మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Jul 16, 2020 , 23:48:13

నిర్మాణరంగంలో సంక్షేమం

నిర్మాణరంగంలో సంక్షేమం

దేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధిక జనాభాకు జీవనాధారం నిర్మాణ రంగం. దేశాభివృద్ధిలో గృహ, తదితర నిర్మాణాలదే కీలకపాత్ర. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణరంగంతోపాటు దాదాపు అన్నిరకాల ఉత్పత్తి, సేవలరంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కరోనా పరిస్థితుల నుంచి కాపాడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుని రైతు కూలీలకు వెన్నుదన్నుగా నిలిచింది. అదే సమయంలో దేశ ఆర్థికవ్యవస్థకు తెలంగాణ వ్యవసాయరంగాన్ని ఆసరాగా నిలిపిన ముందుచూపు ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.’

యువనేత,రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నట్టు- కరోనాకు భయపడి పదేపదే లాక్‌డౌన్‌ విధించి ఆగం కావడానికంటే, ఆర్థిక సంక్షోభంలో పడి రాష్ట్రమే ఆగమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో అన్ని ఉత్పాదక, సేవా రంగాలను గాడిలోపెడుతూ వాటిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. నిర్మాణరంగానికి కూడా వ్యవసాయం మాదిరి సాయం అందిస్తూ, పుంజుకునే దిశగా వ్యూహాలను అనుసరించాల్సి ఉన్నది.

సినిమా షూటింగులు, నిర్మాణరంగ కార్యకలాపాల వల్ల మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు తదితర 164 రకాల వృత్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పని దొరుకుతుంది. వలస కార్మికుల్లో దాదాపు 90 శాతం మంది నిర్మాణరంగంలో ఉపాధి పొందుతున్నవారే. వీరు పని వదిలేసి సొంతూళ్లకు చేరుకోవడంతో  నష్టాలు వస్తున్నాయి. 

చేతిలో పైసల్లేక వినియోగశక్తి తగ్గడంతో ద్రవ్య చలామణి మందగించి ఆర్థిక సంక్షోభానికిదారితీస్తుంది. కాబట్టి పనిలేదని గ్రామాలకు తిరిగివెళ్లిన కార్మికులను పట్టణాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలి. అందుకుగాను వారిలో కరోనా భయాన్ని తొలగించాలి. గృహనిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కరోనా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. వారికి ఉచిత మాస్కులు, శానిటైజర్‌ కిట్లు అందించాలి. 

చేతిలో పైసల్లేక వినియోగశక్తి తగ్గడంతో ద్రవ్య చలామణి మందగించి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి పని లేదని గ్రామాలకు తిరిగివెళ్లిన కార్మికులను పట్టణాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలి. అందుకుగాను వారిలో కరోనా భయాన్ని తొలగించాలి. గృహనిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కరోనా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. వారికి ఉచిత మాస్కులు, శానిటైజర్‌ కిట్లు అందించాలి. అందుకు ప్రభుత్వం బిల్డర్లతో సమావేశం ఏర్పరిచి తగు మార్గదర్శకాలను రూపొందించాలి.

వ్యవసాయరంగానికి కల్పించినట్టే నిర్మాణరంగానికి కూడా రాయితీలు ఇవ్వాలి. నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్‌, స్టీల్‌, ఇసుక, కంకర తదితరాల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలో గృహ నిర్మాణరంగాన్ని నిలబెట్టాలంటే కొనుగోలుదారులకు స్టాంపు డ్యూటీని తగ్గించాలి. దాంతోపాటు ఇప్పటికే పెరిగి ఉన్న భూముల (రియల్‌ ఎస్టేట్‌) మార్కెట్‌ విలువను పెంచి రిజిస్ట్రేషన్‌ ఫీజు తగ్గించాలి. అదేవిధంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు ఇచ్చే ‘లే అవుట్‌' ఆమోదం విషయంలో ఫీజు తగ్గించాలి. బిల్డర్లు కూడా తెలంగాణ నిర్మాణంలో భాగమని గుర్తించి వారికి కూడా నిర్మాణ సమయంలో ఉచిత విద్యుత్తును అందజేయాలి. దిగువ, మధ్యతరగతి వారికి  సొంతిల్లు కల నెరవేరటం కోసం ముఖ్య పట్టణాలకు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అక్కడ మౌలిక వసతులను కల్పించడం వల్ల అటు బిల్డర్లకు ఇటు వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుంది. భూ మార్పిడి సందర్భాల్లో వసూలుచేసే ‘నాలా’ఛార్జీలను తగ్గించాలి. మొత్తంగా గృహనిర్మాణ రంగాన్ని వ్యాపార కోణంలో కాకుండా సంక్షేమకోణం లో చూడాలి. తద్వారా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి గృహ నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మాణరంగానికి ప్రారంభ దశలో అనేక రాయితీలు కల్పించారు. దాంతో 2014 నుంచి హైదరాబాద్‌ సహా పలు పట్టణాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం అందచేసే రాయితీలు కార్మికులనే కాకుండా నిర్మాణరంగాన్ని కూడా బతికిస్తాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న మొత్తం గృహనిర్మాణ అభివృద్ధితో పోల్చిచూసినప్పుడు మూసీకి తూర్పుదిక్కుగా ఉన్న శివారు ప్రాంతా ల్లో నిర్మాణరంగానికి ఉద్దీపన అవస రమని తెలుస్తుంది. ఇప్పటికే.. మంత్రి కేటీఆర్‌ ఈ దిశగా కార్యాచరణ చేపట్టడం సత్ఫలితాలనిస్తున్నది. ఇదే స్ఫూర్తితో నిర్మాణరంగం ముందుకుపోయినప్పుడే నగరాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి జోడెడ్ల వలె పరుగెత్తుతాయి.


(వ్యాసకర్త: మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఎండీ, ఈస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు)
logo