శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jul 25, 2020 , 23:24:27

యుద్ధం చేద్దాం

యుద్ధం చేద్దాం

మనిషికి యుద్ధం కొత్తకాదు

పోరాటం 

ఇప్పుడే పొడిచిన పొద్దుకాదు

చావు బతుకుల 

సంధ్యాకాలంలో ఉన్నాం

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.

ఇవాళ

భయం పండోరా బాక్స్‌ లోంచి

దయ్యాలే రావచ్చు

ఖాతరు లేదు.

సంక్షోభం గీటురాయి మీద

మనల్ని మనం

పరీక్షించుకుంటున్నాం.

ఇది మామూలు యుద్ధం కాదు

శత్రువుతో దోబూచులాడే

గెరిల్లా యుద్ధం.

ఆయుధాలు లేవు

ఎత్తుగడలు తప్ప.

పగవాడు 

ప్రత్యక్షంగా కనపడడు

కొత్తరకం 

మత్స్యయంత్రం కావాలి.

శబ్దభేది కాదు

నిశ్శబ్ద భేది కావాలి.

సాహసమొక్కటే కాదు

సహనం కావాలి

ఉరుకులు పరుగులు కాదు

ఉపాయం కావాలి.

ఓపికే నేటి దీపిక

మనసే ఒక హరిత వాటిక

ఒక్కొక్కరోజు 

ఒక ఆప్యాయతల కావ్యంలా

గడపాలి.

విసుగును కాదు

జీవితం సొగసుల్ని ఆవిష్కరించాలి.

మనశ్శరీరాలతో 

మనం చేసే సంధాన ప్రయోగం

ఇవాళటి గృహయోగం

యుద్ధం మనకు కొత్తకాదు

ప్రపంచ జనులారా రండి!

పరస్పరం ప్రేమించుకుందాం

- డా.ఎన్‌. గోపి


logo