బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Jul 22, 2020 , 23:21:25

గుజరాత్‌ ఏమాయె గురివిందా!

గుజరాత్‌ ఏమాయె గురివిందా!

మోదీ పరివార ప్రచార దళాలు రాష్ట్ర ప్రభుత్వాలపై అసత్య ప్రచారానికి ప్రయత్నిస్తున్నాయి. భారత్‌ ప్రస్తుతం

ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభాలకు బాధ్యత వహించాల్సిన బీజేపీ ఎదురుదాడి చేస్తున్నది. కరోనా వైరస్‌ రాకముందే భారత ఆర్థికవ్యవస్థ కుదేలైపోయింది. పాకిస్థాన్‌, చైనా యుద్ధాల్లో దేశానికి జరిగిన ఆర్థికనష్టం కంటే ఎక్కువగా డిమానిటైజేషన్‌ వల్ల జరిగిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో

వ్యవహారసరళిని పరిశీలిస్తే వ్యవస్థల విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం అనే విషయాన్ని విస్మరించి నివేదికలను విడుదల చేస్తున్నది. బీజేపీ రాజకీయ ఉద్దేశాలను ప్రచారం చేసే బాధ్యతను

తీసుకొని నియమాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది.

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తుంటే, భారత ప్రభుత్వం రూ.100 కోట్లతో ఆర్భాటంగా ట్రంప్‌ స్వాగత సత్కారాలలో మునిగిపోయింది. విపత్కర పరిస్థితులను సరైన సమయంలో ప్రజలకు వివరించడంలో విఫలమైంది. జనవరి 23న చైనా వూహాన్‌లో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్ర మత్తమై కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నాయి. పొరుగుదేశాల మాదిరిగా  దేశంలో ఫిబ్రవరి రెండో వారంలోనే లాక్‌డౌన్‌ ప్రకటించి అంతర్జాతీయ ప్రయాణికులను నియంత్రించి ఉన్నట్లయితే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదు.  చైనాకు పొరుగున ఉండి ఎందుకు మార్చి 25 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉన్నది.


శాస్త్రవేత్తల సూచనలకు వ్యతిరేకంగా ట్రంప్‌ మార్చి 13 వరకు నిర్ణయం తీసుకోకపోవడానికి చైనా లాబీ పనిచేసిందనే బలమైన అభిప్రాయం అమెరికాలో ఉన్నది. మోదీ నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడానికి ప్రధానంగా రెండు వాదనలున్నాయి.   గుజరాత్‌లో 43 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన చైనా పారిశ్రామికవేత్తలు మోదీని ప్రభావితం చేశారనేది ఒక వాదన. ఈ నేపథ్యంలోనే చైనా  దళారుల అవినీతి కార్యకలాపాలపైన ఆస్ట్రేలియా దర్యాప్తును ప్రారంభించింది. చైనా దళారులు గుజరాత్‌లో చేస్తున్న కార్యకలాపాలపై విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగుచూస్తాయి.  ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి శాసనసభ్యుల క్యాంపులు కర్ణాటకలో నిర్వహించడం జరిగింది. 


ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి లాక్‌డౌన్‌ ప్రకటించడంలో ఆలస్యం చేశారనేది మరొక వాదన. ఇదే నిజమైతే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు మోదీనే బాధ్యత వహించాలి. పనులు ఎవరు చేసినా విజయాలను తమ ఖాతాలో, తాము చేసిన పనులు విఫలమైతే ప్రతిపక్షాల ఖాతాలో వేయడంలో మోదీని మించిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. రాష్ర్టాలకు మార్గదర్శకం చేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, కేరళ ప్రభుత్వం మార్చి 11న లాక్‌ డౌన్‌ ప్రకటించింది. ఆ తర్వాత దక్షిణాదిన ఇతర రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. చప్పట్లు కొట్టించడం, దీపాలు వెలిగించడం చేసి మోదీ నాయకత్వంలోనే భారతదేశం కరోనా వ్యాప్తిని విజయవంతంగా అరికట్ట కలిగినదని ప్రచారం చేసుకున్నారు. మరి జూలైలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కు కూడా మోదీనే బాధ్యత తీసుకోవాలి కదా? ఢిల్లీలో తబ్లిగీ సమావేశాలను నిరోధించడంలో విఫలమై ముస్లిం మతంపై అభ్యంతరకరమైన దాడి చేసింది.


మోదీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న గుజరాత్‌ లో కరోనా మరణాల రేటు దేశంలోనే ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్రలో మూడు లక్షల పైచిలుకు వ్యాధిగ్రస్థులు ఉన్నప్పటికీ మరణాల రేటు 3.8 శాతం. తెలంగాణలో మరణాల రేటు ఒక శాతం లోపుగా ఉంటే గుజరా త్‌లో 4.5శాతం ఉన్నది. ఇది దేశంలోనే అత్యధికం. గుజరాత్‌ అవసరాలు తీరిన తర్వాత మెడికల్‌ పరికరాలు వేరే రాష్ర్టాలకు వెళ్లాయి. ఆదివాసులకు గుజరాత్‌ దవాఖానలలో ప్రవే శం దొరకడం లేదన్న ఆరోపణలున్నాయి. అవి నిజమైతే మరణాల శాతం ఇంకా ఎక్కువగా పెరగవచ్చు. గుజరాత్‌లో ఎక్కువగా ఉన్న మరణాల రేటు గురించి ఆందోళన చెందవలసినవారు ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నారు!


కరోనా వైరస్‌ రోగుల సంఖ్య ద్వారా మన దేశానికి ప్రపంచంలో మూడవస్థానం దక్కింది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ ఇక కల మాత్రమే. కరోనా ఒకవైపు, చైనా దురాక్రమణ ప్రయత్నాలు మరొకవైపు దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంటే దేశాన్ని ఏకతాటిపై నడపాల్సిన ప్రధాని రాష్ర్టాలలో రాజకీయ, సామాజిక, మతపరమైన విభేదాలు సృష్టించి అస్థిరపరుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడం, రాజస్థాన్‌లో ప్రభుత్వ మార్పునకు ప్రయత్నించడం, వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి ప్రయత్నించడం ఈ సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన ప్రధాని చేయవలసిన పనికాదు. భారతదేశం 150 దేశాలకు సహాయం చేసిందని మోదీ ఎన్నికల ప్రచారంలో అవాస్తవాలు చెప్పుకోవలసిన అవసరం ఉన్నదా? పదవిలోకి వచ్చి ఆరేండ్లయిన తర్వాత కూడా హుందాగా ప్రవర్తించడం లేదు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను నవ్వులపాలు చేయటం మరింత విషాదకరం. 

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయవేత్త, వాషింగ్టన్‌ డీసీ)

- మాధవరం నాగేందర్‌


logo