శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Jul 14, 2020 , 23:50:52

పోటీ సభలు, ఉద్రిక్తతలు

పోటీ సభలు, ఉద్రిక్తతలు

నాలుగో అధ్యాయం కొనసాగింపు...

కోర్టులో తాళాలు తీసే విషయంలో ఓ ప్రత్యేక బెంచి ఏర్పాటుచేయవలసిందిగా మిసలేనియస్‌ కేసు నం.29/1987 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు తదితరులుగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసును హైకోర్టు 1989 జులై 10న ఆమోదించింది. ఆ కేసులన్నింటికి కలిపి ఓ కొత్త కేసు నంబరు 1 నుండి 5/1989గా కేటాయించారు. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ కేసీ అగర్వాల్‌, జస్టిస్‌ యూసీ శ్రీవాత్సవ, జస్టిస్‌ ఎస్‌హెచ్‌ఏ రజాలతో కూడిన ధర్మాసనం వాటిని పరిశీలించి త్వరితగతిన నిర్ణయించేందుకు ఏర్పాటు చేయబడింది.

హైకోర్టు ఉత్తర్వుల వరకు మందిరం గొడవ దాదాపు ఏకపక్షంగానే ఉండిపోయింది. గుడి తాళాలు తీయటం మళ్ళీ వివాదానికి తెరతీసినట్లయ్యింది. అది ముస్లిములలో కలకలం రేపింది. పలువురు దానిని వీహెచ్‌పీ పథకాన్ని ముందుగా తామే అమలుచేసేందుకు తొందరపాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంగా అభివర్ణించారు. సంఘపరివారమూ గేలి చేసింది. దేని నిమిత్తం వీహెచ్‌పీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు చివరి గడువును నిర్ణయించారో తత్ఫలితంగానే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. దీనిపై బీజేపీ ఆలోచనల్ని యిక్కడ పేర్కొనాల్సి ఉంది.

తాళాలు తీసే వ్యవహారం-ఓ వ్యత్యాసం: ముక్కు ముఖం తెలియని న్యాయవాది కోర్టుకెక్కటం, ఆగమేఘాల మీద విచారణ జరిపి తీర్పు చెప్పటాన్ని సరిపోల్చి చూడాల్సి ఉంది. సంఘటనలను గుర్తుచేసుకోవటం సముచితం.

  • మొదటగా, ఒక అప్రముఖ న్యాయవాది (ఉమేష్‌ చంద్ర పాండే) 1986 జనవరి 21న సాధువులు తుది గడువు యిచ్చిన రెండు రోజుల్లోనే ఫైజాబాద్‌ మున్సిఫ్‌ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు.
  • రెండవ విషయం-1986 జనవరి 28న మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆ విషయంపై ఉత్తర్వులు యిచ్చేందుకు నిరాకరించటం.
  • మూడవ విషయం-ఫైజాబాద్‌ జిల్లా జడ్జి కోర్టులో వెనువెంటనే అప్పీలు చేయటం.
  • నాల్గవ విషయం-1986 ఫిబ్రవరి 1న మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వుల తర్వాత మూడు రోజులలోపే జిల్లా కోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని గేటు తాళం తీయవలసిందిగా ఆదేశించటమే గాక ప్రభుత్వం అక్కడ హిందువులు దర్శనం చేసుకునేందుకుగాని, పూజలు చేసుకునేందుకుగాని ఆటంకాలు కల్పించరాదని ఆదేశించింది.
  • ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే ముందర గేట్లు తాళాలు తీయటం, దానిని దృశ్యీకరించేందుకు దూరదర్శన్‌ కేంద్రం నుంచి కెమెరాలు తేవటం, దానిని భారతదేశమంతటా చూసేవిధంగా ప్రసారం చేయటం.

ఈ కేసు ఇంత వేగంగా ఎలా నడిచింది? ప్రభుత్వం ఎలా తల ఒగ్గింది? హిందువులు 37 సంవత్సరాలుగా వాదిస్తున్నా ఏమీ జరగకుంటే, ఫైజాబాద్‌ జిల్లా కోర్టు అమలును స్వీకరించి రెండు రోజుల్లోనే తాళాలు తీయమనే తీర్పు ఎలా చెప్పగలిగింది? కోర్టు ఉత్తర్వులు వెలువడిన గంటలోపే దూరదర్శన్‌ కెమేరాలు ఎలా క్లిక్‌మన్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం-ప్రభుత్వం అటువంటి వాటికి వ్యతిరేకం కాదు. అందువల్ల అటువంటివి జరిగేందుకు అవకాశం వుంది. జరిగి తీరుతాయి. కోర్టులు కూడా స్పందిస్తాయి. రామ జన్మభూమి కేసు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉండటానికి చట్టం లేదా కోర్టులే బాధ్యత వహించాలా లేక ప్రభుత్వమే కావాలని ఆ కేసులను మురగబెడుతున్నదా? (అయోధ్యపై బీజేపీ శ్వేతపత్రం పేజీ 155 పేరాలు 1-17,1-18, 1-19). 

