శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 16, 2020 , 23:48:14

రాజకీయాలకు తలొగ్గిన ధర్మం

రాజకీయాలకు తలొగ్గిన ధర్మం

  • నాలుగో అధ్యాయం కొనసాగింపు...

గతంలో ఎక్కడైతే మూడు రథాలు నిలిపివేయబడినాయో ఆ అయోధ్య నుంచే వీహెచ్‌పీ తిరిగి 1987 నవంబర్‌లో రథయాత్రను నిర్వహింపతలపెట్టింది. వీహెచ్‌పీ నాయకత్వం నిషేధాజ్ఞలను ఉల్లంఘించాలనే కృతనిశ్చయంతో ఉంది కాని సంత్‌ త్రయం-మహంత్‌ నృత్య గోపాల్‌దాస్‌, పరమహంస రామచంద్ర, నారాయణాచార్యలు-వాళ్లే అయోధ్యలో వీహెచ్‌పీ ఉద్యమానికి మూలస్థంభాలు-ప్రభుత్వంతో ఘర్షణకు దిగదల్చుకోలేదు. అందువల్ల అంతకుముందు అయోధ్యలో నిలిపివేసిన రథాలను పోలీసుల రక్షణతో వీహెచ్‌పీ ప్రధాన కేంద్రం లక్నోకు తరలించే ఏర్పాటు చేయవలసిందిగా వాళ్లు జిల్లా మెజిస్ట్రేట్‌ను కోరారు. దీనివల్ల వీహెచ్‌పీ పథకానికి పూర్వపు స్థితే. కానీ తర్వాత కొద్దినెలలకే 1989 ఫిబ్రవరి 1న కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌లో జరిగిన సాధు సమ్మేళనంలో నవంబర్‌ 10న మందిర నిర్మాణానికి పునాదిరాయి వేయబడుతుందని ప్రకటించారు. తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో శిలలను పూజించే కార్యక్రమం రూపొందించబడింది. ఒక ఆసక్తికరమైన అంశం- కుతంత్రంతో కూడినదయినా సరే-శిలాన్యాస్‌కు సంబంధించింది నా ఎన్నికల ప్రచారం సందర్భంగా నా దృష్టికి వచ్చింది. కొందరు హిందూ పండితులు, జ్యోతిష్కులు, నాగ్‌పూర్‌లోనూ, మరికొందరు గ్రామీణులు నన్ను అడుగసాగారు-ఏదయినా మంగళకరమైన హిందూ మతానికి సంబంధించిన వేడుక శిలాన్యాస్‌ వంటిది నవంబర్‌ 10న దక్షిణాయణం మధ్యలో జరుపతగునా అని. వాళ్లు దానిని ధర్మోల్లంఘన అనేశారు. ఏది ఏమైనా అప్పుడు ఏ తిథి కూడా పనికిరానిది కాదు. ఎందుకంటే లోకసభ ఎన్నికలు 1990 జనవరి/ఫిబ్రవరి నెలల్లో జరగవలసి ఉన్నాయి. అలాంటప్పుడు ఉత్తరాయణం కోసం ఎదురుచూడటం ఎలా కుదురుతుంది! అలా రాజకీయాలకు ధర్మం మరోసారి తలొగ్గవలసి రావటం, పైగా దేశంలోని ప్రతి హిందువుకు అది తెలిసిన విషయం కావటం చిత్రమే.

వీహెచ్‌పీ ఆందోళనకు 1989 జూన్‌లో మరో ప్రోత్సాహం లభించింది. అప్పట్లో పాలంపూర్‌లో సమావేశమైన బీజేపీ జాతీయ కార్యవర్గం అయోధ్య ఉద్యమం ప్రభావాన్ని సమీక్షించింది. అదొక సున్నితమైన రాజకీయ అంశంగా తయారయినట్లుగా అది భావించింది. ఆ సమావేశం అయోధ్య ఉద్యమానికి మద్దతునివ్వాలని నిర్ణయించింది. మందిర సమస్య కోర్టులు తేల్చగలిగినది కాదని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా ఆమోదించిన  తీర్మానంలో జాతీయ కార్యవర్గం ఇలా పేర్కొంది:

‘వివాద స్వభావం ఏ న్యాయస్థానంలోనూ తేల్చబడేటటువంటిది కాదని బీజేపీ భావిస్తుంది. ఏ న్యాయస్థానమైనా హక్కులకు, ఆక్రమణలకు, స్వాధీనాలు వగైరాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించగలుగుతుంది గాని అయోధ్యపైకి నిజంగా బాబర్‌ దండెత్తాడా లేదా, అక్కడ మందిరాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడా లేదా అనే అంశాలు పరిష్కరింపబడజాలవు. ఒకవేళ అటువంటి విషయాల్లో కోర్టులు నిజం నిగ్గుదేల్చగలిగినా అవి చారిత్రక విధ్వంసాలను సరిదిద్దే విషయంలో మార్గాంతరాలను సూచించ జాలవు..

