గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 18, 2020 , 00:47:28

బెదిరింపు రాజకీయాలు

బెదిరింపు రాజకీయాలు

  • నాలుగో అధ్యాయం కొనసాగింపు...

ఒక పక్క వీహెచ్‌పీ దాని మిత్ర సంస్థలు, మరో పక్క బాబ్రీ మసీదు పోరాట కమిటీ, పోటీ ఉద్యమాలే గాక అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన లక్నో బెంచి ముందున్న వివాదంలోని స్థలంలో మందిరాన్ని నిర్మిస్తామని వీహెచ్‌పీ బెదిరింపు కూడా పరిస్థితిని మరింత తీవ్రతరం గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నివారించే చర్యలు చేపట్టగా, వీహెచ్‌పీ దాని మిత్రసంస్థల వాదన ఏమంటే తొలి దావాలలో సివిల్‌ కోర్టులు ప్రతివాదులను విగ్రహాలను తొలగించటం నిరంతర పూజా నిర్వహణను దైవదర్శనాన్ని అడ్డుకోవటం వంటి వాటిని చేయరాదని స్పష్టం చేసింది. దానిపై ఫైజాబాద్‌ జిల్లా కోర్టు 1986లో వివరణ ఇచ్చిన సందర్భంలోనూ వివాదంలో ఉన్న కట్టడం దగ్గర్లో మందిర నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇక 1986 ఫిబ్రవరి 3 నాటి హైకోర్టు ఉత్తర్వుల విషయానికి వస్తే అది ముస్లిములు హైకోర్టులో జిల్లా జడ్జి ఉత్తర్వులపై దాఖలు చేయబడిన రిట్‌ దరఖాస్తు గనుక, అది ఆ రిట్‌ దరఖాస్తులోని ప్రతివాదులకే వర్తిస్తుంది కనుక, ఆ రిట్‌ దరఖాస్తులో వీహెచ్‌పీ గాని దాని మిత్రసంస్థలు గాని పార్టీలు కానందున ఆ ఆస్తి స్వభావంలో మార్పు తేరాదన్న తీర్పుకు వారు బద్ధులు కాబోరు.

ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (కాంగ్రెస్‌ పాలనలోని) 1989 ఆగస్ట్‌లో సీపీసీ సెక్షను 94, క్లాజు 39 రూలు 1, 2 కింద ఇంజంక్షను ఉత్తర్వులను కోరుతూ హైకోర్టులో దరఖాస్తు పెట్టుకుంది. దానిలో అది కోరినదేమంటే-(1) వాదుల్నీ, ప్రతివాదుల్ని అంతకుముందు ఉన్న స్థితిని మార్చరాదనీ, హిందూ ముస్లింల మధ్య ఘర్షణ ఏర్పడే ఏ చర్యకూ పాల్పడరాదనీ, (2) కోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించక తప్పకపాటించి తీరాలనీ. ఈ దరఖాస్తుపై 1989 ఆగస్టు 14న హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులలో కోర్టు 1986 ఫిబ్రవరి 3న జారీచేసిన ఉత్తర్వుల్ని (రిట్‌ పిటీషన్‌ నెం.746/1986) ఉటంకిస్తూ ఈ కింది ఆదేశాలిచ్చింది.

‘ఏది ఏమయినా రిట్‌ దరఖాస్తు (డబ్ల్యూపీ నెం.746/86)లో 3-2-1986 నాటి ఉత్తర్వులతో కొందరే ప్రస్తుతపు వ్యాజ్యంలోని వారు పార్టీలుగా ఉన్నందున న్యాయాన్ని నిలబెట్టే ఉద్దేశంతో ప్రస్తుతం దావాలలో ఇంజక్షను కోసం దరఖాస్తు చేసుకున్న పార్టీలన్నీ మళ్లీ భిన్నంగా తీర్పులు వెలువడేవరకు సూట్‌ నెం.1/1986 (రెగ్యులర్‌ సూట్‌ నెం.2/1950); 2/1989 (రెగ్యులర్‌ సూట్‌ నెం.25/1950); 3/1989 (రెగ్యులర్‌ సూట్‌ నెం.26/ 1959); 4/1989 (రెగ్యులర్‌ సూట్‌ నెం.12/1961); 5/1989 (రెగ్యులర్‌ సూట్‌ నెం.236/1989) యథాస్థితిని కొనసాగిస్తూ వివాదంలో ఉన్న ఆస్తి స్వభావాన్ని మార్చరాదు.’

తరువాత నాకు అర్థమైన మేరకు 1989 ఆగస్టు 14 నాటి కోర్టు ఉత్తర్వుల వల్ల నిరుత్సాహపడక వీహెచ్‌పీ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వివాదంలో ఉన్న కట్టడానికి దగ్గర్లో 586వ ప్లాటుకు దరిదాపుగా సరిపోయే స్థలంలో మందిరం నిర్మిస్తామనే అభిప్రాయాన్ని ప్రకటించటం జరిగింది. ఈ విషయంలో బీజేపీ, వీహెచ్‌పీ వాదన ఏమంటే... వ్యాజ్యంలోని ఆస్తి ఏదీ, ఎంత అనేది తేల్చిచెప్పలేదు గనుక అది వివాద కట్టడపు లోపలి, వెలుపలి ప్రహరీల వరకు గల భూ భాగానికే వర్తిస్తుందిగాని బయటి ప్రహరీ గోడకు ఆవలి భూభాగానికి వర్తించదని. 

(‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి..)logo