బాబ్రీ మసీదు పోరాట కమిటీ ఏర్పాటు: బాబ్రీ మసీదు పోరాట కమిటీ అనేది ఇంచుమించుగా ప్రార్థనా స్థలం గేటు తెరిపించిన నేపథ్యంలోనే ఆవిర్భవించింది. 1986 ఫిబ్రవరి 3న మహమ్మద్‌ హషీమ్‌ తరపున యంఏ సిద్దిఖి అనే న్యాయవాది ఫైజాబాదు జిల్లా జడ్జి తాళాలు తీయమంటూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు వేశారు. 1986 ఫిబ్రవరి 6న లక్నోలో నిర్వహింపబడిన ముస్లిముల సాధారణ సమావేశంలో బాబ్రీ మసీదు పోరాట కమిటీని ఏర్పాటుచేసేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. మౌలానా ముజఫర్‌ హుస్సేన్‌ కిచౌచ్వీని అధ్యక్షునిగా ప్రకటించారు. అలాగే అజమ్‌ ఖాన్‌, జఫర్‌ యాబ్‌ జిలానీలు కన్వీనర్లుగా నియమింపబడినారు. ఆ తరువాత మిగతా సభ్యుల్ని, వివిధ పదవులకు చెందినవారిని నియమించటం జరిగింది. వాళ్ళంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవాళ్ళే.

ఆల్‌ ఇండియా ముస్లిమ్‌ మజ్లిస్‌-ఎ-ముషావరత్‌ (ఏఐఎంఎంఎం) ఈ వ్యవహారాన్ని అఖిల భారతస్థాయిలో నిర్వహింపసాగింది. ఏఐఎంఎంఎం పిలుపు మేరకు 1986 ఫిబ్రవరి 14న ముస్లిములంతా సంతాపదినంగా పాటించి ప్రధాని రాజీవ్‌గాంధీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. 1986 ఫిబ్రవరి 24న ఏఐఎంఎంఎం ఒక సభను నిర్వహించి వాళ్ళ కార్యకలాపాల పరిమితిని విస్తృతపరిచేందుకు నిర్ణయించారు. చివరకు ఒక కేంద్ర పోరాట కమిటీ ఏర్పాటుకు తీర్మానిస్తూ దానికి సయ్యద్‌ షాహబుద్దీన్‌ను సంధానకర్తగా నియమించారు. ఆయన గతంలో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినవారు. దీనితో ముస్లిం వర్గాలలో ఉద్రేక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆ తరువాత వారంలో ముస్లిం పార్లమెంటు సభ్యులు కూడా జరుగుతున్న సంఘటనల పట్ల తమ ఆందోళనను వెలిబుచ్చుతూ ప్రధానికి ఒక వినతిపత్రం సమర్పించారు.

అయోధ్యలో 1986 ఏప్రియల్‌ 19, 20, 21 తేదీల్లో రామ జన్మభూమి మహోత్సవాన్ని నిర్వహించింది. రామనవమి రోజున లక్షలాది భక్తులు సరయూలో పుణ్యస్నానమాచరించేందుకు అయోధ్యలో గుమిగూడారు. బాబ్రీ మసీదు పోరాట కమిటి కూడా ఏప్రియల్‌ 20న పోటీగా ఓ సదస్సుకు పిలుపునిచ్చింది. ఇరువర్గాల సభల వల్ల ఘర్షణలు చెలరేగగలవనే వార్తలతో జిల్లా యంత్రాంగం ఫైజాబాద్‌లో జరుపతలపెటిన ముస్లింల సభను నిషేధించింది. వివాదంలో ఉన్న మందిరం విషయంలో చర్చలు జరిపేందుకు తొలిసారిగా ఫైజాబాద్‌లో బాబ్రి మసీదు పోరాట కమిటీ తలపెట్టిన సభ అదే. దానిలో ముస్లిం అగ్ర నాయకులందరూ పాల్గొనవలసి ఉంది. ముస్లిములు ఫైజాబాద్‌లోకి  ప్రవేశించకుండా దారులన్ని మూసివేస్తూ పాలనా యంత్రాంగం చర్యలు గైకొంది. అయినా 10 వేల మంది వరకు ముస్లిములు పట్టణంలోకి జొరపడ్డారు. ప్రదర్శన నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo