గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 23, 2020 , 23:43:53

సిరిసిల్ల టు సిలికాన్‌ వ్యాలీ

సిరిసిల్ల టు సిలికాన్‌ వ్యాలీ

దాదాపు మూడేండ్ల కిందట హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో భాగంగా జరిగిన సమావేశానికి కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారిణి హాజరయ్యారు. ఆమె సమావేశం హాల్లోకి వస్తూనే అక్కడ కూర్చొని ఉన్న మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ఈ మాట అన్నారు. ‘హల్లో కేటీఆర్‌ గారూ! మిమ్మల్ని క్లోనింగ్‌ చేసి, ఈ దేశంలోని మిగతా 28 రాష్ర్టాలకు కూడా మీలాంటి యంగ్‌ ఎండ్‌ డైనమిక్‌ మంత్రులను పంపించగలిగితే ఎంత బాగుంటుంది.’ ఈ కితాబు చాలు కేటీఆర్‌కు రాష్ట్రం వెలుపల కూడా ఎంతటి పేరున్నదో చెప్పడానికి.


గత జనవరిలో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు కేటీఆర్‌. దావోస్‌లో ప్రధాన రహదారి ప్రోమెనేడ్‌లో నెలకొల్పిన తెలంగాణ పెవిలియన్‌ సదస్సు జరిగినన్ని రోజులూ సందర్శకులతో కిటకిటలాడేది. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు కొందరు తెలంగాణ పెవిలియన్‌కు వచ్చారు. తాము ఇండియన్‌ ఐటీ మంత్రితో మాట్లాడాలని అడిగారు. అక్కడున్న సిబ్బందికి ఒక నిముషం అర్థం కాలేదు. దేశ ఐటీ మంత్రి ఈ పెవిలియన్‌లో ఉంటాడని చెపితే వచ్చామన్నారు. అక్కడి సిబ్బంది వారికి ఇది భారత దేశంలోని ఒక రాష్ట్రం పెవిలియన్‌ అని, ఇక్కడున్నది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అని వివరించి పంపించారు.


నిజానికి ఇది తొలిసారి కాదు. 2017లో గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో పలు దేశాల కేంద్ర మంత్రులు పాల్గొన్న ఒక సెషన్‌లో భారత్‌ తరపున కేటీఆర్‌కే అవకాశం దక్కింది. ఆ సెషన్‌ జరుగుతున్నంతసేపూ అక్కడ వ్యాఖ్యాత కేటీఆర్‌ను భారతదేశ ఐటీ మంత్రి అనే సంభోదించడం గమనార్హం. 2018, 2020 దావోస్‌ సదస్సుల్లో కూడా మంత్రి కేటీఆర్‌ పాల్గొన్న కొన్ని సెషన్స్‌లో ఆయనతో పాటు పాల్గొన్న అందరూ పలు దేశాల కేంద్ర మంత్రులే. గత ఆరేండ్లలో శ్రీలంక నుంచి మొదలు అమెరికా దాకా కేటీఆర్‌ అనేక అంతర్జాతీయ వేదికల మీద ఉపన్యసించారు. ఇట్లాంటి అరుదైన గౌరవం దేశంలోని ఏ రాష్ట్ర మంత్రికీ దక్కలేదు. ఇది కేటీఆర్‌కు ఇవ్వాళ మన రాష్ట్రం వెలుపల, దేశం వెలుపల ఉన్న గౌరవానికి నిజమైన తార్కాణం.


