సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Jul 12, 2020 , 00:02:10

మా పి.వి మేధావి

మా పి.వి మేధావి

మా పి.వి మేధావి

మధుర కళాజీవి

అతని వశం వాగ్దేవి

అతని పరం నవభావి

గద్య పద్యములు యెంతో

హృద్యంగా వ్రాస్తాడు

అర్థవంతమైన రచన

అగాధాలు చూస్తాడు

రాజకీయ సాహిత్య

ప్రజాపత్యం తనది

అతడు ముఖ్యమంత్రి అయిన

ఆనందం మనది

ప్రజాస్వామ్య విధానాన

వ్యష్ఠికన్న సమిష్టికే

అధికమైన విలువైనా

వ్యక్తి విలువ వ్యక్తిదే

ప్రజాశ్రేయము కోరే

వాణ్ణి జనం మెచ్చగలదు

హృదయాలను కానుకగా

ఇచ్చి బలం పెంచలదు

పి.వీ.పరిపాలనలో

పేదల కష్టాలు తొలగి

కరువు కాటకాలు గడచి

కలిమి బలిమి పెరగాలి

కార్మిక కర్షక శక్తులు

కండ గలిగి గుండె గలిగి

సామ్యవాద గమ్యానికి

సరాసరిగ నడవాలి

సమవాదం నా వేదం

అందరికది ఆమోదం

ఆంధ్రాతి ఒక్కటనే

ఆ మాట నా నినాదం

ఎన్నెన్నో ఆశలతో

ఉన్నాము నీ పైన,

తీరని గడ్డు సమస్యలు

తీర్చవయ్య నీవైనా!

ఈ సీమ ఆ సీమ

అన్నిటిపై నీ ప్రేమ

తెలుగుజాతి వొక్కటిగా

దిద్దవయ్య నరసింహా!

విజయదశమినాడు ప్రజల మన్ననలతో

ముఖ్యమంత్రి పదవి పొందినావు

నీకు తిరుగులేదు లోకాన ఇకముందు

జయ! నృసింహరాయ! జనవిధేయ

నాడు బూర్గుల రామకృష్ణ ప్రభుండు

ముఖ్యమంత్రి యైనాడని మురిసిపోతి

నేడు బహుభాష లెరిగిన నీవు మాకు

ముఖ్యమంత్రి నైనావని పొంగిపోతి.


- దాశరథి 


logo