ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - Jul 13, 2020 , 11:43:41

మళ్లీ వివాదానికి తెర

మళ్లీ వివాదానికి తెర

పీవీ-అయోధ్య

1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్‌ జిల్లా జడ్జి కేఎం పాండే తాళాలు తీయవలసిందిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఉమేష్‌ చంద్ర పాండే 1986 జనవరి 30న చేసుకున్న అప్పీలుపై జారీచేయటం జరిగింది. ముస్లిములు కూడా ఈ దావాలో ప్రతివాదులయ్యేందుకు అనుమతించి వారి వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరగా వాళ్ళ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. 

సమయంలో వాళ్ళు గంగాజలం మోస్తున్నా సరే వాళ్ళకు విషయం అంతుబట్టలేదు. నిర్వాహకులు కూడా దానిని ఒక ధార్మిక-రాజకీయ ఎత్తుగడగానే భావించారుగాని దానివలన సంభవించే రాజకీయ పతనాన్ని వాళ్ళు సరిగా లెక్కలోకి తీసుకున్నట్లు లేదని భావించాల్సి వస్తున్నది. అది అప్పటి పరిస్థితుల్లో అంధ విశ్వాస ఫలితమే. చీకట్లోకి ఓ గెంతు గెంతటమే. రాజకీయంగా వేరేవిధంగా శక్తి పుంజుకునే అవకాశం కూడా కన్పించకనే. కనుక రాజీవ్‌గాంధీ నాయకత్వంలో ఐదేళ్ళపాటు 415 మంది కాంగ్రెసు సభ్యులతో లోకసభ కళకళలాడుతుందనే సంగతి గ్రహించిన బీజేపీ ముందుగా తాము కాంగ్రెసుకు వ్యతిరేకులమనే శపథం పూనిన తరువాతే మరే విషయమైనా అని భావించే బీజేపీయేతర పార్టీల రాజకీయ కూటమి ఈ మతపరమైన తురుపు ముక్కను వాడుకుంది. ఈ వ్యూహం బీజేపీ యేతర పక్షాలకు తాత్కాలికమైనదేగాని బీజేపీ విషయంలో అది దీర్ఘకాలిక వ్యూహమే.

ఇందిరాగాంధీ తాను హత్యకు గురయ్యే ముందు అయోధ్య అభివృద్ధికి పలు పథకాలను తయారుచేయమని ఆదేశించింది. ఈ భావావేశపూరిత సమస్యకు సంబంధించిన రాజకీయశక్తి ఏమిటో ఆమెకు తెలియందేం కాదు. ఆమె భిన్నమైన తరహాలో దానికి పరిష్కారాన్ని కనుగొనాలనుకొన్నది. ఆ యాత్రాస్థలాన్ని భక్తులకు, యాత్ర సౌకర్యవంతంగా ఉండేట్లు ప్రభుత్వం తీర్చిదిద్దుతుందనే విశ్వాసాన్ని ప్రజలలో ముందుగా కల్పించాలనుకున్నది. ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. నిధులు లేక చతికిలబడ్డ ‘రాంకీ పౌరీ ప్రాజెక్టు’ తిరిగి కొనసాగేందుకు ఆదేశాలందాయి. ఆయోధ్యలోని పర్యాటక శాఖ వారి హోటలు ఆధునికీకరణకు నోచుకుంది. అయోధ్యను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పూనుకున్నారు. ఆమె మరణంతో ఆ పథకాలన్నీ కుంటువడ్డాయి. ఆమె కుమారుడు ప్రధాని అయ్యారు. ఆయన సహచరుడొకరు అయోధ్య విషయాలు చూడసాగారు. ఇక అక్కడినుండి అనేక విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

రథయాత్ర తిరిగి 1985 అక్టోబర్‌ 23న ప్రారంభమయ్యింది. ఆ రోజు విజయదశమి. ఒక రథయాత్ర బీహారు నుండి బయలుదేరగా ఆరు ఉత్తరప్రదేశ్‌ నుండే. భక్తులైన హిందువుల మతపరమైన సంవేదనల్ని రెచ్చగొట్టడంలో ఆ రథయాత్రలు తుఫాను పాత్రను పోషించాయి. రామనవమి నాటికి గుడికి వేసిన తాళాలు తొలగించకపోతే అమరత్వసిద్ధికి పాల్పడతానని పరమహంస రామచంద్ర ప్రకటించటం జరిగింది.

