ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 22, 2020 , 23:21:21

కాంగ్రెస్‌ తరహా సత్కారం!

కాంగ్రెస్‌ తరహా సత్కారం!

అధికారం కోల్పోయి ఆరేండ్లయినా కాంగ్రెస్‌ నాయకులలో హాస్య చతురత తగ్గినట్టు లేదు! తెలంగాణ ఉద్యమకాలంలో వీరి పిల్లిమొగ్గలను చూసి జనం నవ్వుకునేవారు. అధిష్ఠానవర్గాన్ని కాదు గదా ఆంధ్రా పాలకవర్గాన్ని కూడా ధిక్కరించలేని బలహీనత వీరిది. ప్రజల ముందు అభాసుపాలు కాకుండా పడరాని పాట్లు పడుతుండేవారు. ఇప్పుడు అత్యంత పేలవమైన నటనా ప్రదర్శనకు వీరికి మరో సందర్బం దొరికింది. అది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ఘట్టం. జూన్‌ 28 పీవీ జయంతి గడిచి మూడు వారాలు కావస్తున్నది. ఎట్టకేలకు అధిష్ఠానం దయతలచి అనుమతి ఇచ్చినట్టున్నది. పీవీ అందరివాడనీ, తాము కూడా శత జయంతి ఉత్సవాలను జరుపుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 24న జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్‌ పెద్దలు మన్మోహన్‌, చిదంబరం, జైరామ్‌ రమేశ్‌ జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతారట! సోనియా, రాహుల్‌ గాం ధీ సందేశాలు పంపుతారట! 


జయంత్యుత్సవాల పేరిట జరుపతలపెట్టిన ఈ తతంగం పీవీని గౌరవించడమా లేక కించపరచడమా అనేది ఘనత వహించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులే తెలుపాలి. ఆకాశమంత ఎత్తున ఉన్న పీవీని అంగుష్ఠమాత్రుడిగా చూపుతూ అటు అధిష్ఠానవర్గాన్ని ఆనందపరచవచ్చు, ఇటు తెలంగాణ ప్రజల ముందు పరువు నిలబెట్టుకోవచ్చనేది కాంగ్రెస్‌ నాయకుల ఎత్తుగడగా కనిపిస్తున్నది. దేశ ప్రధానిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానాయకుడు పీవీ శత జయంతి ఉత్సవాలను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానవర్గమే జాతీయస్థాయిలో ఒక కమిటీ వేసి ఆయన స్థాయికి తగినట్టుగా జరుపకూడదా? ఆయన జీవితమంతా కాంగ్రెస్‌కు, గాంధీ కుటుంబానికి సేవ చేయడంలోనే గడిచిపోయింది కదా! పీవీ బతికున్నప్పుడు కాంగ్రెస్‌ పెద్దలు ఆయనను వెంటాడి వేధించిన దుర్మార్గాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేరు. ఆయన భౌతికకాయాన్ని పార్టీ కార్యాలయంలోకి తీసుకుపోకుండా అడ్డుకున్నది ఈ కాంగ్రెస్‌ పెద్దలే కాదా? మిగిలిన ఉత్తరాది ప్రధానులందరికీ ఢిల్లీలో స్మారకాలున్నాయి. మాజీ ప్రధాని అయినప్పటికీ పీవీకి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు జరిపి సమాధి కట్టడానికి కాంగ్రెస్‌ పెద్దలు అంగీకరించలేదు. ఇప్పుడు హైదరా బాద్‌లో శత జయంత్యుత్సవాల పేరిట మరోసారి చులకన చేస్తున్నారు. 


టీఆర్‌ఎస్‌ నాయకులు పీవీపై  హఠాత్తుగా ప్రేమ ఒలకబోస్తున్నారనే రీతిలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతూ ఉంటే తాము ఇరకాటంలో పడుతున్నామనేదే కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన. తమ చేతకానితనానికి ఇతరులను నిందించడమెందుకు? వింధ్య పర్వతాలు దాటి హస్తిన పీఠాన్ని అధిరోహించిన మహా నాయకుడిగా, నెహ్రూయేతర కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని ఐదేండ్లు నిశ్చలంగా పాలించిన అసహాయ శూరుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు. పీవీని చిన్నబుచ్చడం ద్వారా కాంగ్రెస్‌ నాయకుల అల్పబుద్ధి బయటపడుతున్నదే తప్ప ఆయన ప్రతిష్ఠ ఇసుమంత కూడా మసకబారదు.


logo