మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 18, 2020 , 00:47:30

ఎదిగే తీగకు ఊతమివ్వకుంటే ఎలా?

ఎదిగే తీగకు ఊతమివ్వకుంటే ఎలా?

నటన మీద ప్రేమతో ఉన్నత విద్యను వదిలేసి... ముందు బుల్లితెర మీద, తర్వాత సినీ సీమలో ఎదిగిన ఒక మధ్యతరగతి బీహార్‌ యువకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ 34 ఏండ్ల వయస్సులో ప్రాణం తీసుకోవడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌ను గుప్పెట్లో ఉంచుకున్న కొందరు ప్రముఖుల వల్ల అవకాశాలు కోల్పోయి సుశాంత్‌ ఉక్కిరిబిక్కిరై ఊపిరితీసుకున్నాడని; బంధుప్రీతి, భజనపరుల పక్షపాతం తప్ప టాలెంట్‌కు సినీ పరిశ్రమలో విలువే లేదని పలువురు వాపోతున్నారు. ఒక్క సినీ పరిశ్రమే కాదు, ప్రతిభను తొక్కేయడం, ఖూనీ చేయడం అన్నిరంగాల్లో అప్రతిహతంగా సాగుతూ కనిపించని విషాదానికి కారణమవుతున్నది.

అత్యంత ప్రతిభావంతుడైన ఒక శిల్పి ఉండేవాడు. జీవం ఉట్టిపడేలా రాళ్లను మలచడంలో దిట్ట. ఉలితో రాళ్లకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఈ శిల్పికి చావంటే భయం. మృత్యుంజయుడై శాశ్వతంగా భూమ్మీద ఉండిపోవాలన్నది శిల్పి సంకల్పం. అందుకోసం అచ్చుగుద్దినట్లు తనలానే ఉండే కొన్ని శిల్పాలను చెక్కి ఇంట్లో ఉంచుకున్నాడు. ఆ శిల్పాల మధ్య తానుంటే.. యముడు వచ్చినా తనను కనుక్కోలేడని, ఆ విధంగా చావును తప్పించుకోవచ్చన్నది శిల్పి ప్లాన్‌.

అంత్యకాలం దాపురించింది. యముడు రానే వచ్చాడు. శిల్పిని పిలిచాడు. తనలా ఉండే శిల్పాల మధ్య ఉన్న మనవాడు ఉలకలేదు, పలకలేదు. యముడు తికమకపడి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ వచ్చాడు. శిల్పిని పిలిచాడు. శిల్పి అదే పథకంతో యముడిని బురిడీ కొట్టించాడు. ఒట్టి చేతులతో యముడు వెనుదిరిగాడు. ఈ సమస్య పరిష్కారానికి యముడు ఒక ఎత్తు వేశాడు. మూడోరోజు శిల్పి ఇంటికి వచ్చిన యముడు.. ఈసారి ఆయన్ను పిలవలేదు. వస్తూనే.. వహ్వా.. ఎవరీ ప్రతిభావంతుడైన శిల్పి? ఏమా ప్రతిభ! ఆశ్చ్యర్యం, అద్భుతం. ఒకేరకమైన శిల్పాలను ఒకేలా చెక్కిన ఈ శిల్పి ప్రతిభాచతురత అనన్యసామాన్యం.. అని అన్నాడు. తన ప్రతిభను పొగిడేసరికి శిల్పి తబ్బిబ్బై.. చావు తప్పించుకోడానికి వేసిన పథకాన్ని పూర్తిగా మరిచిపోయి... ‘థాంక్స్‌ సార్‌.. ఇవి చెక్కిన శిల్పిని నేనే..’ అని చెప్పి యముడికి దొరికిపోతాడు.

