ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Jul 13, 2020 , 23:38:13

తాళాలు తీయాల్సిందే..

తాళాలు తీయాల్సిందే..

నాలుగో అధ్యాయం కొనసాగింపు...

తాళాలు తీయవలసిందిగా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ముస్లిములు హైకోర్టులో రిట్‌ పిటిషను దాఖలు చేయగా అది డబ్ల్యూపీ నెం.776/1986 మొహమ్మద్‌ హషీమ్‌ వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరియు ఇతరులుగా నమోదయ్యింది. 1986 ఫిబ్రవరి 3న మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి అనుగుణంగా ‘మళ్ళీ ఈ న్యాయస్థానం ఆదేశించే వరకు అక్కడి ఆస్తి విషయంలో నేడున్న స్థితికి భిన్నంగా ఏ మార్పు చేయరాదు.’

యూపీలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం కోర్టు స్వాధీనంలో ఉన్న ఆస్తి స్థితిని అలాగే కొనసాగేట్లు చూసింది. అయితే ఫైజాబాదు జిల్లా జడ్జి తాళాలు తీయమన్న ఉత్తర్వును నిలుపుదల చేయమని కోరిన మధ్యంతర సహాయ దరఖాస్తును కోర్టు అనుమతించలేదనేది గమనార్హం.అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం మతపరమైన ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు కృషిచేయసాగింది. సంప్రదింపుల ద్వారాను, అనునయింపుల ద్వారాను, కోర్టులోని దావాలకు త్వరితగతిన తీర్పులు లభించే దిశగానూ ప్రయత్నించి వివాదాన్ని పరిష్కరింపజూసింది. కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి ఆలయ నిర్మాణం చేపడుదామన్న వీహెచ్‌పీ సవాళ్ళను ఎదుర్కొంటూ, ఆందోళనల్ని తొలగించేందుకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనే దిశగా వివిధ పక్షాల నాయకులతో చర్చలు జరిపేందుకు కేంద్ర హోంశాఖామాత్యులు బూటాసింగ్‌ స్వయంగా యూపీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీతో కలిసి లక్నో చేరుకున్నారు.

ఈ సంప్రదింపుల్లో ఇటు హిందువులకు, అటు ముస్లిములకు ఆమోదయోగ్యమయిన పరిష్కారం లభించనందున ఎన్డీ తివారీ నాయకత్వాన గల కాంగ్రెస్‌ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఫైజాబాద్‌ సివిల్‌ జడ్జి ముందు గల సివిల్‌ దావాలను అన్నింటిని హైకోర్టుకు బదలాయించి త్వరితగతిన పరిష్కరించవలసిందిగా అర్జీ పెట్టడం జరిగింది. 

(మాజీ  ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)logo