సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 20, 2020 , 23:58:24

వెన్నాడిన పెనుభూతం

వెన్నాడిన పెనుభూతం

  • ఐదో అధ్యాయం కొనసాగింపు..

ఇక నా విషయానికొస్తే నేనెలాగూ ఆ ప్రతినిధివర్గంలో ప్రధానితోపాటు వెళ్లవలసినవాణ్ని. కనుక రానున్న కొద్దిరోజుల్లో నా ప్రయాణ ప్రణాళికలో అంతరాయమేమీ లేదు. అయితే ఈ పర్యాయం ‘రామ్‌టెక్‌' నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం బాగా ఇబ్బందిగానే ఉండవచ్చు. నిజమే 1984లో అది గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించింది. ఎందుకనో ఈసారి కొంచెం కష్టం కావచ్చునని నా అంతరాత్మ నాకు చెప్తున్నట్లనిపించింది. ఆ భావన ఏ విధంగా చూసినా వ్యక్తిగతమయింది కాదు. అది చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధించిన విషయం. అయితే ప్రజలు, కాంగ్రెస్‌లోని క్రియాశీలురు గతంలోలాగే నాకు మద్దతు పలుకుతున్నారు.

అలా నేను కౌలాలంపూర్‌కు భారత ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తూ దురదృష్టకరమైన ప్రధాని పాత్ర పోషింపవలసి వచ్చింది. పరిస్థితి చూసి దిగ్భ్రమ చెందవలసి వచ్చింది. మిగతా దేశాల అగ్రనేతలతో పోలిస్తే భారత ప్రధానికి కల్పించిన రక్షణ ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. తత్ఫలితంగా ఎంతోకాలంగా అందరం కలిసి మెలిసి తిరిగే విదేశీ మంత్రుల జట్టుకు (ముద్దుగా మేము గాంగ్‌ అని పిలుచుకునేవాళ్లం) పరాయివాణ్నయిపోయాను. అలా గొప్పవాళ్ల స్నేహబృందానికి అపరిచితునిగా నిలిచిపోయాను. వాళ్లతో కలిసి తిరిగే అవకాశమే లేకుండాపోయింది. శిఖరాగ్ర సమావేశంలో నన్ను ముఖ్యుల్లో చివరన ఉంచి భారతదేశం తరఫున మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. అయితే ఎజెండాలోని ఓ ముఖ్య విషయంపై భారతదేశం తన వాణిని విన్పించాల్సి ఉంది. ఇక విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లే సమయంలో ఒంటరితనం పరాకాష్టకు చేరుకుంది. నా ఒక్కడికే ఓ పెద్ద ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని కేటాయించారు. అందులో మరెవ్వర్నీ ఎక్కించలేదు. ఆ గంట ప్రయాణంలో నాకెవ్వరూ తోడు లేరు. అంతకుముందెన్నడూ జరగని విధంగా ఆ సందర్భంలో తలనూ మిగతా శరీరభాగాన్ని వేరు చేసినట్లయ్యింది.

నేను త్వరితగతిన భారతదేశానికి తిరిగి వచ్చాను. బహుశా ముందుగా అనుకున్నదానికంటే కొద్ది గంటలు ముందుగా. అందుక్కారణం ఎన్నికల కారణంగా నాకు తిరుగు ప్రయాణంలో ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని ఆతిథేయ ప్రధాని గుర్తించటమే. శిఖరాగ్ర సమావేశం అంతా బాగా జరిగిందని రాజీవ్‌గాంధీని కలిసి చెప్పేందుకు (ఎప్పుడయినా ఎవరయినా చెప్పేదదే) అతికష్టంమీద కొద్ది నిముషాల సమయం దొరికింది. సరే వారానికి రెండుసార్లు మాత్రమే నడిచే విమాన సర్వీసులో వీలైనంత త్వరగా రామ్‌టెక్‌ దిశగా హడావిడిగా సాగిపోయాను. ఆ తరువాత ఇంకేముంది పగలూ రాత్రీ.. ‘భాయియో, బెహనో..!’ అంటూ ఎన్నికల ప్రచారమే. అప్పుడు అయోధ్య గుర్తుకు రాలేదు.

