గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 19, 2020 , 00:05:45

మనసైన కవి... దాశరథి

మనసైన కవి... దాశరథి

అది నిజాంకు వ్యతిరేకంగా పోరు జరుగుతున్న కాలం. తన విప్లవ కవితలతో రుద్రవీణలు మీటుతూ, నాటి యువతను చైతన్యవంతం చేస్తున్నారు దాశరథి. స్వయంగా నిజాంకు వ్యతిరేక పోరాటంలో పాల్గొని, నిజామాబాద్‌ జైలుకి వెళ్లారు. అక్కడా ఊరుకోలేదు. బొగ్గుతో జైలు గోడలమీద విప్లవ గీతాలు రాసి దెబ్బలు తిన్నారు. నిజాం పాలన నుంచి హైద్రాబాద్‌ సంస్థానం విముక్తి పొందేవరకు జైలు జీవితాన్ని అనుభవించారు. గుండెలను రగిలించిన ఈ విప్లవకవి, తర్వాత కాలంలో మనసును సేదతీర్చే సినీగీత రచయితగా మారడం ఓ వైచిత్రి. జులై 22 దాశరథి జయంతి...దాశరథి ఓ బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితమే. ఆయన రాసిన అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ కావ్య ఖండికలు ప్రసిద్ధం. తిమిరంతో సమరం కావ్య సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని పొందారు. కవితా పుష్పకం రచనకు నాటి అంధ్రప్రదేశ్‌ సాహిత్య  అకాడమి అవార్డ్‌ను అందుకున్నారు. 

తెలంగాణ సాహిత్యంలో నవయుగ వైతాళికుడుగా ముద్ర వేసుకొన్న దాశరథిలోని మరో పార్శం గీత రచయిత. సినిమా చిట్టడవిలో చిక్కుకున్న మహాకవి అని కొందరు వాపోయినా, ఆ చిట్టడవిలో ఎన్నో సుమధుర గీతాలతో వసంతాన్ని పూయించారు. దాశరథి సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందే... ఎందరో లబ్ద ప్రతిష్టులైన రచయితలు ఉన్నారు. వీరి మధ్య తనదైన ప్రత్యేకత నిలుపుకోవడమే కాదు... ఒక వెలుగు వెలిగారు.

1961లో ఇద్దరు మిత్రులు చిత్రంతో గేయ రచయితగా ప్రవేశించారు. ఆ చిత్రంలో ‘ఖుషి ....ఖుషీగా... నవ్వుతూ’  ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఖుషి ...ఖుషీ.. అనే ఉర్దూ పదాల పొందికతో సాగిన పాట ఒక కొత్త ఒరవడితో సాగింది. సన్నివేశం ఏదైనా దాన్ని రక్తి కట్టించడమే పాట పరమోద్దేశంగా భావించేవారు. ప్రణయోద్వేగాలని, అవ్యక్త భావనలని తనదైన శైలిలో వ్యావహారిక భాషలో గీత రచనలు చేశారు. ‘గోదారి గట్టుంది ... గట్టుమీద చెట్టుంది .. చెట్టుమీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది?’ (మూగమనసులు) అంటూ అపూర్వ బాణిలో సాగిన పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క పాట కోసం ఎందరో సినిమాను మళ్లీ మళ్లీ చూసిన ఘనత దక్కించుకున్నారు. కన్నె వయసు చిత్రంలోని ‘ఏ దివిలో విసిరిన పారిజాతమో’ అనే ప్రేమగీతం కుర్రకారును ఇప్పటికీ ఉహాలోకాల్లో విహరించేలా చేస్తుంది.

వినిపించని రాగాలే (చదువుకున్న అమ్మాయిలు), ఎన్నెన్నో జన్మల బంధం(పూజ) , నన్ను వదిలి నీవు పోలేవులే (మంచిమనుషులు) లాంటి పాటలు ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి.  ‘నా కంటి పాపలో నిలచిపోరా’ అంటూ ‘వాగ్దానం’లో రాసి మనసు కవి ఆత్రేయకు దీటుగా నిలిచారు. అలాగే ‘మంచి మనిషి’ చిత్రంలో ‘ఓహో గులాబి బాల’ పాట పి.బి. శ్రీనివాస్‌కి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. మాతృదేవత చిత్రం కోసం వీరి కలం నుంచి జాలువారిన గీతం ‘మనసే కోవెలగా..’ వీనుల విందుగా సాగింది.

యవ్వనంలో తీవ్రవాద భావజాలంతో నైజంను ఎదిరించిన దాశరథి, సినిమా కవిగా మాత్రం సన్నివేశాన్ని రక్తికట్టించడమే లక్ష్యంగా నిర్మాత, దర్శకులు కోరిన రీతిలో భక్తి పాటలు కూడా అందించారు. ‘రారా కృష్ణయ్యా ....రారా కృష్ణయ్యా’ (రాము), ‘నడిరేయి ఏ జాములో’ (రంగులరాట్నం) లాంటి భక్తి గీతాలెన్నో తెలుగు ప్రేక్షకులకు అందించారు.

వారి పాటలను ఉదహరించడం మొదలుపెడితే, వందల చరణాలు స్ఫురిస్తాయి. దాశరథికి గజళ్ల మీద కూడా పట్టు ఉంది. మీర్జా గాలీబ్‌, ఉర్దూ గజళ్ళను గాలీబ్‌ గీతాల పేరుతో తెలుగులోకి అనువదించిన ప్రతిభ తనది. భాషలోని లలిత పదాలని భావజాలానికి తగినట్టుగా ఎన్నుకోవడమే గజల్‌ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకో అక్షరాన్నీ పదును పెట్టిన విరి బాణంలా వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. ‘మా ఇంటి దేవత’ సినిమా కోసం రాసిన ‘విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి’ అనే పాటలో అడుగడుగునా మీర్జా గాలిబ్‌ మెదలుతాడు. అందులో ‘ఈ మధువంతా నీకోసం, పెదవుల మధువే నాకోసం’ అంటూ మధువును మగువను ఏక దృష్టితో సంబోధిస్తూ రాయడం దాశరథికే సాధ్యపడింది.

- రావుల పుల్లాచారి

9949208476


logo