మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 25, 2020 , 23:24:29

సాహితీ మిత్రుడు... పి.వి

సాహితీ మిత్రుడు... పి.వి

పి.వి.కి సాహిత్యమన్నా రచయితలన్నా అమితమైన గౌరవం. అభినవ పోతన బిరుదాంకితుడు వానమామలై వరదాచార్యులు, ఆంధ్ర సారస్వత పరిషత్‌ రూపకర్త దేవులపల్లి రామానుజారావు, అరుదైన చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావులతో వారికి గల మైత్రీగరిమను తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

బమ్మెర పోతన పుట్టిన నేలపైనే పుట్టిన ధన్యజీవి వానమామలై వరదాచార్యులు. పోతనలాగే మందార మకరంద సాహిత్యాన్ని ‘పోతన చరితము’ కావ్యం ద్వారా అందించారు. సంప్రదాయ సాహిత్యమే కాదు, అభ్యుదయ విప్లవ భావాలనూ వీరి ‘మణిమాల’లో చూస్తాం. అందులో పరిగపిల్ల, పాకీవాడు, పాదరక్షలు, పాలేరు, హరిజనుడు, మాలపల్లె... వంటి కవితలల్లిన వానమామలై రచనాశక్తి అపారమైంది. ఇలా పేదల పక్షాన గొంతెత్తిన వానమామలై నిజాయితీ పి.వి.ని ఆకర్షించింది. తనలోని అభ్యుదయభావాలకు బలం చేకూర్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే భూసంస్కరణలు చేశారు. రైతు కష్టాలు, కన్నీళ్లు గుర్తెరిగి తన పదవికి పొగపెడుతున్నా బెదరక చట్టసవరణలు తెచ్చారు. వానమామలై ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో, వారికి శాసనమండలిలో స్థానం కల్పించారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వరదాచార్యుల కాలికి గండపెండేరం తొడి గి అభిమానాన్ని చాటుకున్నారు. “వరదన్నకు గండపెండేరం తొడిగినప్పుడు పొందిన ఆనందం నేను ముఖ్యమంత్రినైనప్పుడు కూడా పొందలేదు” అంటూ వ్యక్తపరిచిన అనుభూతి ఆశ్చర్యం కలిగిస్తుంది.

వానమామలై తన ‘పోతన చరితము’లో పోతన కవిత్వ దృక్పథాన్ని, రామాంతికంగా కావ్యం రాసిన విధానాన్ని, హాలిక వృత్తి ధర్మాన్ని, నాటి సామాజిక జీవన స్థితినీ వర్ణించారు. ఆ కావ్యానికి కథానుగుణంగా కొండపల్లి శేషగిరిరావు చాలా బొమ్మలు చిత్రించారు. ఆ రంగుల బొమ్మలతో కలిపి కావ్యాన్ని ముద్రించాలనే వారి ఆశ ఆర్థిక కారణాల వల్ల నెరవేరనేలేదు. అలాగని వారి ప్రతిభ మరుగునపడనూ లేదు. స్వతహాగా చిత్రకళ పట్ల అభిరుచి ఉన్న పి.వి, కొండపల్లితో తరచూ కళల గురించి సంభాషించేవారు.

“ఆంధ్ర సారస్వత పరిషత్‌” సంస్థ రూపకర్త దేవులపల్లి రామానుజారావు అన్నా పి.వి.కి ఎనలేని గౌరవం. తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించడంలో, తెలుగు అకాడెమీ స్థాపనలో... పి.వి మీద వారి ప్రభావం ఎంతైనా ఉంది. దేశప్రధానిగా ఉన్న సమయంలో “ఆంధ్ర సారస్వత పరిషత్‌” స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. అందుకు వేదికగా రవీంద్రభారతి నిలిచింది. నాడు ధవళవస్ర్తాల్లో వెలిగిపోతూ, జ్ఞాన తేజోపుంజాలతో మెరిసిపోతూ, అటు రాజ్యలక్ష్మినీ, ఇటు సాహిత్యలక్ష్మినీ సమంగా ఆరాధిస్తున్న పి.వి. కళాత్మకమూర్తిని సందర్శించాలని ప్రాంగణం సాహిత్యాభిమానులతో కిక్కిరిసిపోయింది. వేదిక మీద దేవులపల్లి రామానుజారావు నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. దాన్ని చిత్రించిన తన మిత్రులు కొండపల్లి శేషగిరిరావును ఘనంగా సత్కరించి, ఆలింగనం చేసుకున్నారు. 

ఆ సభలో ప్రసంగిస్తూ ‘ఏ సౌకర్యాలు లేని, తెలుగు భాషకు దిక్కులేని ఆ కాలంలోనే ఒక మారుమూల పల్లె ఇనుగుర్తి గ్రామం నుంచి మహాపండితులైన ఒద్దిరాజు సోదరులు పత్రికను నడిపారు, వారే స్వయంగా నేర్చుకొని వైద్యసేవ చేశారు. వారి వద్ద నేను కొన్నాళ్లు చదువుకున్నాన’ని చెబుతూ... ఈనాటి యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సభాముఖంగా చెప్పడం పి.వి విజ్ఞతకు, వినయశీలతకూ మచ్చుతునక. ఇప్పటికీ ఆ సలహా ఆమోదయోగ్యమే!

- కొండపల్లి నీహారిణి, 9866360082logo