అయోధ్య గుర్తుకు రాలేదంటే రాకుండా ఎలా? కొద్ది మాసాల క్రితం ప్రధాని ఒక కేబినెట్‌ కమిటీని (లేదా ఏదో ఒక కమిటీని) నియమించారు. దానికి నేను అధ్యక్షుణ్ని. అయోధ్యలో ఆ గందరగోళానికి కారణాలేమిటి, సాధ్యపడితే దానికొక చక్కటి పరిష్కారమార్గాన్ని సూచించటం ఆ కమిటీ పని. నన్నేదో కారణం తెలియని అనుమానం ఆవరించింది. మేమేదో వెల్లడించనటువంటి ఆదేశాన్ని కొంత ఢిల్లీలో మసిబూసి మారేడుకాయజేసి లక్నోకి మోసుకెళ్లాల్సి ఉంది. ఏదయితేనేం ఆ కమిటీ ప్రథమ సమావేశంలోనే అర్థమైపోయింది లక్నోవాళ్లు సరిగా పట్టించుకొనకపోతే మేము దురదృష్టవంతులమేనని. కనుక మేము ఆ సమావేశాన్ని వాయిదావేసి లక్నో ముఖ్యమంత్రిని తరువాత రోజు ఉదయం సమావేశానికి ఆహ్వానించాం. చాలా అమాయకంగా నేను సహజంగా సమావేశాల్లో జరగాల్సిన పద్ధతినే అనుసరించాననుకున్నా. అయితే ఆ తరువాత సమావేశమనేది జరిగిందేలేదు. దానితో నేను దానిని అక్కడే వదిలేయాల్సి వచ్చింది. 

అయితే అయోధ్య పెనుభూతంలా చాలామంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని కార్యకర్తల్ని ఒకటి రెండు సంవత్సరాలుగా చికాకు పరుస్తున్నది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా వున్న ఆ సమస్య క్రమబద్ధంగా రాజకీయ రంగును పులుముకుంటూ, తొలిసారిగా తికమకపెట్టి, దానికి అంతంలేదని అనుకునేట్లు చేసింది. ఇందిరాజీ జీవించివున్న కాలంలోనే గంగాజలం ఊరేగింపులు దేశంలోని పలుప్రాంతాల్లో ప్రజల దృష్టినాకర్షించాయి. రాజకీయ కార్యక్రమాల్ని గురించి ఆలోచించేప్పుడు అవి ఎన్నికలకు సంబంధించినవి కావచ్చు, లేదా సిద్ధాంతపరంగా కావచ్చు- మేము అధికార లౌకికవాదులుగానే పెరిగాం (క్లుప్తంగా సామాజిక ఆర్థిక రంగాలనుకుందాం). మాలో చాలామందిమి మా రాజకీయ పార్టీలకు, అవగాహనలకు దూరంగా మా మతపరమైన విశ్వాసాలను పదిలంగా నిలబెట్టుకోవటంలో మాకెటువంటి ఇబ్బందీ కలిగేది కాదు. అయితే 1985 తరువాత బీజేపీ కార్యక్రమం, తీవ్ర కాంగ్రెస్‌ వ్యతిరేక పంథాలో వ్యవహరించే ఇతర లౌకికవాద శక్తులతో కలిసి పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టింది. రోజురోజుకూ బీజేపీ దేశం ఏ దిశగా నడవాలో నిర్ణయించే దశకు చేరుకుంటున్నట్లుగా కన్పించసాగింది. కాంగ్రెస్‌లోని మేమూ దాన్ని రాజకీయంగా వ్యతిరేకిస్తూ గడుపుకొస్తున్నాం. దేశంలోని మతపెద్దల్లో చాలా ఎక్కువమంది బీజేపీ దృక్కోణంతో ఏకీభవించటంతో అటు ‘సర్వధర్మ సమభావమనే’ మనదేశపు పురాతన ఆలోచనా సరళిని, ఇటు లౌకికవాదం అనే ఆధునిక రాజ్యాంగ పద్ధతిగానీ మతాతీతంగా పకడ్బందీగా ప్రదర్శింపబడలేదు. ధార్మికత, మతవాదం అంతఃశ్చేతనంగా (కొన్ని విషయాల్లో సచేతనంగా, బుద్ధిపూర్వకంగా కూడ) ఒకటిగా చూడబడింది. శతాబ్దాల తరబడి వివిధ రకాలైన ఆలోచనలు, విశ్వాసాల మధ్య సమన్వయంతో నాయకులు మెలగేవారు. వాళ్లంతా దండయాత్రలు, విలీనం వంటి అనేక చారిత్రక, రాజకీయ ఆటుపోట్లను తట్టుకొని రూపొందిన సమాజానికి చెందినవాళ్లు. బీజేపీ కుహనా ధార్మిక ఉద్యమం స్వచ్ఛమైన ధార్మిక స్థరంలో నిలువలేక రాజకీయ లబ్ధికి దానికొక రాజకీయ ప్రతిస్పందన కావలసి వచ్చింది. మేము కాంగ్రెస్‌ వాళ్లం (అధికారంలో ఉన్న సమయంలో) దాన్ని పెంచిపోషించామనే ఒక వ్యాకులపాటు నన్ను వెన్నాడుతూ ఉంటుంది. మేము కూడ మా ధార్మిక సున్నితత్వాన్ని అమలులో ఉంచలేకపోయాం. దానికీ అటువంటి అంతఃశ్చేతనా అవరోధ భావనే కారణం.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo