ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 20, 2020 , 23:58:27

సినిక్స్‌ వృథా ప్రయాస

సినిక్స్‌ వృథా ప్రయాస

పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నపుడు ‘సినిక్స్‌' చేసే చేష్టలను లెక్కించనక్కరలేదు. రకరకాల సినిక్స్‌ అన్ని సమాజాలలో ఉంటారు. తెలంగాణలో వీరి సంఖ్య కొంత ఎక్కువ. ఇది రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లుగా కనిపిస్తున్నదే. నిజానికి వీరి సంఖ్య గతం కన్న క్రమంగా తగ్గుతున్నది. మిగిలి ఉన్నవారు శబ్దకాలుష్యం మాత్రం బాగానే సృష్టిస్తున్నారు. వృత్తిప్రమాణాలు లేని మీడియా, అరాచకమైన సోషల్‌మీడియా వారికి తోడవుతున్నాయి. కరోనా, సెక్రటేరియట్‌ నిర్మాణ సందర్భాలలో కనిపిస్తున్నది అదే. కాని వారిది ఎప్పటికప్పుడు వృథాప్రయాసగానే తేలుతున్నది. ప్రజల దృష్టిలో మరింత పలచబడిపోతున్నారు. 

సమస్య విమర్శలతో కాదు. విమర్శ అంటే ఒక విషయంలోని మంచి చెడులను ఎత్తిచూపేది. అందులోని దృష్టి నిర్మాణాత్మకమైనది. ఆ తరహా విమర్శ అవసరం కూడా. ఆ దృష్టిగలవారు తాము పొరపాట్లుగా భావించేవాటిని చెప్తూనే మంచిని గుర్తిస్తారు. ఇటువంటి విమర్శను ప్రజలు కూడా మెచ్చి ఆహ్వానిస్తారు. ఏది ఇందుకు విరుద్ధమైనదో ప్రజలకు వెంటనే తెలిసిపోయి తిరస్కరిస్తారు. తెలంగాణ వంటి సమాజానికి సద్విమర్శ చాలా అవసరం. తన నేపథ్యాన్ని బట్టి చూసినా, భవిష్య నిర్మాణాన్ని బట్టి అయినా. కాని రాష్ట్రంలో మొదటినుంచి కొంత సద్విమర్శ ఉన్నా, అంతకుమించి కొన్ని సినికల్‌ వర్గాలు తయారయ్యాయి.

ప్రతిపక్షాలు సరేసరి. వాస్తవానికి అవి కూడా నిర్మాణాత్మక విమర్శలు, సూచనలు చేయటం రాష్ర్టానికి వాంఛనీయమైన విషయం. కాని తమకోసం అధికార సాధన మినహా మరొక ఆలోచన అన్నది ఆవగింజంతయినా లేని ప్రతిపక్షాలు, తమ నెగెటివ్‌ ధోరణిని ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నా, అధికారపక్షం మంచి చేస్తున్నదని నమ్మి దానికి పదే పదే పట్టం కడుతున్నా పాఠాలు నేర్వక అదే నెగెటివ్‌ ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఇక్కడ గ్రహించవలసిన కీలకం ఒకటున్నది. నెగెటివిజం దశలో ఉన్న వ్యక్తికి క్రమంగా వివేకం కలిగి, తను కూడా ప్రయత్నిస్తే పాజిటివ్‌ దశలోకి మారవచ్చుగాని, ఇంకా పతనమై సినిసిజంలోకి కూరుకుపోతే ఇక బయటపడటం కష్టం. ఈ సూత్రాలను మన ప్రతిపక్షాలకు అన్వయించి చూస్తే, వారు అధికారం కోసం ఎంతగా తహతహలాడుతున్నారో తమ వైఫల్యాల వల్ల అది అంతగా దూరమవుతున్న స్థితిలో సినిసిజంలోకి కూరుకుపోతున్నారు. దీనినుంచి సమీప భవిష్యత్తులో బయటపడగలరా అనే సందేహం కలుగుతున్నది. వీరికి ఇదొక సంస్కృతిగా మారింది.

