శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 13, 2020 , 23:38:15

ఆరోగ్య తెలంగాణ!

ఆరోగ్య తెలంగాణ!

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించడం ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధాసక్తులను మరోసారి చాటి చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడ వైద్యకళాశాల ప్రారంభం కావడమే కాకుండా అతివేగంగా సొంత భవనాల నిర్మాణం జరిగింది. ఇతర రంగాల మాదిరిగానే వైద్యరంగంలో కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు యథాలాపంగా జరిగేవి కావు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం ప్రకారం వివిధ చర్యలు తీసుకుంటున్నారు. వైద్య వసతులు అందించడానికి మించిన ఆరోగ్య పరిరక్షణ చర్యలతో సమగ్ర వ్యూహం అనుసరించడం కేసీఆర్‌ విలక్షణ విధానం. 

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగాలంటే అందుకు జాగ్రత్తలు శిశువు గర్భంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. అందుకే కరోనా కాలంలోనూ మారుమూల పల్లెల్లో కూడా పేద కుటుంబాల గర్భిణీలకు రోజూ పుష్టికర ఆహారం అందిస్తున్నది. గర్భిణుల ప్రసవ అంచనా తేదీల ఆధారంగా దవాఖానలకు తరలించే ఏర్పాట్లు చేసింది. మొదట్లో సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకమే ఉండేది కాదు. కానీ సర్కారు దవాఖానలకు వెళ్ళవలసిందిగా కేసీఆర్‌ ఒక మాట చెప్పడంతో పరిస్థితి మారిపోయింది. కేసీఆర్‌పై ప్రజలకున్న నమ్మకం అంతటిది. ప్రజల నమ్మకానికి అనుగుణంగా కేసీఆర్‌ ఏర్పాట్లుచేశారు. అవసరం లేకున్నా తల్లుల కడుపు చీరడం తగ్గిపోయి, సహజ ప్రసవాలు సాగుతున్నాయి. సర్కారు దవాఖానలలో కేసీఆర్‌ కిట్స్‌ అందుతున్నాయి. సక్రమంగా టీకాలు వేయడమూ సాగుతున్నది. మాతా శిశు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవజాత శిశువుల సంరక్షణకు ఏర్పాట్లుచేశారు. ఒకప్పుడు వసతి గృహాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటించేవారు. కానీ కొలిచిపెట్టడానికి బదులు కడుపు నిండా తిననివ్వాలని, సన్నబియ్యం పెట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఇది ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగమే. 

తెలంగాణ అవతరణకు ముందు ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులు వ్యాధుల పాలై మరణించేవారు. వ్యాధిగ్రస్థులకు వైద్య వసతి కల్పించవలసిందే. కానీ అంతకన్నా ముందు వారికి వ్యాధులే రాకుండా నిరోధించాలని కేసీఆర్‌ భావించారు. వ్యాధులు ఎక్కువగా కలుషిత నీరు మూలంగానే వస్తాయి. అందుకే తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్‌ ఇంటింటికీ నల్లా ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇవాళ మారుమూల తండాలకు కూడా మంచినీటి సౌకర్యం లభించింది. ప్రజలకు అందరికీ కంటి పరీక్షలు చేయించిన రాష్ట్ర ప్రభు త్వం భవిష్యత్తులో అనేకరకాల ఆరోగ్య పరీక్షలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు కావాలనే లక్ష్యం ఒకప్పుడు అనూహ్యం. తెలంగాణ అంటే ఆరోగ్యవంతమైన సమాజం, అత్యుత్తమ వైద్యం అని చెప్పుకునే కాలం వస్తున్నది.


logo