ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jul 15, 2020 , 23:28:13

ప్రజలు కేంద్రంగా పాలన

ప్రజలు కేంద్రంగా పాలన

దేశ చరిత్ర లోతుల్లోకి వెళ్లి పరిశోధిస్తే పీవీ పట్ల అందరం గర్వపడే నిజం ఒకటుంది. భారతదేశాన్ని పాలించిన తొలి దక్షిణాది వ్యక్తిగా పీవీ నరసింహారావు చరిత్ర సృష్టించారు.రామాయణ, మహాభారత కాలాల నుంచి ఇరవైయవ శతాబ్ది చివరి దశాబ్దానికి ముందు వరకు ఇప్పటి దేశ సరిహద్దుల్లోపు పాలించిన ప్రతి పాలకుడూ ఉత్తరాదికి చెందినవాడే. తెలంగాణ నుంచి గ్వాలియర్‌ దాకా పాలన సాగించిన శాతవాహనులు హస్తినను చేరుకోలేక పోయారు. దక్షిణాది పాలకులెవ్వరూ వింధ్య పర్వతాలను దాటిపోయిన దాఖలాల్లేవు.

1991-96 మధ్య కాలంలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల సహకారంతో ఐదేండ్లు పరిపాలించడం పీవీ నరసింహారావుకు మాత్రమే సాధ్యమైంది. పీవీకి ముందు రెండేండ్లలో ఇద్దరు ప్రధానులు కాగా పీవీ తర్వాత ఐదేండ్లలో మూడుసార్లు పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరిగి ముగ్గురు ప్రధానులైనారు. పీవీ తర్వాత 2014 నుంచి మోదీ పాలన దాకా సుమారు రెండు దశాబ్దాలు సంకీర్ణ ప్రభుత్వాలే దేశాన్ని పాలించాయి.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎక్కువకాలం పరిపాలించింది కాంగ్రెస్‌ పార్టీ కాగా ఒక్క పీవీ పాలనాకాలం తప్ప మిగిలిన కాంగ్రెస్‌ పాలనా కాలమంతా నెహ్రూ కుటుంబం కనుసన్నల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాగిందే. రాజీవ్‌గాంధీ మానవబాంబు దాడిలో మరణించడంతో పీవీ ప్రధాని అయ్యారు. వాస్తవంగా గడ్డుకాలంలో పీవీ పాలనాపగ్గాలు చేపట్టారు. ఏ పాలకుడూ తీసుకోవడానికి సాహసించని ఎన్నో కఠిన నిర్ణయాలను పీవీ తీసుకున్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా ఐదేండ్లూ సాగిన తొలి పాలన పీవీదే. తన ప్రతిభాసామర్థ్యాలతో పీవీ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు.

కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ అంచెలంచెలుగా ప్రధాని స్థాయికి చేరటానికి తోడ్పడింది ఆయన జ్ఞానం, వ్యక్తిత్వం మాత్రమే. పీవీకి రాజకీ యాల్లో గాడ్‌ ఫాదర్‌ లేరు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కాదు. స్వామీ రామానంద తీర్థ, కాళోజీ, నెహ్రూ ప్రభావం ప్రారం భంలో పీవీపై ఉన్నా, ఆయన రాజకీయ ఎదుగుదలలో వీరి ప్రత్యక్ష పాత్ర ఏమీ లేడు. పీవీ ఆలోచనలపై మాత్రమే ఆ పెద్దల ప్రభావం కొంత మేరకు ఉన్నదని ఆయన రచనలు, ప్రసంగాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పీవీ ఆలోచనలను మలుపు తిప్పిందీ, ఆఖరి శ్వాస దాకా ప్రభావితం చేసిందీ ప్రజలే. గడిచిన ఐదు తరాల్లో ఏ రాజకీయ నాయకునిలో కనిపించని ఒక అరుదైన వ్యక్తిత్వం, కేసీఆర్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘360 డిగ్రీల పర్సనాలిటీ’కి పునాది సమాజమే.

దేన్నయినా సునిశితంగా పరిశీలించే, అధ్యయ నం చేసే మనస్తత్వం బాల్యం నుంచే పీవీకి అలవడింది. ప్రకృతిని, ప్రజల జీవన విధానాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ప్రజా ఉద్యమాలను, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, పురాణాలను, సాహిత్యాన్ని, కళలను చిన్నతనం నుంచే అధ్యయనం చేసే అవకాశాన్ని తెలంగాణ సమాజం పీవీకి ఇచ్చింది. హన్మకొండలోని మల్టీపర్పస్‌లో విద్యార్థిగా ఉన్న సమయం పీవీ వ్యకిత్వ వికాసానికి దోహద పడిన ప్రారంభ కాలంగా కనిపిస్తుంది. ఉస్మానియా వర్సిటీలో 1938 చివర్లో మొదలైన వందేమాతర ఉద్యమం వల్ల బహిష్కృతులైన విద్యార్థులు బృందాలుగా ఏర్పడి జిల్లాలకు వెళ్లారు. హన్మకొండ మల్టీపర్పస్‌ విద్యార్థిగా పీవీ వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కరించబడి 12వ తరగతి నాగ్‌పూర్‌లో అభ్యసించారు. 

తెలంగాణ నుంచి నాగ్‌పూర్‌ పోవడంతో పీవీ నరసింహారావుకు మళ్లీ సైన్స్‌ ఇష్టాంశంగా మారింది. ఫలితంగా పుణెలోని ఫెర్గ్గుసన్‌ కాలేజీలో బీఎస్సీలో అడ్మిషన్‌ తీసుకున్నారు. ఆస్ట్రోనాట్‌ కావాలనే లక్ష్యం కొద్దినెలల్లోనే కనుమరుగై పీవీని మళ్లీ సామాజిక ఉద్యమాలు ఆకర్షించాయి. తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమాలతో ప్రభావితమైన పీవీ పుణెలో దేశ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులైనారు. ఆ రోజుల్లోనే క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైంది. విద్యార్థిగా పీవీ ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అతనిలో వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనల స్థానాన్ని దేశభక్తి ఆకర్షించింది. నాటినుంచి పీవీ గమ్యం, గమనం పూర్తిగా మారిపోయింది. 

నాగ్‌పూర్‌లో న్యాయశాస్త్రంలో పట్టాపొందిన పీవీ  బూర్గుల రామకృష్ణారావు జూనియర్‌గా న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కానీ రజాకార్ల అకృత్యాలు గమనించిన పీవీ వృత్తి వదిలి చాందా క్యాంపులో స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి సాయుధ శిక్షణ పొందారు. పోలీసు చర్య తర్వాత కవిగా, రచయితగా ‘కాకతీయ’పత్రికకు సంపాదకునిగా ఉన్నా ప్రజలకు సేవలు అందించటానికి రాజకీయ క్షేత్రాన్నే ఎంచుకున్నారు. తాననుకున్న ఆస్ట్రోనాట్‌గా గానీ, లాయర్‌గా గానీ, రచనా వ్యాసంగంలో గానీ పీవీ కొనసాగించలేకపోవటానికి హైదరాబాద్‌, భారతదేశ రాజకీయ ఆర్థిక, సాంఘిక పరిస్థితులతో ప్రభావితమై, ఆ పునాదిలో నుంచి జనించిన అరుదైన వ్యక్తిత్వమే కారణం.

(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు)
logo