జీవితంలో ప్రశంస చేసే మేలును తెలియజేయడానికి చెప్పే ఈ కథలో మరొక మంచి సందేశం దాగి ఉంది. ప్రతిభావంతుడికి ఇతరులు ఇచ్చే మెచ్చుకోలు కిక్కును, దాని మహత్యాన్ని ఇది స్పష్టంచేస్తున్నది. ప్రతిభ అనే తీగ పైపైకి పాకి పుష్పించి వికసించడానికి ప్రోత్సాహం అనే పందిరి కావాలి. ఆ ఆసరా దొరక్కపోతే కొద్దిదూరం పాకి ఎదగలేక ప్రతిభ ఎండిపోతుంది. ప్రతి మనిషిలో, ఆ మాటకొస్తే ప్రతి జీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అది గుర్తించి ప్రతిభావంతుడి భుజంతట్టి ప్రోత్సహిస్తే ఆ ప్రతిభ ద్విగుణీకృతమై అద్భుతం సృష్టిస్తుంది. అట్లాకాకుండా, కులం, ప్రాంతం, రంగు, హోదా లాంటి పిచ్చిపిచ్చి కొలబద్దలను పెట్టుకుని ఆ ప్రతిభను పథకం ప్రకారం అడ్డుకుని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తే.. సుశాంత్‌ రాజ్‌పుత్‌ మాదిరిగానో, ఉదయ్‌కిరణ్‌లాగానో ఊపిరి తీసుకుంటుంది. కళపై పిచ్చి మమకారంతో స్వయంకృషితో ఎదగాలనుకునే ఇలాంటివాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించకపోయినా తట్టుకుంటారేమోగానీ.. ఎదుగుదలను అడ్డుకుంటే నిస్సహాయులై అర్ధంతరంగా వైదొలుగుతారు.

డబ్బు, గ్లామర్‌ సమాగమమైన సినిమా రంగంలో ఈ టాలెంట్‌ హననం ఎక్కువ ఉండటానికి కారణం.. పరిశ్రమ కొన్ని కుటుంబాల కబంధహస్తాల్లో బందీ అయిపోవడమే. బొమ్మ తీయాలన్నా, హాల్లో ఆడాలన్నా.. ఈ కుటుంబీకుల అండదండలు, ఆశీస్సులు ఉండాలి.  ఇలాంటి వాతావరణంలో.. కిందిస్థాయి నుంచి అడుగడుగునా కష్టపడి పైకొచ్చే ప్రతిభావంతులు ఇతరేతర శక్తులు అడ్డుపడుతుంటే ఒక దశలో ఆగిపోక తప్పని పరిస్థితి! బుల్లితెర మీద పాడుతా తీయగా, జబర్దస్త్‌ వంటి ప్రతిభాన్వేషక కార్యక్రమాలు ఉండబట్టి సరిపోయింది గానీ లేకపోతే మట్టిలో మాణిక్యాలు శాశ్వతంగా సమాధి అయివుండేవి. ఏ గాడ్‌ఫాదర్‌ లేని గెటప్‌ శీను లాంటి అత్యంత ప్రతిభావంతుడైన నటుడు ఎన్నేళ్ళని ప్రతిభను నిరూపించుకుంటూ పోవాలి?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేని విధంగానే టాలెంట్‌ను అడ్డుకోవడం కష్టం. అయితే.. అర్హులైన ప్రతిభావంతులకు దక్కాల్సిన అవకాశాలు, పదవులు దక్కకుండా చేయడం, రావలసిన అవార్డులు రాకుండా చేయడం, కావలసిన సెలెక్షన్‌ కాకుండా చేయడం ద్వారా దెబ్బతీస్తూ కొన్ని ప్రతీపశక్తులు నిరంతరాయంగా కృషిచేస్తుంటే ఈ ప్రతిభావంతులు ఎంతని తట్టుకోగలరు?

సినిమా రంగంలో అర్హులైన ఆర్టిస్టులు తెరవెనుక విలన్ల కారణంగా పైకి రాలేకపోతుంటే.. ఇక ర్యాట్‌ రేస్‌లో ఆనందం జుర్రుకునే తల్లిదండ్రుల పుణ్యాన పిల్లల్లో ప్రతిభ, సృజన సమాధి అవుతున్నాయి. పిల్లల్లో ఏ రంగంలో టాలెంట్‌ నిబిడీకృతమైందో పట్టించుకోకుండా గొర్రెల మందలాగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోచింగ్‌లలో పడేసి పేరెంట్స్‌ చేస్తున్న దారుణం ఇంకా క్రూరమైంది. అందువల్లనే, ఇష్టంలేని 24/7 చదువుతో ఊపిరాడక ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అద్భుతమైన ఈ జీవితం పరమావధి.. బాగా డబ్బు కూడబెట్టడం, సంపద సృష్టించడం మాత్రమేనన్న దుష్ట సంకల్పం వల్ల ఈ దురవస్థ! బహుముఖ ప్రజ్ఞాశాలురైన పిల్లలను వారికిష్టమైన రంగాల్లో చిన్నప్పటినుంచే ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. క్రికెట్‌ మొనగాడు సచిన్‌ టెండూల్కర్‌ కుటుంబం కూడా మనోళ్లలాగా ఆలోచించి ఎంసెట్‌ కోచింగ్‌లో పడేసి ఉంటే?

