సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 23, 2020 , 23:43:52

ఎవరి దారి వారిదే..

ఎవరి దారి వారిదే..

ఐదో అధ్యాయం కొనసాగింపు..

శిలాన్యాస్‌ పథకం యావత్తూ ఇబ్బందులకు గురయ్యింది. ప్రభు త్వం వెనుకడుగు వేసింది. అమాన్వా మందిరానికి వెనుక ఉన్న స్థలానికి నిర్మాణంలో ఉన్న రోడ్డు పని నిలిపివేయబడింది. అధికారులు ఇటుకలను అక్కడ నిల్వచేసేందుకు అంగీకరించలేదు. అప్పుడు వీహెచ్‌పీ తన ఏర్పాట్లు తాను చేసుకొని ఇటుకలను వివాదంలో ఉన్న స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న వేద మందిరం కాంప్లెక్స్‌ వద్ద దింపుకున్నారు.

అక్టోబరు 15న వీయమ్‌ తార్కుండే సుప్రీంకోర్టులో ఓ రిట్‌ పిటీషను దాఖలు చేశారు-శిలాపూజలను, శిలా యాత్రలను నిషేధించమని. అయితే.. మతపరమైన ఊరేగింపులను నిర్వహించుకోవటం ప్రాథమిక హక్కంటూ సుప్రీంకోర్టు ఆ రిట్‌ పిటీషన్‌ను తోసిపుచ్చింది.

ఈ లోగా లోక్‌సభకు ఎన్నికల ప్రణాళిక 1989 అక్టోబర్‌ 17న ప్రకటించబడింది. పోలింగ్‌ తేదీలను నవంబర్‌ 22, 24గా ఖరారు చేశారు. ఈ ప్రకటనతో అయోధ్య వ్యవహారం కొద్దిసేపు తెరవెనక్కు వెళ్లింది. హిందువులు శిలాన్యాస్‌ పట్ల అంత ఉత్సుకత కనబరచకపోయినా, ముస్లిములు దానిపై ఎక్కుపెట్టారు. బాబ్రీ మసీదు పోరాట నాయకులు ఆజామ్‌ఖాన్‌ దారుల్‌ సఫా గృహంలో అక్టోబర్‌ 26న రహస్య మంతనాలు జరిపారు. ఆ సమావేశంలో నాయకులు ఆ వ్యవహారానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాలనుకొని తమ మతానికి చెందిన సభ్యులను అంతర్జాతీయ సమితికి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కూ ముస్లిములను భౌతికంగా, సాంస్కృతికంగా రూపుమాపే చర్యలను నిలిపివేసేట్లు చూడాలని కోరుతూ 31వ తేదీ తర్వాత టెలిగ్రాములు పంపమన్నారు. ‘ పెచ్చరిల్లుతున్న ముస్లిముల ఊచకోతలను’ ఆపేందుకుగాను హత్యాదళాలు ఏర్పాటు ఆవశ్యకతను గురించి మరో తీర్మానం నొక్కి చెప్పింది.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo