శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - Jul 12, 2020 , 00:02:10

భాషను బతికించిన శాసనం

భాషను బతికించిన శాసనం

తెలుగు భాషను వెయ్యేండ్ల ప్రాచీన భాషగా గుర్తించేందుకు ఆదికవి నన్నయ కాలం సరిపోలేదు. అలాంటి సందర్భంలో తెలుగు... క్రీ.శ. 9,10 శతాబ్దాలలోనే విస్తరించి తన అస్తిత్వాన్ని నిలుపుకున్న ఆధారం సరికొత్త ఉత్తేజాన్ని అందించింది. అదే కుర్క్యాల శాసనం. ఇది కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలంలోని కుర్క్యాల గ్రామంలో ఉంది. ఈ శాసనాన్ని కన్నడ పంప మహాకవి సోదరుడు జినవల్లభుడు వేయించాడు.

తెలుగు సాహిత్యంలో మొదటి కంద పద్యాలు ఉన్న శాసనం ఇదే. శాసనంలో ఉన్న మూడు కంద పద్యాలే తెలుగు భాష ప్రాచీనతను వెనకకు తీసుకువెళ్ళినవిగా భావించవచ్చు. ఈ శాసన కాలం క్రీ.శ. 945గా డా. నేలటూరి వెంకట రమణయ్య నిర్ణయించారు.ఈ శాసనం 200 మీటర్ల ఎత్తయిన గుట్టమీద ఉంది. ఈ గుట్టను బొమ్మల గుట్ట అని, సిద్ధులగుట్ట అని, వృషభాద్రి అని పిలుస్తారు. శాసనంలో జినవల్లభుడి పూర్వీకులు, అతని సోదరుడు పంపమహాకవి గొప్పతనం, జినవల్లభుడి గుణాలను వర్ణించే అంశాలే ప్రధానం.

జినవల్లభుడు వేంగినాడుకు చెందిన సప్తగ్రామాల్లోని వంగిపార గ్రామానికి చెందినవాడు. ఇతని తాత అభిమానచంద్రుడు. తండ్రి భీమప్పయ్య, తల్లి వబ్బనబ్బె. తల్లి తండ్రి జ్యోతిషసింహ. “సకల కళా ప్రవీణ”, “భవ్య రత్నాకర”, “గుణపక్షపాతి” అని జినవల్లభుడిని ఈ శాసనంలో పేర్కొన్నారు. ఇతను కవిత్వం చెప్పగలడనీ, విభిన్న శైలిలో కావ్యాలు రాయగలడని, స్వర జ్ఞానం ఉందని, సంగీతంలో నైపుణ్యం కలవాడని, మధురంగా కవిత్వం చదువగలడని.... నిజానికి జినవల్లభుడి సామర్థ్యం, నైపుణ్యం ఎదురులేనివనీ పేర్కొంటూ, వాక్‌వల్లభుడుగా కీర్తించారు. ఇతడు అనేక జైన దేవాలయాలను నిర్మించాడు. జినదేవుల గురించి ఒక చైత్యాలయాన్ని నిర్మించాడు. దానికి సమీపంలో త్రిభువన తిలకమనే బసదిని, కవితా గుణార్ణవమనే చెరువును, మదన విలాసమనే వనాన్ని తన అన్న పంపని పేరుమీద నిర్మించినాడు. జైన మునులకు, భక్తులకు భోజనాదులను పెట్టేవాడు. వృషభాద్రి మీద ఉన్న జిన ప్రతిమలకు పాలాభిషేకాలు, ఉత్సవాలు నిర్వహించడంలో ఎంతో ఉత్సాహం చూపేవాడు. ఆ సందర్భంలో అక్కడికి వచ్చే ప్రసిద్ధ జైనులకు, యాత్రికులకు కానుకలు ఇచ్చేవాడని శాసనం ద్వారా తెలుస్త్తోంది.

ఇంకా ఈ శాసనంలో జినవల్లభుడి సోదరుడు పంపమహాకవికి చాళుక్యరాజైన రెండవ అరికేసరి విక్రమార్జునవిజయం కావ్యం రాసిన తరువాత ధర్మవురం (ధర్మపురం) అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని నమ్మనివారు... సుందరమైన వృషభాచలానికి వెళ్ళి చూడండి పంపని కీర్తిని, జినధర్మం గొప్పతనం తెలుస్తుంది అని పేర్కొన్నారు. అంటే ఆనాటి కాలంలో తోటి కవులో, లేదా రాజాస్థానంలో ఉన్న ఇతర వ్యక్తులో పంపని కీర్తిని సహించక ఇటువంటి ఆలోచనలు చేసి ఉండొచ్చని మనం ఊహించవచ్చు. ఈ శాసనం మొత్తం 11 పంక్తుల్లో ఉండగా 3 కంద పద్యాలు శాసనం చివరన ఉన్నాయి.

జిన భవనంబు లెత్తించుట 

జిన పూజల్సేయు చున్కి జినమునులకు న

త్తిన యన్నదానంబీవుటం

జినవల్లభు బోలంగలరె జినధర్మపరుల్‌

దినకరు సరి వెల్గుదుమని

జినవల్లబు నెట్టు నెత్తు జితకవినననున్‌

మనుజుల్గలరే ధాత్రిన్‌

వినితిచ్చిదు ననియ వృత్త విబుధ కవీంద్రుల్‌

ఒక్కొక్క గుణంబ కల్గుదు

రొక్కొణ్డిగా కొక్కలక్క లేవెవ్వరికిం

లెక్కింప నొక్కొలక్కకు 

మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గణంబుల్‌

జిన భవనాలు కట్టించడం, జిన పూజ చేయడం, జినులకు, యాత్రికులకు అన్నదానం చేయడం వంటి లక్షణాలతో జినవల్లభుని కీర్తిస్తారు జినధర్మపరులు. సూర్యుని తేజస్సుతో సమానమై వెలిగే జినవల్లభునివంటి వారు ఈ ధరిత్రిలో లేరు. ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉంటుంది. గుణమణి గణాల్లో ఇతడు గుణపక్షపతిగా, సకల కళా ప్రవీణుడుగా కీర్తించబడ్డాడు. జినవల్లభుడి ఉదార గుణాన్ని, అతని సల్లక్షణాలను వర్ణించిన ఈ శాసనాన్ని ఎఱియమ్మ అనే అతడు లిఖించినట్లు (టంకోత్కీర్ణం) తెలుస్తుంది. 

కర్ణాటకలో జైనవిగ్రహాలు రెండు కాంస్యంతో చేసినవి లభించాయి. వాటిలో ఒకటి 15 అంగుళాల మహావీరుని విగ్రహం. ఈ విగ్రహం జినవల్లభుని భార్య (సజ్జన) భాగియబ్బె చేయించింది. ఈ విషయం విగ్రహం పీఠభాగంలో వెనకవైపు రాసి ఉంది. ఇంకో విగ్రహం కూడా 12 అంగుళాల మహావీరునిదే. వృత్తాకారంలో ఉన్న ఈ కాంస్య విగ్రహంమీద 3 లైన్ల శాసనంలో భాగియబ్బె పైఠాన్‌కు చెందిన యువతిగా పేర్కొనబడింది. ఈమె “పైఠాని భాగియబ్బె బసది” అనే బసదిని కట్టించింది. దీన్ని బట్టి జినవల్లభుడు తెలుగు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధుడుగా ఉన్నట్లు తెలుస్తుంది.

- డా. భిన్నూరి మనోహరి,

9347971177


logo