ఇదంతా ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. దీని వెనుక అసమాన త్యాగం, అకుంఠిత దీక్ష ఉన్నది. అమెరికాలో ఉన్నతోద్యోగం వదిలి ఉద్యమ కదనరంగంలో దూకడంతో మొదలైన నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, కార్యదక్షతతో నేడు ఆయన సమున్నత స్థాయికి చేరుకున్నారు.    సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నాడు ఉద్యమంలో అడుగుపెట్టిన నాటినుంచి నేటివరకు కేటీఆర్‌ తనదైన శైలి ఒకటి అలవరచుకున్నారు. తండ్రి వలె నిశిత పరిశీలన, లోతైన అధ్యయనం, అనన్య సామన్యమైన వాగ్ధాటిని కలిగి ఉన్న కేటీఆర్‌ తన నాయకత్వంతో అటు క్లాస్‌, ఇటు మాస్‌ను ఏకకాలంలో ఆకట్టుకోగలిగిన యువ నాయకుడు. విభిన్నమైన అలోచనలు, అనితరసాధ్యమైన ఆచరణ ద్వారా నూతన రాష్ట్రమైన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటుతున్నారు మంత్రి కేటీఆర్‌. ఉద్యమం విజయతీరాలకు చేరినాక స్వరాష్ట్రంలో కొలువుదీరిన తొలి ప్రభుత్వంలో  ఐటీ, పంచాయతీరాజ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్‌ ఒక్కనాడూ విశ్రమించలేదు. ఇంకా రాష్ర్టావతరణ సంబురాలు కొనసాగుతుండగానే సెక్రటేరియట్‌లో అడుగుపెట్టిన ఆయన మొదటి ఘడియ నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. తొలి వారం రోజుల్లోనే ఐటీ పరిశ్రమను అభి వృద్ధి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనే అంశం మీద పరిశ్రమాధిపతుల నుంచి టెక్నాలజీ విద్యాసంస్థల సంచాలకుల వరకూ అందరితో విస్తృత సమావేశాలు జరిపి స్పష్టమైన వ్యూహంతో ముందుకువెళ్లారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఆరు నెలలు కేటీఆర్‌ తీసుకున్న చర్యల వల్ల అప్పటిదాకా హైదరాబాద్‌ భవితవ్యం మీద కొందరు పనిగట్టుకొని చేసిన దుష్ప్రచారం దూదిపింజెల్లా తేలిపోయి నగరాభివృద్ధి ఊపందుకున్నది. టీ-హబ్‌, వీ-హబ్‌, టీ-వర్స్‌, టాస్క్‌, టీ-శాట్‌, తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేటీఆర్‌ మదిలో రూపుదిద్దుకొని నేడు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంస్థలెన్నో. తదనంతర కాలంలో మున్సిపల్‌ శాఖ మంత్రి అయిన కేటీఆర్‌ హైదరాబాద్‌ నగరానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఓ వైపు హైదరాబాద్‌కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగేలా చేస్తూ, మరోవైపు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. మంచినీటి సరఫరాలో మెరుగుదల చూపించారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద కొత్త ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మాణం, నూతన రోడ్ల అభివృద్ధి, కొత్త పార్కుల ఏర్పాటు, నగర ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానల ఏర్పాటు, దేశంలోనే తొలిసారిగా ఒక డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ‘మిషన్‌ భగీరథ’ను పరుగులు తీయించి, మైనింగ్‌ మంత్రిగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఇతోధికంగా కృషిచేశారు. చేనేత, జౌళిశాఖ మంత్రిగా సిరిసిల్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతన్నల కన్నీరు తుడిచారు కేటీఆర్‌. ఈ ఆరేండ్లలో చక్కని అడ్మినిస్ట్రేటర్‌గానే కాదు, మంచి ఆర్గనైజర్‌గా కూడా కేటీఆర్‌ తనని తాను నిరూపించుకున్నారు. 2015లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఇంచార్జిగా బాధ్యత తీసుకున్న కేటీఆర్‌ పార్టీకి ఒక్క కార్పొరేటర్‌ కూడా లేని పరిస్థితి నుంచి 99 స్థానాలను గెలుచుకునే స్థాయికి చేర్చి చరిత్ర సృష్టించారు. అప్పటినుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ పార్టీని విజయపథాన నడుపుతున్నారు.

నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడి కన్నీరు తీర్చడానికి కేటీఆర్‌ సమర్థ వంతంగా వినియోగిస్తారు. ఆరోగ్యపరమైన అత్యవసరస్థితిలో ఉన్నవారు కేటీఆర్‌కు ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు సాంత్వన దొరుకుతుందనే విశ్వాసం ప్రజల్లో వచ్చింది. కరోనా వ్యాపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా కేటీఆర్‌ ఓవైపు ఆపన్నులకు అభయం ఇస్తూనే మరోవైపు పాలన కుంటుపడకుండా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. లాక్‌డౌన్‌లో అత్యవసర సమస్యలను ఎదుర్కొన్న ప్రజలను కేటీఆర్‌ ఆపద్భాంధవుడిలా ఆదుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఈ దిశగా కేంద్రం ఏం చేయాలో కూడా కేంద్రానికి తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందేలా సమన్వయం చేస్తున్నారు. నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పనులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. విపత్తు వచ్చినప్పుడే నిజమైన నాయకుడెవరో తెలుస్తుంది. అట్లాంటి నిజమైన ప్రజానాయకుడిగా ముందుండి నడిపిస్తున్న కేటీఆర్‌ మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ, యువ నాయకుడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

- కొణతం దిలీప్‌

తాజావార్తలు


logo