సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 21, 2020 , 22:57:49

పీత రాజకీయం వీడరా?

పీత రాజకీయం వీడరా?

రాష్ట్రం కొత్తగా సాధించుకున్నాం కానీ, పాత రాజకీయ వాసనలు, అలవాట్లు, ఆలోచనలు ఇంకా పోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని పీత రాజకీయాలను వారసత్వంగా ఇంకా తెలంగాణలో కొనసాగించే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఎదుగుతున్న రాష్ర్టాన్ని అడ్డుకునే పని సాగుతూనే ఉన్నది. ప్రజలేమైనా ఫర్వాలేదు, పదవే పరమార్థం అనుకొని చేసే రాజకీయంలో ఎవ్వరినీ ఎదగనివ్వకపోవటం.. ఏదీ ముందుకు సాగనివ్వకపోవటం, ప్రజల్ని కుల, మత, వర్గ పరంగా విభజించి తమ పొట్టనింపుకోవటం పీత రాజకీయం లక్షణాలు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆ పీత రాజకీయాల్ని ఇంకా కొనసాగిస్తూ, వాటినిక్కడ పాతటానికి విపక్షాలు ప్రయత్నిస్తుండటం మన దురదృష్టం. తప్పని తెలిసి కూడా చేయకుండా ఉండలేకపోవటం, ఒప్పని తెలిసీ చేయలేకపోవటం దుర్లక్షణం. అదే వారిని ఆవహించిందిప్పుడు.

కాళేశ్వరం నుంచి తాజాగా కొత్త సచివాలయం నిర్మాణం దాకా సాగుతున్న లొల్లి చూస్తుంటే ఇలాగే అనిపిస్తున్నది. కాళేశ్వరం పైనా ఇలాగే కారడ్డాలు మాట్లాడారు. కానీ చివరకు ఏమైందో, రైతుల కళ్లలో కన్నీళ్లకు బదులు గంగనీళ్లు ఎలా కనబడుతున్నయో చూస్తున్నాం. కొత్త సచివాలయం విషయంలోనూ చివరకు అదే జరుగుతుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయినా రాద్ధాంతం యథాతథం!

కేసీఆర్‌ ఏమైనా తన భూముల దగ్గర సచివాలయం కడుతున్నడా? తన భూముల విలువ పెంచుకోవటానికి చేస్తున్నడా? తన కుటుంబం ఉండటానికి కట్టుకుంటుండా? లేదే. ఉన్నచోటనే ట్యాంకుబండ్‌ పక్కనే పాతదాన్ని కూలగొట్టి కొత్తది, మన అవసరాలకు అనుగుణంగా కడుతుంటే ఇబ్బందేంది? ఇదేదో ప్రపంచ సమస్య అయినట్లూ, దీంతో తెలంగాణకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు ఎందుకింత లొల్లి?

ఎవరికి ఉపయోగపడుతదని కాంగ్రెసోల్లు కొత్త గాంధీభవన్‌ కట్టుకున్నరు? ఎవరికి ఉపయోగపడుతదని కమ్యూనిస్టులు ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని ఆఫీసులు కట్టుకున్నరు? ఎవరికి ఉపయోగపడుతదని ఢిల్లీలో బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త ఆఫీసు కట్టింది?  ఎవరి కోసమని ఢిల్లీలో మోదీ కొత్త పార్లమెంటు కడతా అంటుండు?

కేసీఆర్‌ కొత్త సచివాలయం కడతా అంటున్నది అది ఇప్పటికే ఉన్నచోటనే. అంతేగాని, ముందే తాను, తన బంధువర్గం చుట్టూ భూములు కొనుక్కొని, అక్కడికి దగ్గరలో ఎక్కడో కొత్త జాగాలో కడతామనటం లేదు. ఇవాళ కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు సుద్దపూసలా అంటే అదీ కాదు. పేదల బస్తీని కూల్చిమరీ కొత్త భవన్‌ కట్టుకోవటానికి ప్రయత్నించిండ్రు. కరోనా సమయంలో సచివాలయం కూల్చటం అవసరమా అంటాడు ఇంకొకాయన! కరోనా కాలంలో భౌతిక దూరాలు పాటించకుండా మీరు ధర్నాలు చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కల్గించవచ్చు,  కానీ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా సచివాలయం కూల్చటం మాత్రం చేయకూడదా? పనికి రానిది ధ్వంసం చేయకుండా కొత్తది నిర్మాణం ఎలా చేపడుతారు!

