శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 25, 2020 , 23:24:29

నైమిశారణ్య రహస్యం

నైమిశారణ్య రహస్యం

ఇది పవిత్ర గోమతీ నదీ తీరం. ఇక్కడ స్వాయంభువ మనువు భార్య శతరూపతో కలిసి బహుకాలం తపమాచరించాడు. రావణ వధానంతరం రామచంద్రుడు అశ్వమేధయాగం చేశాడు. మన గృహంలోని పూజామందిరంలో మన మనస్సు నశించి అమనస్కత సిద్ధిస్తే అదే మనకు నైమిశం! ‘మనోనాశో మహోదయః’- జీవితంలో మహోదయ పర్వదినం మనసు నశించటమేగా! ‘నివృత్త రాగస్య గృహం తపోవనం’- రాగద్వేషాలు నశిస్తే మన గృహమే తపోవనం! అది సాధించకపోతే స్వగృహం కూడా కారాగృహం కన్నా నికృష్టం! ఎన్ని ఆశ్రమాలు తిరిగినా అంతా కేవలం శ్రమే!

అని విస్తరించి మూకందం వంటి కంద పద్యంగా రూపొందించాడు. శ్రీమహావిష్ణు క్షేత్రమైన ‘నైమిశారణ్యం’ అన్ని అరణ్యాలలో అగ్రగణ్యం. కందమూల కుసుమ ఫల వృక్షభరితమై ముని ముఖ్యులకు మూల కందమై తేజరిల్లు తపోభూమి. ఒకప్పుడు మహర్షులు తపస్సుకు అనువైన ప్రదేశం తెలుపమని బ్రహ్మదేవుని ప్రార్థించారు. ఆయన మనోమయమైన ఒక చక్రం సృష్టించి, భూమిపై వదలి ‘దీని నేమి(ఇరుసు) ఎక్కడ శీర్యమవుతుందో- విరిగి పడిపోతుందో అది మీ తపస్సుకు అర్హమైన ప్రదేశం’ అని ఆదేశించాడు. ‘నేమి విరిసిన కతన నన్నేల నెలవు నైమిశంబయ్యె’ (కాశీఖండం)- నేమి శీర్యమైన చోటు కాన నేమిశమనీ, నైమిశమనీ, నైమిషమనీ నామం ఏర్పడింది. ‘ఉవాచ నిమిషేణేదం నిహతం దానవం బలం’- ఇక్కడ నిమిషుడను మహాముని ఒక్క నిమిషంలో దానవ సైన్యాన్ని సంహరించాడు కనుక ఈ చోటుకి ‘నైమిషారణ్యం’ అనే పేరొచ్చిందని వరాహ పురాణం వర్ణించింది. మనశ్చక్రం విరిగిన స్థలమే ‘చక్రతీర్థం’గా విరాజిల్లుతోంది. మనసు అనే చక్రం భ్రమణం ఎక్కడ ఆగిపోతుందో, విక్షేపం (చాంచల్యం) తొలగి నిశ్చలమవుతుందో- మనసులోని అసుర (రాక్షస) ప్రవృత్తులు ఎక్కడ అంతమొందుతాయో అదే నైమిశారణ్యమని పరమార్థం! 

మూల భాగవత కథా ప్రారంభ శ్లోకంలోని ‘నైమిశే’ అన్న చిన్న సంస్కృత పదాన్ని పోతన మహాకవి...పుణ్యంబై ముని వల్లభ, గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిశాఖ్యారణ్యంబు నుతింపదగు నరణ్యంబులలోనన్‌

ఈ నైమిశారణ్యంలో శౌనకాది ఎనభై ఎనిమిది వేల మహర్షులు విష్ణు సాయుజ్యం కోరి సహస్ర సంవత్సర కాలం కొనసాగే సత్రయాగ నిర్వహణకై సమావేశమయ్యారు. సత్రమనే మాటకు సత్సంగమని కూడా అర్థం. దీర్ఘసత్రమనగా జీవితకాల సత్సంగమని భావం. యజ్ఞకార్యంలో నడుమ విశ్రాంతి వేళల్లో సూతముని ద్వారా ఇతిహా, పురాణ, ధర్మశాస్త్ర శ్రవణం చేస్తూ ఉంటారు. అప్పటికే పాప పంకిలమైన కలియుగం ప్రవేశించింది. ఏకాగ్ర చిత్తంతో భగవత్‌ కథా శ్రవణ కీర్తనమే ‘కలి’ని తరించే సులభ సాధనమనే నిర్ణయానికి వచ్చారు మహర్షులు. వారు పౌరాణికుడైన ‘ఉగ్రశ్రవ’ సూతునితో- ‘మునీంద్రా! ఈ కలియుగ మానవులంతా సోమరులు. వీరి బుద్ధి మందం. భాగ్యం కూడా మందమే. అల్పాయుష్కులు. దుర్భర రోగ పీడితులు. హృదయం రాగద్వేషమయం. సత్కర్మలు ఆచరించని దుష్కర్ములు. మహాత్మా! ఈ దుష్కృతులకు నిష్కృతి (ప్రాయశ్చిత్తం) ఏమిటి? వీరికి నిశ్చలమైన కళ్యాణం- శాంతిసౌఖ్యాలు ఎలా సమకూరుతాయో నిశ్చయించి మాకు బోధించు. కృష్ణ కథలు వినాలని మేము మిక్కిలి కుతూహలంతో ఉన్నాం’ అని విన్నవించుకున్నారు. ఇంకా ఇలా అన్నారు.

