బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - Jul 21, 2020 , 22:57:44

మత ప్రభావ ఫలితం!

మత ప్రభావ ఫలితం!

ఐదో అధ్యాయం కొనసాగింపు..

మా వైపు నుంచి ఏ విధమైన మత ప్రమేయ భావనయినా సరే, అదెంత బలీయమైనదైనా సరే, దాన్ని ప్రకటిస్తే లౌకికత్వానికి భిన్నంగా చూస్తారేమోననే భయం. తత్ఫలితంగా బీజేపీయే హిందు మతానికి ఏకైక కాణాచిగా, రక్షక సంస్థగా ప్రజల మనసుల్లో నాటుకు పోయింది. 

బహుశా ఇటువంటి అవగాహనే రాజీవ్‌గాంధి పాలనా కాలంలో అయోధ్య వ్యవహారంలో తగిన పాత్ర పోషించాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ నాయకత్వం వచ్చి ఉండవచ్చు. అయితే ప్రతికూల పవనాలు వీచటానికి కారణం ఏమిటని చూస్తే బహుశా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని హడావిడిగా అతిగా రాష్ట్రప్రభుత్వం ప్రవర్తించిన తీరే. బీజేపీకి తన చర్యల్ని కప్పిపుచ్చుకునేందుకు హిందువుల హక్కుల్నీ సంవేదనల్నీ పట్టి బాకాలూదే వీహెచ్‌పీ ఆర్‌ఎస్సెస్‌లున్నాయి; కానీ కాంగ్రెస్‌ విషయంలో అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రముఖులైన కొందరు కేంద్రంలోని మంత్రులు, నాయకులు (అప్పట్లో రాజీవ్‌కి సన్నిహితులు) అయోధ్యను ‘స్వాధీనం’ చేసుకునే పోటీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అసలేమీ పట్టించుకోని స్థితి నుంచి పూర్తిగా పట్టించుకునే స్థితికి బహు స్వల్పకాలంలో దుమికిన దుముకు వివిధ ముఠాలలో వివిధ ప్రకంపనలకు కారణభూతం కావటం సహజమే. ఈ స్థితిలోని ముఖ్యమైన చిక్కు ‘శిలాన్యాస్‌'.

1986లో మందిరంగేట్ల తాళాలు తీయటమనేది ఒక సాధికారిక కోర్టుద్వారా జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా జరిగేట్లు చూసిందనే గర్భితనింద చిత్రంగా అటు బీజేపీ బృందాల్లోనూ, ఇటు ముస్లిముల మనస్సుల్లోనూ వేర్వేరు కారణాలవల్ల చాలా ఎక్కువగానే దుమారం రేపింది. ఇరువురికీ వివిధ రకాలుగా భాగానే బాధకలిగించింది. దాన్ని ఎవరేవిధంగా చూసినా సారాంశమేమంటే బీజేపీ క్రమబద్ధంగా అయోధ్యను రాజకీయం చేస్తూంటే ఇతర సంస్థలు- కాంగ్రెస్‌ ప్రభుత్వంగాని, కోర్టుగాని బీజేపీ కావాలని సృష్టించిన సమస్య అదుపుతప్పబోయే సమయంలో జోక్యం కల్పించుకొన్న ముందు జాగ్రత్త చర్యగా తయారయ్యింది. అది అరాచకత్వాన్ని నివారించేందుకు అరాచకవాదుల్ని మధ్యలోనే ఎదుర్కొన్నట్లయ్యింది.  1986లో అలా చిన్న బెదిరింపుకే అనూహ్యమైన విజయాన్ని సాధించిన బీజేపీ, వీహెచ్‌పీలు లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో 1989నాటికి మరో పెద్ద మనోద్వేగభరితమైన ప్రచారాన్ని చేపట్టకపోతే మనం ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. 

నేను తిరిగి మళ్లీ నొక్కి చెప్తున్నాను-నేను ఎవరో, ఏదో, ఎప్పుడో చేసిన దానిని విమర్శింవచటం లేదు. జరిగిన ఘట్టాల్ని తేదీల వారీగా వరుసక్రమంలో పెడుతున్నాను. అవి జరిగిన తీరును బట్టి నేపథ్యంలోని ఉద్దేశ్యాలను పరిగేరినట్లు ఏరుతున్నాను. 

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo