గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 09, 2020 , 23:38:41

ప్రజల ప్రభుత్వం

ప్రజల ప్రభుత్వం

ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహోరాత్రులు ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచిస్తుంటారనేది జగద్విదితం. తాజాగా బుధవారం నాడు జగిత్యాల జిల్లాలో వరద కాలువ ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను స్థానికులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఆరాతీశారు. ఎగువ ప్రాంత గ్రామాలకు నీళ్ళు అందడం లేదని తెలుసుకొని, అక్కడికి నీటిని తరలించడానికి ఎక్కడెక్కడ లిఫ్టులు ఏర్పాటు చేయాలనేది చర్చించడానికి ఇంజినీర్లతో కలిసి రమ్మని ఆహ్వానించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకోవడం, పరిపాలన ఏ విధంగా ఉందనేది అవగాహన చేసుకోవడం కేసీఆర్‌కు అలవాటే. అధికారిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో కారు దిగి ప్రజలతో మాట్లాడుతుంటారు. మిషన్‌ భగీరథ నీళ్ళు వస్తున్నాయా, కరెంటు ఉన్నదా మొదలైన వివరాలు అడిగి తెలుసుకుంటారు. గొర్రెల పెంపకందారులు, ఆర్టీసీ కార్మికులు మొదలైన భిన్నవర్గాల వారిని ప్రగతిభవన్‌కు పిలి పించుకొని సంభాషించడం కేసీఆర్‌ విశిష్టత. 

కేసీఆర్‌ తమ రాజకీయ సహచరులను కూడా నిత్యం ప్రజల మధ్య ఉండాలని సూచిస్తుంటారు. గత ఆరేండ్లలో మంత్రులు ఎక్కువగా హైదరాబాద్‌ కన్నా తమ నియోజకవర్గాలలోనే గడపడం గమనార్హం. గతంలో ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలలో కార్యాలయమే ఉండకపోయేది. ఇప్పుడు ప్రజలు కార్యాలయానికి వెళ్ళి కలువడానికి లేదా విజ్ఞాపనలు సమర్పించడానికి అస్కారం కలిగింది. కేసీఆర్‌ రూపొందించిన అనేక కార్యక్రమలు ప్రజల భాగస్వామ్యం పెంచేవి, నాయకులు తమ ప్రజానీకంతో కలిసిపోయేవే. ఉదాహరణకు- హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగడమే కాకుండా, నాయకులకు అధికారులకు, ప్రజలకు మధ్య అనుసంధానం పెరగడానికి దోహదపడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు మొదట్లో అధికారులే తెరపై కనిపించారు. ఇది గమనించిన కేసీఆర్‌ అన్ని అంచెలలోని ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రజలకు వీలైనంత దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకుపోవడమే కేసీఆర్‌ లక్ష్యం. వ్యవసాయ విస్తరాణాధికారుల నియామకం వల్ల రైతులకు నిరంతరం సలహాలు, తోడ్పాటునందించడం సాధ్యమవుతున్నది. జిల్లాల సంఖ్య పెంచడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువైంది. గతంలో రాష్ట్ర రాజధానిలోనే అధికారుల చేత ప్రణాళికలు రూపుదిద్దుకునేవి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు భిన్నమైన విధానాన్ని అనుసరించారు. గ్రామాల అవసరాల ఆధారంగా కిందిస్థాయిలో నుంచి వివిధ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలకు మార్గం పడాలి. వాటి ప్రాతిపదికన బడ్జెట్‌ రూపకల్పన సాగించాలనే కొత్త పద్ధతికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మన ప్రభుత్వమనే భావన ప్రజలకు ఏర్పడింది. ప్రజల్లో ఈ భావన కల్పించడం సాధారణ విషయం కాదు.


logo