సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 22, 2020 , 23:21:26

ఒప్పందాల ఉల్లంఘన

ఒప్పందాల ఉల్లంఘన

ఐదో అధ్యాయం కొనసాగింపు..

రామ్‌టెక్‌ నుంచి ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యునిగా నా నియోజకవర్గం గుండా పోయే జాతీయ రహదారిలో దక్షిణాది రాష్ర్టాల నుంచి వచ్చే పూజ చేయబడిన ఇటుక రాళ్ల లారీల ఊరేగింపులను చూసేవాణ్ని. నేను నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు అదే జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు ఆ లారీలలో వేళ్లే వాళ్లు చాలామంది నన్ను గుర్తుపట్టి, ట్రక్కులను నిలిపి, నా కారును కూడా ఆపి నాతో కొంచెంసేపు మాట్లాడేవాళ్లు. ఈ చెదురుమదురు ఎదురుకోళ్లు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రజలెంత గాఢంగా సంవేదనలను కలిగి ఉన్నారనేది స్పష్టంగా గ్రహించగలిగేవాణ్ని. అలాగే రాముణ్ని రాజకీయాల్లోకి లాగే ప్రక్రియ వాళ్లు అనుకున్నట్లుగా పూర్తయిన తర్వాత పట్టుదలగా మేము ఎదుర్కోవాల్సి వస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఏమి దక్కేది కూడా అర్థమయ్యేది. 

వాస్తవానికి వీహెచ్‌పీకి శిలాన్యాస్‌ నవంబర్‌ 10వ తేదీన జరుపుకునేందుకు అనుమతించాలనే నిర్ణయం (ఆ తేదీని వీహెచ్‌పీ కొన్ని నెలల కిందటే ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల తేదీకి మరీ దగ్గరగా వచ్చి ప్రమాదకరంగా మారాయి) అత్యున్నతస్థాయిలో జరిగింది. ఆ రోజుల్లో ప్రచారంలో మునిగి తేలుతున్న నాకు ఆ నిర్ణయం ఎలా తీసుకోబడిందో తెలియరాలేదు. అందులో కేంద్ర హోంమంత్రి బూటాసింగ్‌ పాత్ర ఉన్నదనగానే కావల్సిన సూచనలందాయి.

***

ఇక శిలాన్యాస్‌ విషయం. 19 89 లోక్‌సభ ఎన్నికల్లో మునిగితేలుతున్న సమయంలో మాకు అకస్మాత్తుగా తెలియవచ్చిందేమంటే, ఎన్నికలకు పదిరోజుల ముందు శిలాన్యాస్‌ జరిగిందని. మాకు తొలిగా తెలియవచ్చిందంటే అది దానికి సంబంధించిన వారందరి అనుమతితో జరిగింది గనుక, ఆ విషయ మై ఎన్నికల్లో ఏ పార్టీకి అదనంగా ఒరిగేదేమీ ఉండబోదని. శిలాన్యాస్‌ జరిపేందుకు అంత త్వరితగతిన నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమిటో తెలియరాలేదు. అది అందరి అంగీకారంతో జరిగిందనేది తప్ప. పోనీలే ఓ జిత్తులమారి వ్యవహారానికి తగిన సమయంలో పరిష్కారం లభించింది. ఇక ఎన్నికలు సజావుగా, లౌకిక పద్ధతిన జరుగుతాయని సంబురపడ్డాం. అయితే మతశక్తులు ఎన్నికలకు కొద్దిరోజులకు ముందుగా ఆ వ్యవహారాన్నంతా వక్రీకరించటం చూసి అవాక్కయ్యాం. దాని ఫలితంగా కాంగ్రెస్‌ అటు హిందువులవి, ఇటు ముస్లిములవి ఓట్లు ఏ మేరకు కోల్పోయిందనేది ఓట్ల లెక్కింపు తర్వాత గాని తెలిసిరాలేదు. 1984లో 415 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ బలం 1989లో 196కు పడిపోవటం ఎవ్వరి ఊహకూ అందని విషయమే. దానర్థం మత ప్రభావం ఓ ఊపు ఊపిందనే. యూపీలో ఈ పతనం మరీ ఘోరం. లోక్‌సభలో 2 సీట్లున్న బీజేపీ 88 సీట్లకు ఎగబాకింది. తర్వాత మాకు అందిన వివరాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. శిలాపూజ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించి ఆ శిలలను అయోధ్యకు తరలించే విషయంలో ఉత్పన్నమయ్యే స్థితి లక్నోలో చర్చించబడింది. వీహెచ్‌పీ ఈ కింది హామీలు ఇచ్చిన తర్వాత ఒక అంగీకారానికి రావటం జరిగింది:

