ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 21, 2020 , 22:57:47

కవితాగ్ని.. మా దాశరథి

కవితాగ్ని.. మా దాశరథి

‘నాడును, నేడును  తెలంగాణ మోడలేదు.  శత్రువుల దొంగ దాడికి, శ్రావణాబ్రమటుల గంభీర ఘర్జాట్టహాసమనలర.. నా తెలంగాణ పోవుచున్నది పథాన..’ అంటూ  తెలంగాణపై అవ్యాజ్యమైన ప్రేమను 

ప్రకటించుకొని, ‘తెలంగాణమున గడ్డి పోచయు సంధించు కృపాణం..’ అంటూ ఈ ప్రాంత పౌరుషాన్ని ఎలుగెత్తి చాటిన వాడు దాశరథి. చల్లని సముద్ర గర్భంలో  బడబాగ్నిని, నల్లని ఆకాశంలోని సూర్యులను చూడగలిగి, ‘మా నిజాము రాజు తరతరాల బూజు’ అని నిరంకుశ నిజాం నవాబు  రాచరికాన్ని 

ధిక్కరించిన ఉద్యమ కవి దాశరథి కృష్ణమాచార్య. తెలంగాణ గడ్డపై అగ్ని ధారలు కురిపిస్తూ.., రుద్రవీణ మీటుతూ.., తిమిరంతో సమరంకి సైతం వెనుకాడని పోరాటయోధుడు మహాకవి దాశరథి. 

సమకాలీన సామాజిక చైతన్యం నుంచి కవులు పుడుతూ ఉంటారు. సమాజంలో వినూత్నమైన కదలికలు కలిగించే శక్తి సామర్థ్యాలు ఉన్న వారిని గొప్ప కవులు అని పిలుస్తాం. వీరు రెండు రకాలు. కండ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక యుద్ధరంగంలో దూకి ప్రజల బాధ, కోపం కవితాక్షరాలుగా మార్చే వాళ్ళు మొదటి రకం. రెండోరకం వారు- ప్రపంచంలో జరిగిన ఉద్యమాలతో ప్రేరణ పొంది ఆ ఉద్యమాలను అవగాహన చేసుకుని మన సమాజంలో రావాల్సిన మార్పుని, చైతన్యాన్ని పసిగట్టి రచనలు చేస్తారు. స్వీయ ఆనుభవాలు అక్షర రూపం దాల్చితే అవి దావానలంలా మండుతూ చైతన్య కాంతులు వెదజల్లుతాయి. అటువంటి మొదటి కోవకు చెందినవాడు దాశరథి కృష్ణమాచార్య. ఒక చేతిలో గన్ను ఇంకొక చేతిలో పెన్ను పట్టిన సాహసి. మనసుకు మాటకు, రాతకు చేతకు సంధానకర్తగా మిగిలి తెలంగాణ స్వాభిమాన ప్రతీకగా నిలిచిన గొప్ప కవి దాశరథి. ఒక దశాబ్దం ఉద్యమ జీవితం, 16 నెలలు జైలు జీవితం గడిపి.. ‘ఓ నిజాము పిశాచమా కానరాడు నిను బోలిన రాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు.. నా తెలంగాణ కోటి రతనాల వీణ..’ అంటూ తెలంగాణ ఉద్యమానికి శిఖర ప్రాయమైన నినాదాన్ని అందించిన కవి దాశరథి. 

ఆకారంలో వామనుడైనా ఆంతర్యంలో త్రివిక్రముడై విశ్వరూపం ధరించాడు. బాల్యం నుంచి ధిక్కార  స్వరం అతనిది. ఇంట్లో ఖచ్చితంగా సంస్కృతం మాట్లాడాలని తండ్రి నియమం పెడితే విభేదించి తెలుగు మాట్లాడి తెలుగుపై ప్రేమను  చాటుకున్నాడు. పాఠశాల విద్య ఖమ్మం లో జరిగేటప్పుడు ఉదయం ప్రార్థనలో నిజాం ప్రార్థనకు బదులు ‘వందేమాతరం’ పాడిన ధీశాలి. 18 ఏళ్ల ప్రాయం నుంచి నిజాంకు వ్యతిరేకంగా ఊరూరు తిరుగుతూ జనాన్ని చైతన్య పరిచాడు. నిజాం సైనికులు మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా భయపడక  జనాన్ని జాగృతం చేయడం లక్ష్యంగా నడిచిన యోధుడు. 

1944లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ మొదటి వార్షికోత్సవం  వరంగల్‌లో నిర్వహిస్తుండగా ఆ సమావేశాన్ని భగ్నం చేయడం కోసం నిజాం సైన్యం  రజాకార్లు ఆహుతులకు వేసిన తాటాకు పందిళ్లు తగలబెడితే ఆ మంటల  వేడి నుంచే  ‘ఓ పరాధీన మానవా..’ అంటూ దాశరథి చేసిన  కవితా విన్యాసం అక్కడ ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కవి కేసరిలా ఆరోజు దాశరథి కవితాగ్ని గోళాలు మండించాడు.ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి  నెల్లికుదురు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు పోతే అక్కడి నుంచి తప్పించుకొని  పారిపోతూ.. ‘ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి, ఆ పొలంను  కాల్చే యండి..’ అంటూ మహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన కవితను ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తూ అడవుల్లోకి పరిగెత్తాడు. కొన్ని రోజుల తర్వాత అరెస్ట్‌ చేసి  వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నిర్బంధించారు. నిజామాబాద్‌ జైలులో మరో రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి పరిచయం ఏర్పడింది. పళ్ళు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో  జైలు గోడలపై అద్భుత కవిత్వం  రాస్తూ పోయాడు దాశరథి. నిజామాబాద్‌ జైలులో దాశరథి పడ్డ అవస్థలు వర్ణనాతీతం. సిమెంటు కలిపిన రొట్టెలు తిని అతని జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నది. ఆయినా ధిక్కారస్వరం ఆగలేదు. ‘ప్రాణములొడ్డి, ఘోర  గాహనాటముల్‌ పడగొట్టి,మంచి మాగాణం సృజించి, ఎముకల్‌ నుసి చేసి, భోషణమున్‌  నవాబుకు స్వర్ణము నింపిన  రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికం దక్కునే..’ అంటూ గర్జించాడు దాశరథి కృష్ణమాచార్య. 

దాశరథి 25  కవితా సంపుటాలు రచించాడు.  తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, పార్సీ భాషలో రచనలు చేశాడు. గాలిబ్‌ గీతాలు తెలుగులోకి అనువదించాడు. ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’,‘మహాబోధి’, ‘తిమిరంతో సమరం’ లాంటి రచనలెన్నింటినో రచించాడు. 1977 నుంచి ఆస్థానకవిగా ఉన్నాడు. ఆంధ్ర ప్రదేశ్‌ తొలి , చివరి ఆస్థానకవిగా దాశరథి మిగిలిపోయారు. ఆయన మన ముందు ఉంచిన కర్తవ్యాలను స్మరించుకుందాం. ఆ బాటలో ఎన్ని ఆటంకాలు వచ్చినా పయనిద్దాం.     

-ములక సురేష్‌  

(నేడు దాశరథి జయంతి..)


logo