సూతా! ‘హరిగుణోపచిత భాషణముల్‌'- గరుడగమనుని కళ్యాణ గుణ సంకీర్తనలతో సమలంకృతాలైన సం భాషణలు వాగ్దేవికి వర భూషణాలు. ‘అఘు శోషణములు’- సర్వవిధపాపాలకు పూర్ణ పరిహారాలు. ‘మృత్యుచిత్తభీషణములు’- మృత్యుదేవత మనస్సుకు మహాభయంకరాలు. మనిషి భయానికి పరాకాష్ఠ మరణం. ‘ఎవ్వని చరితంబు హృదయంబు జేర్చిన భయమంది మృత్యువు పరువువెట్టు’- భగవత్‌ స్మరణకు మరణం కూడా భయపడి పారిపోతుంది. ‘హృత్తోషణములు’- శ్రోతల హృదయాలకు ఆహ్లాదకరాలు. ‘కళ్యాణ విశేషణములు’- సమస్త ఇహ పర శుభాలకి శాశ్వత నిలయాలు.

కేశవ కీర్తన ఎంత మహిమగలదో కీర్తించిన కందపద్యమిది. నాలుగు పాదాలలోనూ ప్రాస స్థానంలో అమరిన భూషణ, శోషణ, తోషణ, శేషణ పదాలు మృదంగ ఘోషణాల వలె చెవుల్లో చవులూరిస్తాయి. ఒక పదంతో పద్యం ప్రారంభించి ఆ పదంతోనే సహచరించే- సరితూగే పదాలతోనే పద్యం పూరించడం... ఇట్టి విశిష్ఠమైన కందపద్యవిద్యకు అదిగురువు పోతన అమాత్యుడే! ఈ తీరు పనితీరు కల్గిన పద్యాలు పోతన భాగవతంలో పుంఖానుపుంఖాలు.

క. భూషణములు వాణికి నఘ శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ త్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్‌!

‘శ్రవణ సుభగమైన ఛందో నియతి గల్గి/ యతులు గల్గి ప్రాసగతులు గలిగి/ తీపి లయలు గలిగి తెలుగులో పద్యాలు/ హొయలు గలిగి యెడదలూపగలవు’ అన్న రసమయ కవితా దర్శనానికి పోతన నిదర్శనం.

మహర్షులంటున్నారు- ‘సూతా, ధీసమేతా! కలికల్మషాలను కడిగివేసే కృష్ణకథలను, అంతఃకరణ శుద్ధి కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు?’ శ్రవణ భక్తి భగవంతునికి ఎంతో ఇష్టమనే జ్ఞానమున్న రసజ్ఞులకు మాధవ చరితం మాటమాటకు (స్వాదు స్వాదు పదే పదే) మధురాతి మధురం. అన్యులకు అది అరణ్యరోదనం. శాస్త్రం ప్రతిపాదించే కర్మలను ఆచరిస్తేనే ఫలం. కాని, భాగవతం శ్రవణ మాత్రాననే ఫలదాయకం! ‘కలియుగంలో దేశ, కాల, ద్రవ్య, మంత్ర, కర్త, కర్మలు- ఈ ఆరూ అశుద్ధములే. కాన, కథా శ్రవణంలో తప్ప కలిలో వేరు సాధనతో ముక్తి లేదు’ అని వల్లభాచార్యుల హెచ్చరిక.

మ. వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరం పరలంగాక బుధేంద్ర చంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి స్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే!

- వినీతా! సుగుణోపేతా! కరుణాకలితా! సూతా! జీవుల జన్మ-జన్మల కల్మషాలనే కార్చిచ్చు ఎంతో విస్తారంగా, అణచటానికి అలవికానిదిగా, అంతు చిక్కనిదిగా, సహింపరానిదిగా, దాటరానిదిగా, అగాధమైనదిగా, అత్యంత కఠోరంగాను ఉన్నది. కృష్ణ కథ అనే సుధారసమే జడివానై కుండపోతగా కురుస్తుంటే ఏనుగు తొండాల వంటి ఆ వరుస ధారల్లో తడిసి ముద్దవుతేనే ఎప్పటికైనా ఆ దావాగ్ని తాపం చల్లారుతుందేమో గాని మరో ఉపాయంతో- అనగా, కర్మజ్ఞాన యోగాలతో ఆరుతుందా? అంటే అరదని సిద్ధాంతం. ఈ పద్యం పోతన అనుసరించిన నన్నయ మార్గకవితాశైలికి మచ్చుతునక. అన్నీ సంస్కృతపదాలే. కాక, ఆఱునే అనే క్రియాపదం మాత్రం తెలుగు. ‘భవదావ సుధావృష్టిః’- అనే లలితా సహస్రనామానికి ఇది నిండైన వ్యాఖ్య. మొదటి రెండు పాదాలు ‘సుధావృష్టి’కి, తరువాతి రెండూ ‘భవదావ’కి వివరణం. సంసార దావానలమంటే ఎంత భయంకరమో, కంసారి కథాసుధా రసదృష్టి లోకానికి ఎంత అభయంకరమో ఈ అక్షరాల కూర్పు అద్దం పడుతుంది. పై రెండూ పోతన సొంత పద్యాలు.


తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ

98668 36006 logo