ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 21, 2020 , 22:57:42

కవితా శరథి

కవితా శరథి

తే. గీ. ప్రజల ప్రాణమానమ్ములు పరక వోలె

        మారి-నీచాధికార దుర్మార్గులైన

          ప్రభుల పాదాల కడ కట్టువడినవేళ

          శరధివై లేచినావు దాశరథి! సుకవి!!


తే. గీ. కోటి రతనాలవీణ దిక్కులను మేలు

          కొలుపు రీతిగా వాయించుకొనిన ఘనత

          సొంతమును చేసుకున్నాడవెంత పొంగి

          పోయెనో కదా! తెలగాణ భూమి నాడు.


ఉ. బీరమునందు నిన్ను మరిపించు కవీశుడు లేడు నాడు-మూ

    లేరుని ధిక్కరించి బెదిరించితి-పద్యములెక్కుపెట్టి కిం

    శారువు వోలె గుచ్చితి-నిజామర దండలు వేసియున్న బు

    య్యారములోని కుడ్యములనందు రచించితి కైత కైదువుల్‌.


సీ. ప్రజల కన్నీరును పదునైన చురకత్తు

                      లను జేయ పద్యమ్ములను రచించి

    అనయమ్మునాంధ్రమహాసభ వేదిపై

                      చైతన్య దీపమ్ము చక్కదిద్ది

    పేరెత్తుటకె ప్రజల్‌ భీతిల్లు నైజాము

                      నిండు గుండియిలలో నిద్ర వోయి

    చిత్రసీమకు వన్నె చిన్నెలూరెడు గేయ

                      రాజమ్ములను సమర్పణము జేసి.


తే.గీ. కన్నుమూసినా తెరిచినా కమ్మనైన

        పద్యములు రాసితివి-తెలంగాణ జనుల

        బతుకు పోరాటముల పాలు పంచు కొనితి

      హితులకాదర్శమైన జీవితము నీది.


తే.గీ. ఒక్క కంటిలోనమృత మింకొక్క నేత్ర

        మందు తీక్ష్ణాగ్ని కణములు చిందేనేమొ?

        లేక నీ సేయు కవితనీ రెండు గుణము

        లెట్లు తారాడగలవటోయీ!కవీశ!!

- తోకల రాజేశం 9676761415 


logo