బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - Jul 20, 2020 , 23:57:28

చైతన్యమే అసలైన చికిత్స

చైతన్యమే అసలైన చికిత్స

కరోనాను ఎదుర్కోవడం వర్ధమాన దేశాలకు కత్తిమీద సాము వంటిది. ఇటువంటి మహమ్మారి వ్యాపించిన అసాధారణ పరిస్థితుల్లో అందుకు అవసరమైన మందులు, పరికరాలు, వసతులు అమెరికా వంటి దేశాల్లోనే సరిపోవు. పారసెటమాల్‌ మందు సమకూర్చుకోలేక అమెరికా ఇబ్బందులు పడిన కాలమిది! కరోనా చికిత్సకు సరైన మందును లేదా వ్యాక్సిన్‌ను ఇంకా కనుక్కోనే లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యం ఇవ్వడం, తగిన జాగ్రత్తలు పాటించేలా చేయడమే సరైన విధానం. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా మొదటి నుంచి వ్యవహరిస్తున్నారు. పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు కరోనాకు సంబంధించిన అవగాహన కలిగించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైన చోట స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారంటే, అది కేసీఆర్‌ చైతన్యపరచడం వల్లనే సాధ్యపడింది. 

ప్రజలు చాలా వరకు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు కనుకనే మన రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయి. పలు నగర ప్రాంతాలలో వ్యాపార సంస్థలు, పౌర సంఘాలు ఏమేర లాక్‌డౌన్‌ ఉండాలనేది తమకు తామే నిర్ణయించుకుంటున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీలోని లాడ్‌బజార్‌, బేగం బజార్‌ వంటి ప్రాంతాలలో సికిందరాబాద్‌లోని జనరల్‌ బజార్‌, రాణిగంజ్‌ వంటి హోల్‌సేల్‌ మార్కెట్‌లలో రోజుకు కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతుంది. అయినా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కొంత కాలం దుకాణాలు మూసివేయాలని స్థానిక వ్యాపార సంఘాలు భావించాయి. ఇదే రీతిలో నిజామాబాద్‌, కామారెడ్డి, ఉమ్మడి మెదక్‌, నల్లగొండ జిల్లాల్లోని పలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఢిల్లీ నుంచి బలవంతంగా లాక్‌డౌన్‌ అమ లు చేయడం కన్నా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు ప్రకటించుకోవడం ప్రజల చైతన్యానికి నిదర్శనం. 

ప్రజలు పరస్పర దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక కార్యకలాపాలు సాగించడమే కరోనాను కట్టడి చేసే అత్యుత్తమ విధానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వీడన్‌ వంటి పురోగామి దేశాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. కరోనాను ఎదుర్కొనడానికి ప్రజలకు ధైర్యం నూరిపోయాలని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ఈ విధమైనదే. ఈ నేపథ్యంలో సమాజం మరింత సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొనేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించడం మధ్యతరగతి మేధావుల కర్తవ్యం. ప్రజలలో ధైర్యాన్ని నూరిపోయడానికి, జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు అన్ని వ్యవస్థలు కృషి సాగించాలి.  అంతేకానీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలే విధంగా వ్యవహరించడం బాధ్యత అనిపించుకోదు. 


logo