సినిమా రంగంలో అర్హులైన ఆర్టిస్టులు తెరవెనుక విలన్ల కారణంగా పైకి రాలేకపోతుంటే..ఇక ర్యాట్‌ రేస్‌లో ఆనందం జుర్రుకునే తల్లిదండ్రుల పుణ్యాన పిల్లల్లో ప్రతిభ, సృజన సమాధిఅవుతున్నాయి. పిల్లల్లో ఏ రంగంలో టాలెంట్‌ నిబిడీకృతమైందో పట్టించుకోకుండా గొర్రెల మందలాగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోచింగ్‌లలో పడేసి పేరెంట్స్‌ చేస్తున్న దారుణం ఇంకా క్రూరమైంది.

టాలెంట్‌కు మన దగ్గర తగిన గుర్తింపు, ప్రోత్సాహం, ఆదరణ, సరైన పారితోషికం లేకపోవడం వల్లనే కదా మేధో వలసలు! విదేశీయుల, ముఖ్యంగా తెలుగు నిపుణుల టాలెంట్‌ నుంచి డాలర్ల పంట పండించుకుంటున్న అమెరికాను చూసి నేర్చుకోవాలి. ట్రంప్‌ కొత్త వీసా విధానం ఎలా ఉన్నా మన టాలెంట్‌ లేకపోతే అగ్రరాజ్యం పప్పులుడకవు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేముందు ఒబామా సంతకం చేసిన చివరి పత్రం.. ‘టాలెంట్‌ యాక్ట్‌-2017’. అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పనిచేయడానికి అత్యంత ప్రతిభావంతులైనవారిని ప్రభుత్వంతో కలిసి దాదాపు ఒక ఏడాది పనిచేయడానికి ఈ చట్టం ఉద్దేశించింది. ప్రతిభను పట్టుకుని సానపెట్టి దేశ సేవకు, సమాజ హితానికి వాడుకునే ఇలాంటి చర్యలు ఎంతో అవసరం.

ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వ్యక్తులు పూనుకుని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం అరుదుగా కనిపిస్తుంది. దారిద్య్రంలో మగ్గుతున్న గ్రామీణ విదార్థులను ఏరికోరి తన ఇంట్లో పెట్టుకుని సొంత ఖర్చుతో శిక్షణ ఇచ్చి ఐఐటీల్లో సీట్లు కొట్టిస్తున్న ‘సూపర్‌-30’ ఆనంద్‌కుమార్‌ సృష్టిస్తున్న అద్భుతాన్ని చూడండి. ప్రతిభకు ఆర్థిక లేమి అడ్డు కాకూడదన్న సదాలోచనతో ఆనందంగా ఆనంద్‌ చేస్తున్నది నిజమైన దేశ సేవ. సుశాంత్‌ పుట్టిన పాట్నాకే చెందిన ఆనంద్‌ 2002 నుంచీ ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ ఈ గొప్పపని చేస్తున్నారు.

ప్రతిభను అణగదొక్కడం ఒకరకమైన దేశద్రోహమే. మాతృభూమి మీద మమకారం ఉన్నవారు టాలెంట్‌కు బాసటగా నిలవాలి, ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే ఇది తప్పని కనీసం గళమైనా వినిపించాలి. ప్రతిభను గుర్తించడం, ప్రతిభను ప్రోత్సహించడం, ప్రతిభకు పట్టంకట్టడం.. ఒక సంస్కృతిగా మార్చుకుంటే తప్ప మన సమాజం వేగంగా ముందుకుపోలేదు.  
logo