ ఆ స్థలాన్ని కోర్టు పరిశీలించి అక్కడికక్కడే నిర్ణయించిన దాఖలాలు లేవు. కోర్టు అనేక కమిషన్లను నియమించటం జరిగింది. వారు వారి నివేదికలను సమర్పించారు. కానీ వాటిని వేటినీ పలు కారణాల వల్ల కోర్టులు ఆమోదించలేదు. అటువంటి పరిస్థితుల్లో వివాదంలోని ఆస్తి విషయంలో సాధారణంగా ఏర్పడే అభిప్రాయమేమంటే అది గోడ కట్టిన మేరకైనా వివాదంలో ఉందనే. ఆ సమయంలో వివాదంలో ఉన్న ఆస్తికి బయటి హద్దు ఇదమిద్ధంగా లేదు. ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించకుండా జిల్లా/ రెవెన్యూ అధికారులనుంచి నివేదికలు తెప్పించుకొని రాష్ట్రస్థాయి నిపుణుడైన అడ్వకేట్‌ జనరల్‌ స్థాయి అధికారి నుంచి న్యాయ సలహాలను పొంది అత్యంత విస్ఫోటనానికి గురయ్యే పరిస్థితిని అదుపుచేయాలనుకుంది. మందిర నిర్మాణం చేపట్టబోయే స్థలం కోర్టు నిషేధించిన స్థలంలోది కాదని తెలియవచ్చిన తర్వాత ప్రభుత్వం కేవలం పునాదిరాయి వేసేందుకు మాత్రమే అదీ ప్రతీకాత్మకంగానే  అనుమతిని మంజూరు చేసింది. ఈ నిర్ణయంలోని ప్రధాన అంశం ఏమంటే.. ఆ సమయంలో ప్రభుత్వం వీహెచ్‌పీతో అటువంటి ఒడంబడికకు వచ్చినందువల్ల వివాదంలో ఉన్న కట్టడానికి రక్షణ ఏర్పడింది; అది కొత్తగా చేపట్టే నిర్మాణ కార్యక్రమాల బెదిరింపులకు దూరంగా ఉంది. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo