సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 16, 2020 , 23:48:14

దాచేస్తే దాగని చరిత

దాచేస్తే దాగని చరిత

తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ చేయలేదనే అపప్రథ మాజీ ప్రధాని పీవీపై జీవితాంతం ఉండేది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో పీవీ హన్మకొండ ఎంపీగా ఓడిపోవడానికి అదే ప్రధాన కారణమని ప్రచారమైంది. కానీ అసలు కారణం వేరే. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అమలుచేసిన భూ సంస్కరణలు, తెచ్చిన పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం వల్ల నష్టపోయామని భూస్వాములు కసితో రగిలిపోయారు. పీవీ ఆధ్వర్యంలో జరిగిన 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యవర్గాలను పక్కనపెట్టి ఇతర వర్గాలకు దాదాపు 70 శాతం సీట్లు కేటాయించారు. దీంతో రాజకీయంగా నష్టపోయామని ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గమంతా పీవీపై కోపం పెంచుకుంది. అంతా ఒక్కటై పీవీని హన్మకొండలో ఓడించారు.

తెలంగాణలో పుట్టినా స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలేదని, సర్పంచ్‌ నుంచి ప్రధాని దాకా ఎదిగినా ప్రజల కోసం చేసిందేమీ లేదన్నట్లుగా పీవీపై ప్రచారం జరిగింది. కానీ అది శుద్ధ తప్పు. తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడి, నిలబడి, చివరికి తన ముఖ్యమంత్రి పదవినే వదులుకోవాల్సి వచ్చినా తడపడని అసలు సిసలు తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. 

తెలంగాణలోని స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కేవిధంగా 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (1911లో) తీసుకొచ్చిన ముల్కీ నిబంధనలను వలస పాలకులు వివాదం చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టులో కేసులు వేయించి, ప్రభుత్వం తరపున బలహీన వాదన వినిపించారు. ఫలితంగా ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో మెజారిటీ జడ్జీలు ముల్కీ నిబంధనలు చెల్లవని 1972 ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. ఈ బెంచిలో ఉన్న జస్టిస్‌ మాధవరెడ్డి ముల్కీ నిబంధనలు సక్రమమేనని విడిగా తీర్పునిస్తూ నలుగురు జడ్జీలతో విభేదించారు. ఈ తీర్పుపై అప్పటి ముఖ్యమంత్రి పీవీ తీవ్రంగా కలత చెందారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీలు వేయించారు. 1972 అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రి ఆధ్వర్యంలో ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ అప్పీలును విచారించింది. ముల్కీ నిబంధనలు సక్రమమేనని తుది తీర్పు చెప్పింది. తన ప్రయత్నం ఫలించినందుకు పీవీ సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రజలకు న్యాయం దక్కిందని ప్రకటించారు. ఇలా మాట్లాడటం ఆంధ్ర నాయకులకు రుచించలేదు. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందలేనప్పుడు ఇక సమైక్యాంధ్రప్రదేశ్‌ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమం లేవదీశారు. పీవీ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. పీవీ ప్రభుత్వాన్ని రద్దు చేయించారు. రాష్ట్రపతి పాలన విధించేలా ఇందిరాగాంధీని ఒప్పించారు. ఇంత జరిగినా తన పదవిని కాపాడుకోవడానికి పీవీ రాజీ పడలేదు. అదీ తెలంగాణ విషయంలో పీవీ నిబద్ధత. తెలంగాణ చరిత్రనంతా అధ్యయనం చేసిన వ్యక్తి కాబట్టే కేసీఆర్‌కు పీవీ తెలంగాణ కోసం పడిన రంధి యాదికుంది. అదే కారణంగా ఆయనపై ఎంతో గౌరవం ఉంది. అదే ఇప్పుడు పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రేరణ అయింది.

ముఖ్యమంత్రిగా గానీ, ప్రధానిగా గానీ పీవీ పెద్దగా సాధించిన విజయాలేమీ లేవనే ప్రచారం కూడా జరిగింది. అదీ తప్పే. ముఖ్యమంత్రిగా 15 నెలల 11 రోజులు మాత్రమే ఉన్నా, ఆ సమయంలోనే చేయాల్సినంత చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు కాపలాదారుగా నిలబడ్డారు. భూ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేశారు. ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్‌లో మొదటి రెసిడెన్షియల్‌ పాఠశాల నెలకొల్పి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు ప్రారంభించారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాడు. పంజాబ్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తయారైన అణ్వాయుధాలనే 1998లో వాజపేయి నాయకత్వంలో పరీక్షించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యా వేత్తగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పీవీ ఎన్నో సాధించారు. కావాలనే కొందరు వీటిని మనకు తెలియకుండా చేశారు. పీవీకి రావాల్సినంత పేరు రాకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. పీవీ తర్వాత ఏపీ రాజకీయమంతా సీమాంధ్ర నాయకుల చెప్పు చేతల్లో, కాంగ్రెస్‌ పార్టీలోని ఓ సామాజిక వర్గం అదుపాజ్ఞల్లో నడిచింది. అందుకే పీవీ గొప్పతనాన్ని ఉద్దేశపూర్వకంగా మసకబార్చారు. ఢిల్లీలోనూ అదే పరిస్థితి. పీవీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో మార్పులు వచ్చాయి. పీవీ గురించి మంచిగా మాట్లాడటంపై అప్రకటిత నిషేధం అమలయింది. కాబట్టి పీవీ గురించి గొప్పగా చెప్పే వారు కరువయ్యారు. చనిపోయాక కూడా ఆయనను నోరారా అభినందించే వారు కరువయ్యారు. 

పీవీ గొప్పతనం, సాధించిన ఘన విజయాలు ఇప్పటివరకు మబ్బులు పట్టిన సూర్యప్రభ గానే మిగిలిపోయాయి. కానీ, చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు. ఇప్పుడు సమయం వచ్చింది. తాను స్వప్నించిన తెలంగాణ వచ్చింది. తెలంగాణ యుగకర్తలు, తెలంగాణ మహోన్నతుల గొప్ప చరిత్ర ప్రజలకు తెలియజెప్పే సువర్ణావకాశం వచ్చింది. పీవీ అసలు చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే 2020 జూన్‌ 28 నుంచి ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ తలచారు. ఈ సందర్భంగా పీవీ గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. తెలంగాణ అవతరణ, కేసీఆర్‌ సారథ్యం మూలంగానే తెలంగాణ మహనీయుల చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నది. ఇది మనకు గర్వకారణం. 


logo