కరోనా, సెక్రటేరియట్‌ల విషయమై ప్రతిపక్షాలది నెగెటివిజానికి మించిన సినిసిజం అయినట్లు అడుగడుగునా సామాన్య ప్రజలకు అర్థమవుతూ వస్తున్నందున ఆ వివరాలన్నీ ఇక్కడ రాయటం అక్కరలేదేమో. కరోనాకు సంబంధించిన వివిధాంశాలు అన్నీ ప్రపంచంలో, దేశంలోని వేర్వేరు రాష్ర్టాలలో, అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయో, చర్యలు ఏమిటో వార్తలను హడావుడిగా చూడటంగాక జాగ్రత్తగా చదివేవారందరికి అర్థమవుతూనే ఉన్నది. ప్రజలు ఒకవైపు భయపడుతున్నది నిజమే అయినా, వాస్తవాలు, ప్రభుత్వ చర్యలు ఏమిటో మరొకవైపు గ్రహిస్తున్నందున రాజకీయవాదులది, మేధావులు అనబడేవారిది, మాజీ లేదా ప్రస్తుత ఉద్యమకారులది, వృత్తిప్రమాణాలు లేని మీడియాది, అరాచక సోషల్‌మీడియాది నెగెటివిజం లేదా సినిసిజం అని కూడా తెలిసిపోతున్నది. సెక్రటేరియట్‌ విషయంలోనైతే ఈ ధోరణి హాస్యాస్పద, ప్రహసనపూరిత స్థాయికి చేరింది. తమ అవివేకమేమిటో వారికి జూన్‌ 29నాటి హైకోర్టు తీర్పుతోనే బోధపడవలసింది. అయినా మరొక రెండువారాలపాటు అదే స్వభావాన్ని ప్రదర్శించుకుని జూలై 17న సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ తమ వాదనలను నిష్కర్షగా తోసిపుచ్చేవరకు తెచ్చుకున్నారు. దానితో వారికి ఇంకా మిగిలిన పరువు ఏమైనా ఉందా?

వారి వాదనలు ఎంత సినికల్‌గా ఉన్నాయో ముఖ్యంగా అప్పీల్‌ దశలో స్పష్టంగా కనిపించింది. సెక్రటేరియట్‌ భవనాలు బాగానే ఉన్నాయని, కూల్చనక్కరలేదని, ఇప్పుడు ఆ ఖర్చెందుకని ఒరిజినల్‌ పిటిషన్‌లో వాదించినపుడు, ప్రభుత్వం చెప్తున్న కారణాలు సరైనవేనని భావించినవారు కొందరుండగా, విమర్శలకు కొంత విలువున్నదనుకున్నవారు కూడా ఎందరో కొందరున్నారు. హైకోర్టు దీర్ఘకాలంపాటు ఉభయపక్షాల వాదనలు విని ప్రభుత్వ వాదనను తన వివరమైన తీర్పులో సమర్థించిన తర్వాత, సందేహమనస్కుల సంఖ్య తగ్గిపోయింది. తీర్పు వచ్చిన వెంటనే సహజంగా కూల్చివేతలు మొదలయ్యాయి. ఆ వెనుక కొద్దిరోజులకు కూల్చివేతల మధ్యలో తయారైన అప్పీలు వాదనలను గమనించి చూడండి. కూలగొట్టేందుకు పర్యావరణ అనుమతి, కూల్చటం- చదునుచేయటం- నిర్మించటం, కూల్చివేతలో పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ, కూల్చివేతలో కరోనా స్థితి వంటివన్నీ తమ మేధాశక్తికి తోచినట్లుగా కాగితంపై రాశారు. ఇటువంటివేవీ అసలు చట్టాలలో లేవని కోర్టులు ప్రకటించటానికి ముందు వారికి నిజంగానే తెలియని విషయమా? అనుకోలేము. చివరకు గుప్తనిధులని కూడా అన్నారు. నెగెటివిజం, సినిసిజం వారి కళ్లను కప్పివేశాయి. కడలి తరగలను ఆపజూసే కాన్యూట్లు కావటం మినహా వీరంతా సాధిస్తున్నది ఏమైనా ఉందా? ఎందుకోసమీ పతనాలు?

రాజకీయవాదులు అధికార తపనతో సినిక్స్‌ కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. మేధావులు, రకరకాల మాజీ ఉద్యమకారులు, ప్రస్తుత ఉద్యమకారులు పాజిటివ్‌ దృష్టితో ఎంత తీవ్ర విమర్శలు చేసినా దానిని కూడా అర్థం చేసుకోవచ్చు. కాని ఈ రెండవ వర్గీకరణలోకి వచ్చేవారు నెగెటివ్‌గా మారటాన్ని అర్థం చేసుకోలేం. వారు సినిక్స్‌గా మారటం అంతకన్న ఆమోదించలేని విషయం. ఇందులో కనిపించేది మౌలికంగా వారి నిరాశానిస్పృహలు. ఏదో చేయాలని, జరగాలని కోరుకుని ఆ లక్ష్యాలను సాధించటంలో విఫలమైనందువల్ల కలిగిన నిరాశ. అందుకోసం కొత్తగా ఏమిచేయాలో తెలియని నిరాశ. తమతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం జరుగుతున్న మేలు అనే వాస్తవాలను గుర్తించేందుకు నిరాకరించటంవల్ల కలిగే నిస్పృహ. దీనినుంచి వారికి ‘మోక్షసాధన’ అవసరం.

- టంకశాల అశోక్‌


logo