క) సంబంధిత జిల్లా అధికారులకు వీహెచ్‌పీ శిలాయాత్రలు ఏ మార్గాన నిర్వహింపబడేది ముందుగానే తెలియజేసి ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారులు సూచించినవిధంగా మార్చుకుంటుంది.  గ) మత సామరస్యానికి విఘాతం కలిగేవిధంగా వీహెచ్‌పీ గాని, దాని అనుయాయులు గాని రెచ్చగొట్టే నినాదాలు ఇవ్వరాదు. చ) సాధ్యమైనంత వరకు పూజలు నిర్వహించిన ఇటుకలను లారీలలో జిల్లా అధికారులతో చర్చించి ముందుగా నిర్ణయించుకున్న మార్గాల్లోనే తరలించాలి. జ) అనుభవజ్ఞులు, బాధ్యత వహించగల వీహెచ్‌పీ కార్యనిర్వాహకుల సారథ్యంలో ఊరేగింపు నిర్వహింపబడుతుంది. వాళ్లు జిల్లా అధికారులకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారు. ట) పూజింపబడిన ఇటుకలు అయోధ్యలో ఎక్కడ ఉంచాలనేది జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయించబడుతుంది. డ) 1989 ఆగస్టు 14న అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన లక్నో బెంచి ఆదేశాలకు కట్టుబడి ఉండేందుకు వీహెచ్‌పీ అంగీకరించింది. దానిప్రకారం ‘దావా’కు సంబంధించిన ఇరువర్గాలు పూర్వపు స్థితిని యథావిథిగా కొనసాగించవలసి ఉంటుంది. ఆస్తి స్వభావ స్వరూపాల్లో ఎటువంటి మార్పులు చేయరాదు. శాంతి, మత సామరస్యాలను కాపాడేందుకు కృతనిశ్చయులై ఉండాలి.

దావూదయాల్‌ ఖన్నా, యస్‌సీ దీక్షిత్‌, మహేష్‌ నారాయణ్‌ సంప్రదింపులు జరిపేట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ ఒడంబడిక పత్రంపై సంతకం చేసిన వారిలో అశోక్‌సింఘాల్‌, మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌, దావూ దయాల్‌ ఖన్నాలున్నారు. తర్వాత రోజున జిల్లా అధికారులు, వీహెచ్‌పీ నాయకులు కలసి స్థలాన్ని పరిశీలించారు. నిర్మించబోయే మందిర సింహద్వారం ఎక్కడ ఉండాలి, ఎక్కడ పూనాదిరాయి వెయ్యాలనే వాటిని నిర్ణయించారు. రామ శిలలను అమాన్వా మందిరానికి వెనుక ఉన్న స్థలంలో ఉంచాలనుకున్నారు. పూజింపబడిన ఇటుకలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించేందుకు ఎనిమిది మార్గాలను ఖరారుచేశారు. ఇలాంటి ఒడంబడిక ముస్లిములలో ఆగ్రహాన్ని రేకెత్తించటం సహజమే. అక్టోబర్‌ రెండవ వారంలో ఈ ప్రస్తావన పార్లమెంట్‌లో చర్చకు రాగా కొందరు సభ్యులు పునాదిరాయి వేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని ఆరోపించారు. అయితే దానిని బూటాసింగ్‌ ఖండించారు. లోక్‌సభలోని బీజేపీయేతర పార్టీల సభ్యులందరూ నిర్వహింపబోయే శిలాన్యాస్‌ను వ్యతిరేకించారు. వివాదాస్పద స్థలంలో శిలాన్యాస్‌ జరుపరాదంటూ అక్టోబరు 13న తీర్మానం చేయబడింది. అక్టోబరు 14న ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక (లక్నో) వీహెచ్‌పీ శిలాన్యాస్‌ జరుపబోయే చోటు ప్రభుత్వ స్థలమనే కథనాన్ని తొలిసారిగా ప్రచురించింది. దాని ప్లాట్‌ నం.586. నజుల్‌ (ప్రభుత్వ) రికార్డుల ప్రకారం అది వక్ఫ్‌షాహీ ఆధీనంలో ఉన్న శ్మశానవాటిక. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ కథనం ప్రకారం.. పూజించిన ఇటుకల్ని నిల్వ చేయదల్చుకున్న తావు, అమాన్వా మందిరానికి వెనుకవైపు స్థలం కూడా ప్రభుత్వానిదే.  (ఆ శ్మశానవాటికలు బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో చేర్చబడినాయి కేసు అలహాబాద్‌ హైకోర్టు స్పెషల్‌ బెంచి ముందుం ది. 1989 ఆగస్టు 14న పూర్వస్థితిని కొనసాగించాలని ఇంజక్షను ఉత్తర్వులు జారీచేయబడినాయి).

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo