గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 18, 2020 , 00:47:30

విద్యావ్యవస్థకు శుభసూచకం

విద్యావ్యవస్థకు శుభసూచకం

విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించటం హర్షణీయం. విద్యావ్యవస్థకు ఇదొక శుభసూచకం.

గురుకుల పాఠశాలలతో పేదలలో విశ్వాసం పెరిగింది. రాష్ట్రం ఏర్పడగానే బడుగు బలహీనవర్గాల పిల్లలకు ఎవ్వరికీ తీసిపోని విధంగా విద్యా సౌకర్యాలను కల్పిస్తూ ముఖ్యమంత్రి గురుకులాలను ఏర్పాటుచేశారు. అంకితభావం గల అధికారులను నియమించి ప్రమాణాల పెంపునకు కృషి జరుగుతున్నది. 

రాష్ట్రంలో 40,597 పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 28 వేల ప్రభుత్వ, స్థానిక సంస్థల, గురుకుల, కేజీబీవీ మొదలైన బడులలో 28 లక్షల మంది విద్యార్థులున్నారు. దాదాపు పదివేల ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు (52 శాతం) చదువుతున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాభారాన్ని మోస్తున్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యను సంస్కరించడం అంటే పెనుసవాలే. మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల నిర్వహణ ఒక సమస్య అయితే, ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ నియంత్రణ మరో పెద్ద సవాలు.

కరోనా వైరస్‌ కారణంగా స్కూళ్లు మూసేసినా, ఆన్‌లైన్‌ తరగతులు బలవంతంగా రుద్దుతున్నారనీ, స్మార్ట్‌ ఫోన్లు తమవద్దనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడికి గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రైవేటు పాఠశాలల నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటుచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల సమస్య మరో విధంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రభుత్వ బడులు ఉంటే, ఇవి ఎనిమిది రకాల ప్రభుత్వశాఖల కింద నడుస్తున్నాయి. నిజానికి అన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ల నుంచి, కొంతమేర కేంద్ర సహాయంతో నడుస్తున్నాయి. వనరులు రాష్ట్రమే సమకూరుస్తున్నప్పుడు వాటికి ఇచ్చే స్వయంప్రతిపత్తిని ఇస్తూనే పర్యవేక్షణ అందించడానికి విద్యాశాఖ గొడుగు కిందికి ఈ సంస్థలన్నింటిని తీసుకురావాలి. లేదా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలి.

రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల నమూనాలో అభివృద్ధి చేసినట్లయితే, పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పు చూడగలం. రాష్ట్రంలోని 4,641 ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక బడులు అనుసంధానంగా ఉన్న ఉన్నత పాఠశాలలను ముందుగా ఈ విధంగా మార్చాలి. పూర్వ ప్రాథమికతో పదకొండు, పన్నెండు తరగతులను అనుసంధానం చేయాలి. దీనివల్ల ఇంటర్‌ విద్యను పిల్లల దగ్గరకు తీసుకెళ్లినట్లవుతుంది.

ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో-ప్రస్తుతం పాఠశాల విద్యలో చదువుతున్న వివిధ తరగతులలో అధిక శాతం విద్యార్థులకు కనీస భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు లేవని, వారికి కనీస విద్యా సామర్థ్యాలు అందడంలేదని నివేదించారు. కానీ అభ్యసన ఫలితాలు సాధించాలంటే వాటికి తగిన సంస్కరణలు తీసుకురావాలంటే విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనాన్ని పెంచాలి.

కరోనా వైరస్‌ మూలంగా బడుల మూసివేతతో పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారని క్షేత్రస్థాయి నివేదికల ద్వారా తెలుస్తున్నది. కరోనా గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందే కానీ కనీసం బడికి ఉపాధ్యాయులు వచ్చిపోతే బాగుండునని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకొని పిల్లలకు ఇంకా నష్టం జరగకుండా చూడవలసిన అవసరం ఉన్నది.

కరోనా కాలంలో నూతన ఆలోచనలు చేయడానికి, పాత ఆలోచనలకు పదును పెట్టడానికి ఒక అవకాశం కలిసివచ్చిందని చెప్పాలి. ఎన్నో విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తున్న ఈ తరుణంలో కొఠారి కమిషన్‌ ప్రతిపాదించిన కామన్‌ స్కూల్‌ విధానం, నైబర్‌హుడ్‌ స్కూల్‌ విధానాన్ని పరిశీలించాల్సిన అవసరముంది. సీఎం కేసీఆర్‌ కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పిల్లలందరూ ఏ పరిసరాలలో నివసిస్తున్నారో అదే పరిసరాలలో ఒకటి లేదా రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న బడికి మాత్రమే పోవాలనే నియమాలు రావాలి.

ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన విధానాలను, విద్యా కార్యక్రమాలను నేర్చుకొని అక్కడి దేశాల్లో అమలుచేస్తున్నారు. తెలంగాణలో మెరుగైన విద్యావ్యవస్థ గురించి ఆలోచించే మేధావులు, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన పలు ప్రయోగాల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ఇలాంటి సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభు త్వం అందరినీ సంప్రదించడం అనే ఆలోచన మంచిది. ఉపాధ్యాయ సంఘాలు, తల్లుల సంఘాలు, తల్లిదండ్రుల కమిటీలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితం ఉం టుంది. అది త్వరగా కార్యరూపం దాల్చి సామాజిక తెలంగాణ వైపు పరుగులు తీయాలని తెలంగాణలోని ప్రతి ఒక్కరి ఆకాంక్ష.

(వ్యాసకర్త: ఎం.వి.ఫౌండేషన్‌ నేషనల్‌ కన్వీనర్‌)


logo