సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Jul 09, 2020 , 23:38:39

కోహినూర్‌ వజ్రం నవాజ్‌ జంగ్‌

కోహినూర్‌ వజ్రం నవాజ్‌ జంగ్‌

‘మానవ దేహంలో ధమనులు, సిరలు రక్తాన్ని సరఫరా చేస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎట్లా దోహదం చేస్తున్నాయో, అట్లానే దేశంలో రహదారుల వ్యవస్థ ఎంత చిక్కగా, ఎంత విస్తృతంగా ఉంటే ప్రగతి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయి.’ ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్న అలీ నవాజ్‌ జంగ్‌ తన హయాంలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక రహదారులను, అన్ని ప్రధాన నదులపై వంతెనలను నిర్మింపజేసినాడు.

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జన్మదినం జూలై 11. హైదరాబాద్‌ రాజ్యంలో ఒక లెజెండ్‌ ఇంజినీర్‌. హైదరాబాద్‌ సంస్థానంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన ప్రతిభా సామర్థ్యాలు గుర్తింపునకు నోచుకున్నాయి. గణితంలో మీర్‌ అలీ అహ్మద్‌ (అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌) ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌ ప్రభుత్వం ఆయనకు స్కాలర్‌షిప్‌ మంజూరు చేసింది. 1896లో ఇంగ్లాండ్‌లోని రాయల్‌ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యను అభ్యసించడానికి పంపించింది. కూపర్‌హిల్స్‌లో చదువు ముగించుకొని హైదరాబాద్‌ ప్రభుత్వంలో 1899లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి 1918 నాటికి చీఫ్‌ ఇంజినీర్‌గా, 1928 నాటికి ప్రజాపనుల విభాగానికి సెక్రటరీగా పదోన్నతి పొందాడు. రిటైర్మెంట్‌ తర్వాత 1949లో చనిపోయేదాకా ఆయన నిజాం వ్యక్తిగత కన్సల్టింగ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు నిరుపమానమైనవి. 

ఆనాటికి దేశంలో యూరోపియన్‌ చీఫ్‌ ఇంజినీర్లదే ఆధిపత్యం. అలీ నవాజ్‌ జంగ్‌ దేశంలోనే చీఫ్‌ ఇంజినీర్‌ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి స్వదేశీ చీఫ్‌ ఇంజినీర్‌. సెక్రటరీ- చీఫ్‌ ఇంజినీర్‌గా ప్రమోషన్‌ పొంది నాటి బ్రిటిష్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఏటీ మెకంజీ నుంచి చార్జ్‌ తీసుకుంటున్నప్పుడు మెకంజీ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ‘నేను నా బాధ్యతలను నాకంటే ప్రతిభావంతుడికి, నాకంటే గొప్ప పరిపాలనాదక్షుడికి అప్పజెపుతున్నాను’ అని కొనియాడారు. 1913లో మూసీ వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలసి అలీ నవాజ్‌ జంగ్‌ రూపొందించిన నివేదికను యథాతథంగా ఆమోదిస్తూ మెకంజీ అన్న మాటలను కూడా గుర్తుచేసుకోవాలి. ‘ఘనత వహించిన నిజాం ప్రభువుగారు ఎంపిక చేసుకున్న సలహాదారులు, ఈ పనికి ఎంపిక అయిన అధికారులు అదృష్టవంతుల’ని అన్నారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రెండింటి సర్వే నివేదికలు తయారుచేసింది మీర్‌ అహ్మద్‌ అలీనే. 1913లో మెకంజీతో ప్రశంసలు అందుకున్న అలీ నవాజ్‌ జంగ్‌ ఆ తర్వాత కాలంలో మెకంజీ స్థానంలో చీఫ్‌ ఇంజినీర్‌గా ఎదగడం యాదృచ్ఛికం కాదు. నవాజ్‌ జంగ్‌ను ఇంజినీరింగ్‌ మేధావిగా చెప్పడానికి ఆయన రూపొందించిన నివేదికలు రుజువులుగా ఉన్నాయి. మద్రాస్‌, మైసూర్‌, హైదరాబాద్‌ రాష్ర్టాల మధ్య దశాబ్దాలుగా నానుతున్న తుంగభద్ర జలవివాదాలను పరిష్కరించి తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం కావడానికి ఆయన చూపిన చొరవ, పరిష్కార మార్గాలు ఆయనను ఒక స్టేట్స్‌మన్‌గా మన ముందు నిలబెడతాయి. 

అలీ నవాజ్‌ జంగ్‌ స్టేట్స్‌మన్‌ షిప్‌ను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మద్రాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజగోపాలాచారి 1962లో అలీ నవాజ్‌ జంగ్‌ మెమోరియల్‌ కమిటీకి రాసిన ఒక లేఖలో కొనియాడారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నివేదిక-1923: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు అవసరాన్ని, ప్రాజెక్టు వలన సమాజానికి ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ నవాజ్‌ జంగ్‌ ఈ విధంగా రాశాడు. ‘నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం వలన ప్రభుత్వానికి వచ్చే రాబడి గురించి నేను ఈ నివేదికలో చర్చించాను. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ప్రత్యక్ష రాబడులు కాకుండా పరోక్ష ప్రయోజనాలూ ఉంటాయి. ప్రజల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా పెరగటంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల ద్వారా అదనపు రాబడి పెరుగుతుంది. భూగర్భజలాలు గణనీయంగా పెరగటంతో బావుల కింద వ్యవసాయం పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి దేశ అవసరాలకు పోను ఎగుమతులు కూడా చేయవచ్చు.

 కరువులు దరిచేరవు. రైల్వేల ద్వారా రవాణా ఆదాయం పెరుగుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా అడవులు, తాటి వనాలు, ఈతవనాలు పెరుగుతాయి. అటవీ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా, ఆబ్కారీ పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రజల కొనుగోలుశక్తి పెరగడంతో అనుబంధంగా విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు కూడా పెరుగుతాయి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు ఊహించలేనంత మార్పు చెందుతాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 3 లక్షల 20 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తే ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష రాబడి సాలీనా 6 కోట్ల రూపాయలు ఉంటుంది.’ ఇవి 1923లో వ్యక్తం చేసిన అభిప్రాయాలని మనం గుర్తించాలి. ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలను నిజాంసాగర్‌ ప్రాజెక్టు అనంతరకాలంలో ధ్రువపరిచింది. నిజామాబాద్‌ జిల్లా నిజాం సంస్థానంలోనే అత్యంత సంపద్వంతమైన జిల్లాగా మారింది. ఈ మాటలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్షరాలా వర్తిస్తాయని చెప్పవచ్చు. 

రహదారులు, వంతెనలు: అలీ నవాజ్‌ జంగ్‌ హైదరాబాద్‌ సంస్థానంలో అనేక రహదారులు, వంతెనలు నిర్మాణం చేశాడు. అవి నేటికీ సేవలందిస్తునాయి. రహదారులు, వంతెనలు దేశ ఆర్థిక ప్రగతికి ఎంత అవసరమో అలీ నవాజ్‌ జంగ్‌ తను రాసిన సాంకేతిక నివేదికల్లో రాశాడు. ‘మానవ దేహంలో ధమనులు, సిరలు రక్తాన్ని సరఫరా చేస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎట్లా దోహదం చేస్తున్నాయో, అట్లానే దేశంలో రహదారుల వ్యవస్థ ఎంత చిక్కగా, ఎంత విస్తృతంగా ఉంటే ప్రగతి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయి.’ ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్న అలీ నవాజ్‌ జంగ్‌ తన హయాంలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక రహదారులను, అన్ని ప్రధాన నదులపై వంతెనలను నిర్మింపజేసినాడు. ఆదిలాబాద్‌ నిజామాబాద్‌ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న గోదావరి నదిపై సోన్‌ గ్రామం వద్ద ఆయన నిర్మించిన అద్భుతమైన రాతి వంతెన వందేండ్లకుపైగా ఇటీవలి దాకా సేవలందించింది. ఆ వంతెనను చారిత్రక వారసత్వ సంపదగా భావించి చెట్లు మొలవకుండా, రాళ్ళు పెకిలించుకుపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత సోన్‌ గ్రామ ప్రజలదే. 

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం సందర్భంగా పురా తవ్వకాలలో దొరికిన తెలంగాణ గర్వించదగిన కోహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌. ఆయన జీవితం, ఆయన సాధించిన విజయాలు తెలంగాణ ఇంజినీర్లకు సదా స్ఫూర్తిదాయకం. 

( రేపు ‘తెలంగాణ ఇంజినీర్స్‌ డే’ సందర్భంగా.. )


logo