శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 21, 2020 , 22:57:37

ఇంటెలిజెంట్‌ వ్యూహం!

ఇంటెలిజెంట్‌ వ్యూహం!

కరీంనగర్‌లో మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ క్యాంపస్‌ను ప్రారంభించడం సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఉత్తేజాన్నిస్తున్నది. ఒకప్పుడు కరీంనగర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో యువత ప్రతిభ ఉండీ ఉద్యోగాలు లేక అల్లాడిపోయారు. మంచి చదువులు చదివి విదేశాలలో ఉన్నత సోపానాలు అధిరోహించిన కరీంనగర్‌ బిడ్డలు చాలా మంది ఉన్నారు. వీరు కరీంనగర్‌లో కంపెనీలు పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో యువ మంత్రి ఐటీ టవర్‌ను ప్రారంభించడం ద్వితీయ శ్రేణి పట్టణాలలోని యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నది. మానేరు జలాశయం ఒడ్డున భారీ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి, దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్టయితే, మరో టవర్‌ నిర్మాణానికి కూడా సిద్ధమని హామీ ఇచ్చారు. కొత్తగా కంపెనీలు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.  

తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్‌ విద్య ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకున్నది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ను ఏర్పాటు చేసింది. కళాశాలలు, శిక్షణ కేంద్రాలు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. కొద్ది నెలల కిందటే హనుమకొండలోని మడికొండలో మంత్రి కేటీఆర్‌ ఐటీ క్యాంపస్‌ను ప్రారంభించారు. కరీంనగర్‌తోపాటు మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమను విస్తరిస్తామని ఆనాడే తెలిపారు. అనతికాలంలోనే ఇప్పుడు కరీంనగర్‌లో ఐటీ టవర్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు కేటీఆర్‌ చెప్పిన జాగ్రత్త కూడా గమనార్హమైనది. ఉద్యోగం ఉంది కదా అని బలాదూర్‌గా ఉంటే మంచిది కాదు. కాలానుగుణంగా యువత ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండాలి. కేటీఆర్‌ అన్నట్టు ఐటీ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మారిపోయింది. ప్రభుత్వ కూడా ఇంటెలిజెంట్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నది! 

మానేరు తలాపున ఉండి కూడా కరీంనగర్‌ ప్రజలు మంచినీళ్లకు ఇబ్బంది పడ్డ రోజులు ఒకప్పుడు ఉండేవి. మంత్రి కేటీఆర్‌ మంగళవారం మంచినీటి పథకాన్ని ప్రారంభించడంతో నీటి కష్టాలు తీరాయి. కరీంనగర్‌ను సకల సౌకర్యాలు గల సుందరనగరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. చూడముచ్చటైన కేబుల్‌ వంతెన ముస్తాబవుతున్నది. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పూర్తయితే హైదరాబాదును చూసేందుకు వచ్చిన యాత్రికులు కరీంనగర్‌ను కూడా సందర్శిస్తారు. త్వరలో హైస్పీడ్‌ రైళ్ళు వస్తున్నాయనీ, కరీంనగర్‌నుంచి హైదరాబాద్‌కు గంటా నలభై ఐదు నిమిషాలలో ప్రయాణించడాన్ని మనం ఐదు పదేండ్లలో చూడబోతున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ జిల్లాల  పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నదనడానికి కరీంనగర్‌ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం.


logo