మొదట వీహెచ్‌పీ గూడ గుడిగేట్లకు వేసిన తాళాలను తీయించాలనే కోరింది. కానీ 1985లో ఉడిపిలో జరిగిన ద్వితీయ ధర్మ సంసద్‌లో రామానంద్‌ సంప్రదాయానికి అధినేత అయిన రామానందాచార్య శివరామాచార్యకు తాళాలతోపాటు గుడి పెత్తనాన్ని కూడా అప్పగించాలనే డిమాండును కలపటం జరిగింది. 1985 డిసెంబరు మూడవ వారంలో అయోధ్యలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహింపబడినట్లే రామాయణ మేళా నిర్వహింపబడింది. నారాయణ్‌దత్‌ తివారీ స్థానంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వీర బహదుర్‌ సింగ్‌ ఆ మేళాను ప్రారంభించేందుకు డిసెంబరు 19న అయోధ్యకు చేరుకున్నారు. గతంలో న్యాయాధీశునిగా పనిజేసిన శివనాథ్‌ ఖట్టూ నాయకత్వాన వీహెచ్‌పీ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలిసి వివాదాస్పద మందిరంకు వేసిన తాళాలు తీయించాలనే తమ అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.

తాళాలు తీశారు

రెగ్యులర్‌ దావా అలా కొనసాగుతూ ఉండగా ఉమేష్‌ చంద్ర పాండే అనే ఆయన మధ్యంతర సహాయాన్ని కోరుతూ 1986 జనవరి 21న దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆయన గర్భగుడి ఇనుపగేట్లకు ఉన్న తాళాలను తీయించవలసిందిగానూ నిరంతర దర్శనాదికాలు హిందువులు నిర్వహించుకునేందుకు అనుమతించవలసిందిగానూ, వివాదంలో వున్న కట్టడం వద్ద నుండి పోలీసు బలగాలను ఉపసంహరించవలసిందిగానూ కోరటం జరిగింది. రెగ్యులర్‌ దావా నం. 2/1950లో ఆయన అటువంటి మధ్యంతర సహాయాన్నే కోరుతూ జనవరి 25న మున్సిఫ్‌ కోర్టులో మరో దరఖాస్తు దాఖలు చేశారు. ఫైజాబాద్‌ మున్సిఫ్‌ కోర్టులో ఆ దరఖాస్తు తిరస్కరించబడింది.

అయితే 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్‌ జిల్లా జడ్జి కేఎం పాండే తాళాలు తీయవలసిందిగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఉమేష్‌ చంద్ర పాండే 1986 జనవరి 30న చేసుకున్న అప్పీలుపై జారీచేయటం జరిగింది. ముస్లిములు కూడా ఈ దావాలో ప్రతివాదులయ్యేందుకు అనుమతించి వారి వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరగా వాళ్ళ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. కోర్టు ఉత్తర్వులు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

‘అప్పీలు అనుమతించబడింది. ‘O’, ‘P’ గేట్లను తెరిచి ఉంచవలసిందిగా ప్రతివాదులను ఆదేశించటమైనది. పూజాదికాలు, దర్శనం విషయంలో ఈ దరఖాస్తుదారునికిగాని, ఆ వర్గ సభ్యులకుగాని ఏ విధమైన నిర్బంధాలుగాని, అడ్డంకులుగాని కల్పించరాదు. అయితే అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పరిస్థితులను బట్టి తగువిధంగా చర్యలు గైకొనే స్వేచ్ఛ ఉంది. ప్రవేశాన్ని కట్టడి చేయవచ్చు. ఖర్చులు భరించే విషయం దావా ఫలితంపై ఆధారపడి వుంటుంది.

జిల్లా యంత్రాంగం నలభై నిముషాల్లోనే ఈ కోర్టు ఉత్తర్వుల్ని అమలుపరచినట్లు సమాచారం.

(‘అయోధ్య’పై మాజీ  ప్రధాని పీవీ రాసిన పుస్తకం నుంచి..)logo