సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 19, 2020 , 00:05:47

రంభను మించిన అందం

రంభను మించిన అందం

ఎఱకసానమ్మ ఒక సామంతుని భార్య. ఆమె చేసిన దానాలు, ప్రభువులైన కాకతీయ రాజన్యుల కీర్తిని కూడా ఇనుమడింపచేశాయి. ఇందులో ఆమె దానగుణంతో పాటు ఇతర సద్గుణాల వల్ల ప్రజలందరి అభిమానాన్ని పొందినట్లు తెలుస్తుంది. భర్త బేతిరెడ్డి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినా... ఆ కాలంలో ఆర్థికంగా స్త్రీ స్వతంత్రురాలనే విషయం ఈ శాసనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

తనయుఁడు చెఱువును గావ్యం,

బు నిధానము గుడి వనంబు భూదేవస్థా

పనమును నను నియ్యేడును,

జను శాములందు సప్త సంతతులనఁగన్‌

అంటూ కాకునూరి అప్పకవి “అప్పకవీయంలో”... తనయుడు, చెరువు, కావ్యం, గుడి, వనం, భూమి, దేవస్థాపనం సప్తసంతానాలుగా పేర్కొంటాడు. ఎలాంటి పాపం చేసినా సప్త సంతానాల్లో ఒక్కటి నిర్వహిస్తే 101 తరాలు నరకం నుంచి తప్పించి ముక్తిని పొందుతారని చెబుతాడు. ఆ సప్త సంతానాలలో చెరువు, గుడి, భూ దేవస్థాపనము చేసి శాశ్వత కీర్తిని ఆపాదించిన స్త్రీమూర్తి ఎఱకసాని. ఈమె రేచర్లరెడ్డి వంశీయుడైన బేతిరెడ్డి పెండ్లము. రేచర్ల రెడ్లు కాకతీయుల దండనాయకులుగా, సేనాధిపతులుగా, సామంతులుగా కీర్తి గడించారు.

ఈ శాసనం నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలోని ఎఱకేశ్వరాలయం ముందు ఎత్తైన అరుగులపై మూడు పక్కల పూర్తిగా, నాల్గవ పక్క 4 పంక్తులతో ఉంది. శాసన కాలం క్రీ.శ.1208. పిల్లలమఱ్ఱి గ్రామంలో ఎఱకసాని తనపేరుమీద ఎఱకేశ్వర దేవుడిని ప్రతిష్ఠ చేసి, గుడి గోపురానికి, బావికి, పరివారానికి, మఠానికి, సమస్త పూజలకు భూమిని దానమిస్తూ శాసనం వేయించింది. ఇందు కోసం పలు ప్రదేశాలలో మర్తుర్లను (భూమికి ఓ కొలమానం) ఆచంద్ర తారార్కంగా ఇచ్చింది. అదేరోజు త్రిపురాదేవి సమస్త పూజల నిమిత్తం ఎఱకపురంలో కొంత వెలిపొలము (పంటకు అనువైన నేల), కొంత నీరునేల (నీరు సమృద్ధిగా ఉన్న నేల) దానం చేసింది. తన తండ్రిపేర ప్రతిష్ఠ చేసిన కోమరేశ్వర దేవునికి, తల్లి పేర ప్రతిష్ఠించిన ఎఱకేశ్వర దేవునికి, గుడులకు... పలు భూములను దానం చేసింది. తన తమ్ముడు నూంకనాయకునిచే మ్రోతుకూరులో నిర్మించిన బొమ్మకంటి కాలువ, న్రూంక కాలువ కింద మర్తర్లను దానమిచ్చింది. క్రీ.శ. 1215 యువ సంవత్సర మాఘ బహుళ  పంచదశి(అమావాస్య) శుక్రవారంనాడు సూర్యగ్రహణం సందర్భంగా  ఎఱకేశ్వర దేవుని సమస్త పూజలకు మరికొంత పొలాన్ని దానం ఇచ్చింది. ఇవటూరి సోమయ అనే పండితుడు బేతిరెడ్డి, ఎఱకసాని పేర్లు మీదుగా ప్రతిష్ఠించిన శ్రీ బేతేశ్వర, శ్రీ ఎఱకేశ్వర దేవుళ్ళకూ భూమిని దానమిచ్చింది.

50 శ్లోకాలతో కూడిన ఈ 136 పంక్తుల సంస్కృత శాసనాన్ని చిన్న సంస్కృతకావ్యంగా భావించవచ్చు. ఇందులో రేచర్ల రెడ్డి వంశ క్రమం, ఎఱకసానమ్మ పుట్టింటి వంశక్రమం పేర్కొన్నారు. శాసనంలో ఎఱకసానమ్మను ఇలా వర్ణించారు... ఎఱకసానమ్మ చరిత్ర సర్వ లోకాల్లోకెల్లా పవిత్రమైంది. రూపంలో ఆమె తేజస్సును చూసి రంభ కూడా ఈర్శ్య పడుతుందట. పతివ్రతా ధర్మంలో అరుంధతి కూడా ఎఱకసానమ్మతో పోల్చు కోలేకుండా ఉందట. పరిపూర్ణ చిత్తంతో తన పదభక్తితో శివుని భార్య గౌరీదేవి మనస్సును చూరగొన్నదిగా, కల్పవల్లితో సమానమైందిగా, వేదాలలో చెప్పిన సకల సంపదల సమృద్ధి కలదిగా కీర్తించారు. ఆమె ఆరామాలు, ఉపనయనాది కార్యాలు, సాగరాలు (పెద్ద చెరువులు), తటాకాలు, పెద్ద పెద్ద గుట్టలతో సమానమైన అనేక సురభవనాల వంటి భవనాలను నిర్మించింది. సూర్యుని వెలుగులతో ఎప్పుడూ బంగారం లాంటి ధాన్యాలు పండే పొలాలను, సమృద్ధిగా పాలిచ్చే ధేనువులను, భూమిని... వివిధ రంగాల్లో విబుధులైన ప్రసిద్ధులకు దానం చేసింది. పండితులను ఆదరించి వారికి భోజనం పెట్టేది. ఆమె అనేక భాషల్లో కుశలత్వం కలిగినట్టుగా వర్ణించారు. ఇంకా విద్యాభ్యాసం కోసం ఒక సత్రాన్ని నిర్మించింది. ఆ సత్రం 15 మందికి సరిపోయేవిధంగా ఉంది. ఆ సత్రానికి, వండివార్చేవారికి, విద్యార్థుల భోజనాదులు, వస్ర్తాలకు, చలివేంద్రంలో నీరు పోసేవారికి... అన్ని సదుపాయాలకూ కొంత భూమిని దానమిచ్చింది. 

శాసనంలో సప్తసంతానాలకు సంబంధించిన అంశం, పండితులకు లభించే ఆదరణ, ఎటువంటి పంటలు, బియ్యం పండించేవారో తెలుస్తున్నది. ఎఱకసానమ్మ వంటి స్త్రీమూర్తులెందరో ఇంకా పరిశోధనలు జరిగితే శాసనాలలో మనకు కనిపిస్తారు.

- డా. భిన్నూరి మనోహరి,

9347971177logo