రామ జన్మభూమి విషయంలో ప్రస్తుత చర్చ ప్రత్యేకించి కాంగ్రెస్‌ పార్టీ, సాధారణంగా మిగతా రాజకీయ పార్టీలు ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువుల మనోభావాలను స్పందనారహితంగా పట్టించుకొనకుండా వంచిస్తున్న తీరును నాటకీయంగా ప్రముఖంగా తెలియజేయగలిగిన విషయంగా బీజేపీ జాతీయ కార్యవర్గం భావిస్తుంది..

ప్రజల సంవేదనలను గౌరవించాల్సి ఉంది; రామజన్మ స్థానాన్ని హిందువులకు అప్పగించాలి-సాధ్యమైతే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి, లేదా చట్టమే శరణ్యం. వ్యాజ్యం ఖచ్చితంగా పరిష్కారం కాబోదు.’ 

బీజేపీ ఈ విధంగా బహిరంగంగా న్యాయపాలనా పూజనీయతను, న్యాయస్థానాల తీర్పుల శిరోధార్యాన్ని మొట్టమొదటిసారిగా దుయ్యబట్టిందనుకుంటాను. దశాబ్దాలకు దశాబ్దాలు హక్కులపై ఎడతెగని దావాలు, విషయం రాజకీయం కావటం ఈ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలనే విషయంలో మరో అనిశ్చిత స్థితికి దారితీసింది. బీజేపీ కల్లాకపటం లేకుండానే స్పష్టం చేసింది- ‘మేము న్యాయస్థానానికి బద్దులమై ఉంటాం, అవి మా కోర్కెలకు సానుకూలంగా స్పందించినంతకాలం!’ కొందరు బీజేపీ నాయకులు వాళ్లకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎంతగా చెప్పాలనుకున్నా నేటికీ ఈ అస్పష్టత తొలగలేదు.

వీహెచ్‌పీ మందిర పథకం 1989 జులై 13న అయోధ్యలో బజరంగ్‌దళ్‌ సదస్సు జరిగినప్పుడు ఓ రూపానికొచ్చింది. ఆ సదస్సులో దాదాపు 6000 మంది స్వచ్ఛంద సేవకులు వివిధ రాష్ర్టాలకు చెందినవారు గుడి కట్టడం కోసం శుద్ధి చేయబడినారు. శుద్ధి చేయబడిన పాత్రలలో ఉన్న సరయూ నదీ జలాలను వారిని ఉత్తేజపరిచేందుకు స్వచ్ఛంద సేవకులపై చిలకరించటం జరిగింది. అక్కడ అశోక్‌ సింఘాల్‌, యస్‌.సి.దీక్షితులు కూడా ఉన్నారు. సంఘాల్‌ బజరంగ్‌దళ్‌ వలంటీర్లను విద్యాసంస్థలకు వెళ్లి ఈ సందేశాన్ని యువకులకు అందించమని హితవు పలికారు. ఈ సందర్భంగా ఓ సాధు సమ్మేళనం కూడా నిర్వహించనుని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ సాధు సమ్మేళనం కూడా నిర్వహింపబడింది. సాధువులు నవంబర్‌ 10న జరుగనున్న శిలాన్యాస్‌ కార్యక్రమాన్ని జయప్రదం గావించవలసిందిగా కోరారు.

1989 ఆగస్టు నాటికి వీహెచ్‌పీ దాని మిత్రసంస్థలు చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. వాళ్లు రామ మందిరాన్ని వివాదంలో ఉన్న కట్టడం స్థానంలో.. ఆ కట్టడాన్ని తొలగించి గాని, దాన్ని వేరేచోటికి మార్చిగాని నిర్మించతలపెట్టారు. అందుక్కారణం ఆ స్థలం శ్రీరాముని జన్మస్థలమని, దానికి గుర్తుగా అక్కడొక మందిరం ఉండేదనీ బాబర్‌ దానిని ధ్వసం చేసి దాని స్థానంలో మసీదును నిర్మించటం జరిగిందనే వారి పట్టుదలకు బాగా పట్టు చిక్కసాగింది. వీహెచ్‌పీ ఈ అభ్యర్థనకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మద్దతు కూడా లభించింది. అప్పుడు వీహెచ్‌పీ ఓ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి పూజచేసిన ఇటుకల్ని (రామశిలలు) దేశమంతటి నుంచి నవంబర్‌ 1989 వరకు పోగుచేసి వాటితో అయోధ్యలో రామ మందిరం నిర్మించతలపెట్టింది. రామమందిరం గర్భగుడి వివాదంలో ఉన్న కట్టడపు మూడు గుమ్మటాలలో మధ్య గుమ్మటం వద్ద ఉంటుంది.

1989 ఆగస్ట్‌ మాసం ప్రారంభం నాటికి వాతావరణం మతపరమైన ఆందోళనలతో బాగా వేడెక్కింది.

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo