సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 14, 2020 , 23:50:54

మాతృభాష అంటే మక్కువ

మాతృభాష అంటే మక్కువ

ఒకనాటివి జనరంజక రాజకీయాలు, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కావు. ఒకనాటి రాజకీయవేత్తలు shootsకు చెందిన politicians కారు, rootsకు చెందిన రాజకీయవేత్తలు. gross rootsకు చెందిన రాజకీయవేత్తలు. చాలావరకు స్వాతంత్య్ర పోరాటాన్ని చూసినవారు, దానిలో పాల్గొన్నవారు. కనుక వారికి చాలా విశాలమైన దృష్టి, విశ్వదృష్టి ఉండేది. ఆ కాలపు రాజకీయవేత్తలు గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడుయేట్లు, కాన్వెంట్‌ చదువులు చదవకపోవచ్చు కానీ పల్లెల్లోనే పుట్టి పెరిగి, అచటి మట్టివాసనను పుణికిపుచ్చుకొని, వ్యవసాయమంటే ఏమిటో వ్యవసాయదారుడంటే ఎవరో, కర్షకులు కార్మికులంటే ఎవరో, పల్లెటూరంటే ఏమిటో, పల్లె బతుకంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసినవారు.

స్వాతంత్య్రోద్యమ కాలం నాటి నేతలు సదాశయంతో త్యాగనిరతితో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. నాటితరానికి స్వార్థ రాజకీయ లక్ష్యాలు అనేటివి ఉండేవి కావు. నాటితరం వారంతా సాహిత్య సారస్వత ప్రియులు. దేశభక్తులు, నీతి నిజాయితీపరులు, సామాజిక భావం కలవారు. పీవీ గారు ఆ రాజకీయ కోవకు చెందినవారు. పీవీ గారికి విద్యాభివృద్ధి, భాషాభివృద్ధి, సాహిత్య సారస్వతాభివృద్ధి గురించి ఉన్నంత అవగాహన మరే రాజకీయవేత్తకు ఉండేది కాదు.

పీవీ అలాంటివారు కనుకనే విద్యామంత్రయితే బాగుండునని నాబోటి వాళ్లు ఎంతోమంది ఉవ్విళ్లూరేవారు. అలాంటి అవకాశం అతనికి ఒకసారి రాష్ట్రంలో వచ్చింది, మరొకసారి కేంద్రంలో. ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది ‘తెలుగు అకాడమీ’. ఆయన కల్పించుకోవడం వల్లనే తెలుగు అధికార భాషగా, బోధనా భాషగా దృఢపడింది. ఆయనకు తెలుగు అకాడమీని స్వయంప్రతిపత్తి, స్వయం సమృద్ధి గల, విశ్వవిద్యాలయ స్థాయి సంస్థగా ఏర్పరచాలనే సత్సంకల్పం ఉండేది. ఉన్నతస్థాయి పరిశోధనా, ప్రచురణ సంస్థగా, ప్రామాణిక గ్రంథాలు, నిఘంటువు లు, పరిపాలనా సంబంధిత పదకోశాలు తయారు చేసే బహుముఖీన సంస్థగా తీర్చిదిద్దాలని భావిం చారు. తెలుగు అకాడమీ స్థాపన విద్య, భాష, సాహిత్యం కోసం కాకుండా పరిపాలన కోసం కూడా ఉద్దేశించింది.

నేను సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి (1984లో) తెలుగు అకాడమీ పరిస్థితి దయనీయంగా మారింది. 1968లో తెలుగు అకాడమీ ఏర్పడిన తర్వాత 18 ఏండ్లకు సంచాలకునిగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించిన మొదటి తెలంగాణ వాడిని నేనే. పీవీతో నాకున్నంత స్వేచ్ఛ మరొక సంచాలకునికి ఉండేది కాదు. అన్నిరం గాల విద్యలు తెలుగులో జరుగందే తెలుగు భాష అభివృద్ధి కాజాలదు, బోధనకు, పరిపాలనకు సరిపోజాలదనే అవగాహన పీవీ గారికుండేది. అందుకే నాడు అన్ని సబ్జె క్టులలో, అన్ని స్థాయిల్లో తెలుగు ప్రవేశపెట్టారు వారు. పీవీ గారు తెలుగు అకాడమీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు విద్యాశాఖామంత్రిగా ఎన్నో బాధ్యతలున్నప్పటికీ ప్రత్యేకంగా తెలుగు అకాడమీలో తనకొక ఛాంబర్‌ ఏర్పాటు చేసుకొని స్వయంగా పర్యవేక్షించేవారు. తెలుగు అకాడమీకి పటిష్ఠ నియమావళిని, లక్ష్యాలను రూపొందించి దేశంలోనే అత్యుత్తమ భాషా సాహిత్య సంస్థగా పేరు తెచ్చారు.

నాటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం, తెలుగు అకాడమీ రెండూ చిన్నచూపు చూడబడినాయి.  రాజకీయాల మాదిరే విద్య కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయింది. ఇంగ్లిష్‌ భాషపై, ఇంగ్లిష్‌ మీడియంపై మోజు పెరిగింది. దానివల్ల ఉన్నత విద్య ధనవంతులకు చెందినదిగా మారింది. ఈలోపు విదేశీ ఉద్యోగాల కోసం ఇంగ్లిష్‌ భాష ద్వారా విద్యపై మోజు పెరిగింది. తెలుగు మీడియం వెలవెలబోయింది. ఇదీ తెలుగు మీడియం, తెలుగు అకాడమీ దుస్థితి. తెలుగు అకాడమీ అభివృద్ధి, విస్తృతి స్తంభించిపోయిందంటే దానికి కారణం ఆంధ్ర పరిపాలకులు దానిని తెలంగాణ సంస్థగా సవతితల్లి చూపు చూడటమే. పీవీ గారు దానిని ఎంత బలపరచాలని చూశారో ఆంధ్ర పాలకులు, ఆంధ్రా పెట్టుబడిదారులు దానిని అంత బలహీన పరచాలని చూశారు. 

తెలుగు అకాడమీ యాభై రెండేండ్ల ఉనికి కాలంలో దానిలో నేను, ప్రొఫెసర్‌ యాదగిరి మాత్రమే తెలంగాణ వాళ్లం సంచాలకులుగా పూర్తికాలం పనిచేయగలిగాం.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగు అకాడమీకి పీవీ పేరు పెడుతామనడం సంతోషించదగినది. తెలుగు అకాడమీ ఆర్థిక సంక్షోభంలో పడకుండా కేంద్ర రాష్ట్ర గ్రాంట్లు వచ్చేటట్లు చేయాలి. దానిని తెలుగు యూనివర్సిటీకి, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కమిషన్‌కు, విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలకు, సాహిత్య అకాడమీకి, ప్రభుత్వరంగ అనువాద విభాగానికి, సాంస్కృతిక విభాగానికి అనుబంధ సంస్థగా కూడా మార్చాలి. 

ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి మౌలిక పుస్తకాలే కాకుండా ఇతర అనువాదాలు చేయాలె. తెలుగు అకాడమీలో ఒక అనువాద విభాగాన్ని ఏర్పరిచి, నిరంతరం ఇంగ్లిష్‌, ఉర్దూ, హిందీ, సంస్కృతం, తదితర భారతీయ భాషల నుంచి మంచి గ్రంథాలు తర్జుమా చేసి అందించవలసిన అవసరం మరీ మరీ ఉన్నది. 

(వ్యాసకర్త: పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ)


logo