గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - Jul 14, 2020 , 23:50:53

ఆత్మ నిర్భరమా, ఆర్థిక దుర్భరమా?

ఆత్మ నిర్భరమా, ఆర్థిక దుర్భరమా?

ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం పలుసార్లు విధానాలను మారుస్తుండటం ఒక శిక్షగా మారుతున్నది. కరోనా నెలకొన్న అసాధారణ సంక్షోభం నుంచి బయటపడటానికి రాష్ర్టాలకు కేంద్రం అండగా నిలవాల్సిన పరిస్థితి ఇది. గతంలో సాధారణ స్థాయి ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు చేసిన స్థాయిలో కూడా ప్రస్తుతం ఆదుకోకపోవడం రాష్ర్టాలను నిరాశకు గురిచేస్తున్నది.

కేంద్రం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌' ప్యాకేజీ ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. ఆత్మ నిర్భర్‌ కింద ప్రజలకు ఎంతో చేశామని బీజేపీ నాయకులు గొప్పలు చెప్తున్నారు. ఆత్మ నిర్భరత మాట అటుంచితే రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన వాటాకే గండి కొడుతున్న ఘనత కేంద్రానిది. ఇంతవరకు జీడీపీలో 1.2 శాతం మాత్రమే  కరోనా రిలీఫ్‌ ఫండ్‌గా కేంద్రం ప్రకటించింది. మిగతా దేశాలు తమ జీడీపీలో 5 నుంచి 10 శాతం కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌గా ప్రకటించాయి. కొవిడ్‌ వైరస్‌ను నిర్మూలించడానికి, ప్రజల ప్రాణాలను రక్షించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు ప్రత్యక్ష ఆర్థికసాయంగా కేంద్రం ఏమీ ఇవ్వలేదు. కేంద్ర పన్నుల వాటాలో ప్రాధాన్య క్రమాలను అనుసరించి ఇచ్చే వెయిటేజీ వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నది. ఆ నష్టాన్ని పూడ్చాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం తుంగలో తొక్కింది. పెట్రోల్‌, డీజిల్‌పై పదేపదే సెస్‌ను పెంచి, రాష్ర్టాలకు వ్యాట్‌ రాబడి లేకుండా చేస్తూ, మోదీ ప్రభుత్వం ఆర్థిక గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నది.

కరోనా వైరస్‌ పీడిస్తున్న సంక్షోభ సమయంలో రాష్ర్టానికి ఉదారంగా ఆర్థికసాయం అందించడానికి బదులు ఉన్న నిధులకే  కేంద్రం కత్తెర వేస్తున్నది. ఈ ఏడాది రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాలో కూడా కేంద్రం మళ్లీ కోత విధించింది. కేంద్ర పన్నులలో రాష్ర్టాల వాటాగా రావాల్సిన నిధులలో 17.81 శాతం వరకు కత్తెర వేసింది. విపత్కర వేళ ఏమిటీ వైపరీత్యమని ఆర్థికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనాభా తగ్గుదల, ఆర్థిక పురోభివృద్ధి అంశాలకు తక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల, కేంద్రం పన్నుల వాటాలో తెలంగాణతో పాటు కర్ణాటక, మిజోరం రాష్ర్టాలు నష్టపోతున్నాయి. ఈ రాష్ర్టాలకు నష్టపరిహారంగా స్పెషల్‌ గ్రాంట్లను మంజూరు చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. దాన్ని సైతం కేంద్ర సర్కార్‌ బేఖాతరు చేసింది. ఇంతవరకు ఆ సిఫార్సును ఆమోదించలేదు. ఇందువల్ల తెలంగాణ ఖజానాకు ప్రత్యక్షంగా 723 కోట్ల రూపాయల మేర గండి పడింది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌కు సెస్‌ను పెంచి ప్రజలపై భారాన్ని మోపడంతో పాటు రాష్ర్టాల ఖజానాకు రాబడి రాకుండా కేంద్రం ఆర్థిక కుయుక్తులకు పాల్పడుతున్నది. ధర పెంచితే పన్నుల వాటాలో కొంత రాష్ర్టాలకు వస్తుంది. కానీ సెస్‌ను పెంచడం వల్ల వినియోగదారుడిపై భారం పడుతుంది. కేంద్రానికి రాబడి వస్తుంది. కానీ రాష్ర్టాల వ్యాట్‌ రాబడి పెరగదు!

కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ పరంగా ఆది నుంచీ ఆర్థిక అంశంలో అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు వివిధ రకాల పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతున్నది. కానీ అందుకు విరుద్ధంగా రాష్ర్టానికి కేంద్రపన్నులలో వాటా తగ్గుతున్నది. ఆర్థిక క్రమశిక్షణతో, ప్రగతిశీల విధానాలతో అభివృద్ధిలో పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు ఆంక్షల సంకెళ్లు వేస్తూనే ఉన్నది. సొంత కష్టంతో రాబడులు పెంచుకొని, జనాభా పెరుగుదలపై నియంత్రణ సాధించిన రాష్ర్టాలను ప్రోత్సహించడానికి బదులుగా పన్నుల వాటాను తగ్గిస్తున్నది. వాస్తవానికి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ దేశ సంపద (జీడీపీ)లో తన వాటా పెంచుతూ జాతి అభివృద్ధికి తోడ్పడుతున్న రాష్ర్టాలను కేంద్రం ప్రోత్సహించాలి. దేశ జీడీపీలో తెలంగాణ తన వాటాను 4-4.8 శాతానికి పెంచుకొని సత్తాను చాటుకుంటున్నది.

ఆర్థిక క్రమశిక్షణకు గతంలో 7.5 శాతం వెయిటేజీ ఇచ్చి దానిని ఎకాయెకిన 2.5కు తగ్గించడం వల్ల రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగింది. 1971 కాకుండా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన వెయిటేజీ ఇవ్వడం వల్ల మన రాష్ర్టానికి మరింత అన్యాయం జరిగింది. జనాభా తక్కువ ఉండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలకు 15వ ఆర్థిక సంఘం వెయిటేజీని తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల 2019-20లో రూ.18,9 64 కోట్లుగా ఉన్న రాబడి 18,241 కోట్లకు తగ్గుతున్నది. ఫలితంగా లోటును పూడ్చటానికి రూ.723 కోట్ల రూపాయల వరకు స్పెషల్‌ గ్రాంట్లను ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ ఇంతవరకు కేంద్రం ఆ సిఫార్సును ఆమోదించలేదు. 

సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను, కస్టమ్స్‌ పన్ను, ఇన్‌కమ్‌ట్యాక్స్‌, జీఎస్టీ, ఐజీఎస్టీ తదితర రూపాలలో రాష్ట్రం నుంచి కేంద్రం ఖజానాకు 50 వేల కోట్లకుపైగా చేరుతున్నాయి. ఇందుకు ప్రతిగా కేంద్రం నుంచి రాష్ట్ర ఖజానాకు 19 వేల కోట్ల రూపాయలు కూడా రావడం లేదు. జీఎస్టీలో కూడా రాష్ర్టానికి దక్కాల్సిన వాటాను దారిమళ్లించిన పరిస్థితులున్నాయి. ఐజీఎస్టీ కింద 2017-18 ఆర్థిక సంవత్సరానికి తమకు సర్దుబాటు చేయాల్సిన పన్నును అడ్డదారిలో ‘కన్సాలిడేటెడ్‌ ఫండ్‌'కు మళ్లించారని, దానిని తమకు వెంటనే చెల్లించాలని కేంద్రంతో రాష్ట్రం చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి బృహత్తర పథకాలకు ప్రత్యేక నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం పలుసార్లు విధానాలను మారుస్తుండటం ఒక శిక్షగా మారుతున్నది. కరోనా  నెలకొన్న అసాధారణ సంక్షోభం నుంచి బయటపడటానికి రాష్ర్టాలకు కేంద్రం అండగా నిలవాల్సిన పరిస్థితి ఇది. గతంలో సాధారణ స్థాయి ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు చేసిన స్థాయిలో కూడా ప్రస్తుతం ఆదుకోకపోవడం రాష్ర్టాలను నిరాశకు గురిచేస్తున్నది.

కేంద్రం తనకు ఏ మాత్రం భారం కాని ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడానికి కూడా షరతులు విధించడం, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ మనీ వంటి విధానాలను అమలు పరచకపోవడం విషాదకరం. సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థికరంగాన్ని గాడిన పెట్టడానికి, రాష్ర్టాలకు వెసులుబాటు కల్పించేందుకు వీలుగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని బేషరతుగా పెంచాలనీ, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ మనీ విధానాన్ని అమలుపరచాలని, అత్యవసరమైతే ‘హెలికాప్టర్‌ మనీ’ అస్ర్తాన్ని ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్‌, దువ్వూరి సుబ్బారావుతో పాటు అమర్త్యసేన్‌ వంటి ఆర్థిక నిపుణులు కూడా ఇదే తరహా సూచనలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకోకపోవటం బాధ్యతారాహిత్యమే. logo