 ఈ విమర్శలతో  ప్రతిపక్షాల తీరు  రోజూ టీవీల్లో, పేపర్లలో కనబడటానికి చేసే కార్యక్రమంలా తయారైందే తప్ప ఇందులో తెలంగాణ కోసం పడుతున్న తండ్లాటైతే ఏ కోశానా కన్పించటం లేదు. కేసీఆర్‌పై వ్యక్తిగత రాజకీయ అక్కసుతో తెలంగాణ కోసం చేస్తున్న ప్రతి పనినీ విమర్శించటం, అడ్డుకోవటం, ప్రతిదానికీ వంకలు పెట్టడం, ప్రతిదాంట్లో వ్యతిరేకత వెతకటం ప్రతిపక్షాలకు, కొంతమందికి ఉద్యోగంగా మారింది. రాష్ట్రం వచ్చిన నాటినుంచి ఇప్పటిదాకా ఉపయోగపడే విమర్శలు, సూచనలు ఒక్కటైనా ఇచ్చిన్రా? ఎంతసేపూ చేస్తున్న పనిమీద బండలు వేసుడు, చేసేటోడిమీద పడి ఏడ్చుడు. ఏదో ఓ పాయింటు పట్టుకొని కోర్టులకు పోవుడు, పనుల్ని ఆపుడు.. ఇదో నిత్యతంతులా తయారైంది. ప్రహసనంగా మారింది. ప్రజల నుంచి మొదలుపెడితే అధికార యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ కొత్తగా తెలంగాణ కోణంలో ఆలోచిస్తేనే రాష్ట్రం బాగుపడేది. మెరుగుపడేది. అందుకు అందరి సహకారం అవసరం. అంతేగాని ప్రతి పనికీ అడ్డుపుల్లలేస్తూంటే అది రాష్ర్టానికి నష్టమే తప్ప కేసీఆర్‌కు కాదు. కేసీఆర్‌పై వ్యక్తిగత అక్కసుతో రాష్ర్టానికి అన్యాయం చేయటం సబబు కాదు.

‘ప్రతీదీ తెలంగాణ కోణంలో ఆలోచించి.. తెలంగాణ కేంద్రకంగా చేయాలి’ అని ముఖ్యమంత్రి పదవి చేపట్టిననాడు చెప్పినట్లే కేసీఆర్‌ ప్రతి అంశంలోనూ తెలంగాణ ముద్ర ఉండేలా తాపత్రయపడుతున్నడు. కానీ తెలంగాణ వచ్చాక రాష్ర్టానికి పనికొచ్చే, ఆచరణాత్మకమైన ఒక్క సూచన కూడా విపక్షాల నుంచి రాలేదు. ఎంతసేపూ కేసీఆర్‌ను ఆడిపోసుకోవటం, కేసులు వేయటం తప్ప!

రాష్ట్రం రాకముందు బోలెడన్ని అధ్యయనాలు జరిగాయి. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా చెప్పారు. కానీ ఒక్కటైనా తెలంగాణ వచ్చాక ఏయే రంగంలో ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచించలేదు. ఎంతసేపూ సమస్యల్ని ఏకరువు పెట్టడం తప్ప పరిష్కారాలు చూపటం లేదు. అన్ని సంఘాలూ రాష్ట్రం వచ్చాక చూసుకుందాం అనే దగ్గరే ఆగిపోయాయి. కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపిస్తూ, తెలంగాణ కష్టనష్టాలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ అర్థం చేయిస్తూనే.. రాష్ట్రం వస్తే ఏం చేయాలో కూడా ఆలోచించాడు. ఆ మేధోమథనం నుంచి రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారు. అదే దార్శనికులకు, మామూలు వాళ్లకున్న తేడా.

ఒకవైపు కేసీఆర్‌ విజ్ఞతతో, రాజనీతిజ్ఞతతో రాష్ట్రంలో సరికొత్త శ్రేయో పాలనకు పునాదులు వేస్తుంటే.. అభివృద్ధి పరంగా దేశానికే ఆదర్శంగా మారుస్తుంటే.. సరికొత్త తెలంగాణ సంతకాన్ని చేయిస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం పాతరోత పీత రాజకీయాల్ని  కొనసాగిస్తున్నాయి. రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, ప్రజల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నాయి.  ఎప్పుడు వీరు కండ్లు తెరుస్తారో.., ఎప్పటికి వీరికి జ్ఞానోదయం అవుతుందో..!!

- కమల  


logo